బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు-పుట్టిన రోజు జ్ఞాపకాలు

   నిన్న 15 వ తారీఖున అస్సలు సమయం లేకపోవడం వలన వ్రాయలేకపోయాను. మా బంగారు తల్లి చి. నవ్య 3 వ జన్మదినం. హైదరాబాద్ నుండి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య కూడా వచ్చారు. ప్రొద్దుటే ఇంట్లో హారతి ఇచ్చి ఆశీర్వదించాము. మధ్యాహ్నము 4.30 కి తనురోజూ వెళ్ళే క్రెచ్ కి వెళ్ళీ, అక్కడ కేక్ కట్ చేయించి, అక్కడ ఉన్న పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చి ఇంటికి వచ్చాము. అలాగే సాయంత్రం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాము. మళ్ళీ ఇంకో కేక్, రిటర్న్ గిఫ్ట్ లు, వాళ్ళు తినడానికి ఏవేవో తినుబండారాలూ, గేమ్సూ వగైరా వగైరా.. అన్నీ అయిన తరువాత హొటల్ కి వెళ్ళి, మా అల్లుడు, ఇంకో మనవరాలూ, మనవడి తో డిన్నర్ చేసి ఇంటికి వచ్చాము.అమ్మాయి ఓ వారం రోజులకై ఇండియా బయటకు వెళ్ళడం వలన తను రాలేకపోయింది. ఇంత హడావిడి లో నాకు వ్రాయడానికి తీరిక దొరకలేదు

    పుట్టిన రోజు పండగ మా రోజుల్లో ఎలా ఉండేదీ, ఇప్పుడు ఎన్ని మార్పులు చేసికొందీ అనే విషయం మీద కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకొందామనుకొంటున్నాను. ఆ రోజుల్లో పుట్టిన రోజు అంటే, పొద్దుటే తలంటు పోసుకోవడం,ఇంట్లో చుట్టాలు వచ్చి నెత్తిమీద అక్షింతలు వేయడం, సాయంత్రం సినిమాకి పంపడం. ఈ గిఫ్తులూ, రిటర్న్ గిఫ్టులూ ఎక్కడ చూశామూ? నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ, మా నాన్నగారు ఎప్పుడూ నా పుట్టిన రోజుకి ఊళ్ళో ఉండేవారు కాదు. అలాగని మన మీద ప్రేమ లేదనుకోము కదా.సినిమాకీ, కొత్త బట్టలకీ గుర్తు పెట్టుకొని డబ్బిచ్చేవారుగా !! బర్త్ డే కి కేక్కులూ అవీ ఉంటాయని మాకు పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది.

   ఆ రోజుల్లో ఇప్పటి కుటుంబాలలాగ ఉండేవి కాదుగా.ఇంటికి కనీసం అయిదు లేక ఆరుగురు పిల్లలుండేవారు. అందరికీ పుట్టినరోజులు చేసుకోవడం అంటే ఆర్ధికంగా మధ్య తరగతి వాళ్ళమైన మన లాంటి వారికి సాధ్యం అయ్యేది కాదు. ఏదో ఏడాదికి మూడు సార్లు పండగలకీ, ఒకసారి పుట్టినరోజుకీ ( తిథుల ప్రకారమే ) కొత్త బట్టలు. ఖర్మ కాలి, పుట్టినరోజూ, ఇంకేదైనా పండగా ఒకేసారి వచ్చేయంటే, ఓ జత బట్టలు మిస్ అయేవారం.ఆ రెండూ ఒకే వారం లో వచ్చినా ఇంతే సంగతులు. పాపం మా ఇంటావిడకి దసరాల్లో సప్తమి నాడు పుట్టిన రోజూ, అందువలన వాళ్ళ చెల్లెళ్ళ లాగ తనకి దసరా బట్టలు ఉండేవి కావుట. ఒక్కొక్కళ్ళ అదృష్టం అలా ఉండేది. నాకైతే డిశంబర్ లో వచ్చే అమావాస్య. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఏ అమావాస్యకీ ఏ పండగా ఉండేదికాదు !!

    మేము మా పిల్లలి దగ్గరకు వచ్చేటప్పడికి, ఏదో మన జీవితంలో మనకి దొరకనిది ఏదో పిల్లలకి చేసేసి ఉధ్ధరించేద్దామని, వాళ్ళకి ఏవేవో గిఫ్టులూ, కొత్త బట్టలూ, ఏ పిల్ల బర్త్ డే ఐనా రెండో వాళ్ళకి కూడా బట్టలూ ( వాళ్ళేం అనుకోకుండా!!). మనకి బాగా తెలిసిన వాళ్ళెవరైనా వచ్చేవారు. ఎవరినీ ఎప్పుడూ ప్రత్యేకంగా పిలువ లేదు. పూనా లో ఉన్నంత కాలం, కయానీ బేకరీనుండి కేక్ తెచ్చేవాడిని. వరంగాం వెళ్ళిన తరువాత ఆ సదుపాయం ఉండేదికాదు. అందువల్ల ఒక ఓవెన్ కొన్నాము. దాంట్లో నేర్చుకొని మా ఇంటావిడే కేక్ చేసేది.ఎగ్గ్ ముట్టుకునేది కాదు. ఆగొడవంతా నాకిచ్చేది.ఆ గిన్నెలూ అవీ దేంట్లోనూ కలపకూడదు. వామ్మో ఎంత మడీ, ఆచారమో!! అదేం చిత్రమో మా పిల్లల పుట్టినరోజు కి ఎవరినీ పిలవకపోయినా, ఎప్పుడూ పదిహేనుమందికి తక్కువ ఉండేవారుకాదు !!అందువలన ఎప్పుడూ అంతమందికీ తినడానికి ఏదో ఒకటి తయారుచేసి ఉంచేది మా ఇంటావిడ. మా మనవరాలి పుట్టిన రోజు పండగ చూసిన తరువాత, మేము మాపిల్లలకి న్యాయం చేశేమా అనిపించింది. ఈ రోజుల్లో చేసే దానితో పోలిస్తే, అదంతా నథింగ్. పోనీ అలాగని వాళ్ళు ఏమైనా అడిగేవారా అంటే, అదీ లేదు. మరి ఇప్పుడు అంత గిల్టీ ఫీల్ అవడానికి కారణం ఏమిటి ? మనం మన పిల్లలకి చేయలేనిది, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చేస్తున్నారని ఓర్వ లేని తనమా? ఎందుకు దీని గురించి ఇంతగా ఆలోచిస్తున్నానో తెలియదు. మా ఆర్ధిక స్తోమతని బట్టి చేయకలిగింది చేశాము.ఇప్పుడెవ్వరూ మనని అడగటం లేదు మీరు మాకు ఎందుకు చేయలేకపోయారూ అని. ఐనా అదో రకమైన ” ఎంప్టీ ఫీలింగ్ ”

    రోజంతా మా వియ్యాలవారితో ఇదే చర్చ. వాళ్ళకీ, మాలాగే.ఇద్దరే పిల్లలు. మా ఇద్దరి భావాలూ ఒక్కలాగే ఉన్నాయి.వాళ్ళు సాయంకాలం హైదరాబాద్ ట్రైన్ కి వెళ్ళిన తరువాత చివరకి మా కోడలుని అడిగాను. ” నిన్నంతా నవ్యకి పుట్టినరోజు పేరు చెప్పి అంత అట్టహాసంగా చేసారు కదా , చిన్నప్పుడు నీకు, ఇలాగే చేసేవారా, పోనీ చేసిన దానిలో మీకు ఆనందం పొందేవారా ” అని. తను చెప్పిన వివరణ నాకు చాలా నచ్చింది. ” మనం ఉండే పరిసరాలు, మధ్య తరగతి వాళ్ళుండేవి, అక్కడ ఈ అట్టహాసంగా చేయడమూ అవీ ఉండేవి కాదు.అంతే కాకుండా మనం పెరిగిన వాతావరణం, స్కూల్ లో ఉండే స్నేహితులు కూడా మనలాంటి వారే,.ఇదొక కారణం రెండోది మన ఆర్ధిక పరిస్థితి కూడా తెలుసు “.

   ఇప్పుడు మా మనవరాలు వెళ్ళే క్రెచ్ అనండి,మేము ఉండే సొసైటీ అనండి, ఎక్కడ చూసినా అంతా అట్టహాసాలే.మూడేళ్ళ పిల్లకూడా, నా బర్త్ డే కి మా ఫ్రెండ్స్ అందరినీ పిలవాలీ,వాళ్ళు గిఫ్టులు తెస్తారూ, వాళ్ళకి మనం రిటర్న్ గిఫ్టులు ఇవ్వాలీ అని చెప్పడమే.తల్లితండ్రులు వాళ్ళ గారాబు పట్టిలు చెప్పినవి చేయలేకపోతే ఇంతే సంగతులు !! ఇంకో పాతికేళ్ళు పోయిన తరువాత ఈ పుట్టిన రోజు పండగలు ఏ స్థితి కి చేరతాయో మన ఊహకు అందదు !!

%d bloggers like this: