బాతాఖానీ–తెరవెనుక (లక్ష్మిఫణి ) ఖబుర్లు–అర్రే బాగానే ఉన్నారా.

    చిన్న పిల్లలది అదో వింత మనస్తత్వం. ఎక్కడికైనా వెళ్తే , తల్లితండ్రుల్ని బయట పెట్టడమే వాళ్ళ ద్ధ్గేయంగా ఉంటారు.మనం ఏదో గొప్పగా, ” మా వాడు బయట ఏమీ తాగడండి ” అన్నామో మన కొంప ముంచేయడమే తమ జన్మ హక్కులాగ, అదే తాగుతాడు/తుంది.ఇంట్లో మనం ఏమీ పెట్టకుండా మాడ్చేస్తున్నట్లుగా
ఓ పోజు కూడా పెడుతారు. మనం ఓ వెర్రి నవ్వు నవ్వేసి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇంకో టాపిక్ లోకి మార్చేస్తాము.అలాగే రైలు ప్రయాణాల్లో కూడా అలాగే ఉంటారు.ఎక్కడనుంచి వస్తాయో వీళ్ళకి ఈ విపరీతమైన బుధ్ధులు !!

   ఇది ఇలా ఉంటే, తల్లి తండ్రులది అదో రకం.చాలా మంది ఎవరింటికైనా వెళ్తే తమ పిల్లల్ని చాలా కట్టడి లో ఉంచుతారు.మనకీ ఏమీ సమస్య ఉండదు. కొంతమందైతే వాళ్ళ పిల్లల్ని ఎటువంటి కంట్రోల్ లేకుండా మన కొంపమీద వదుల్తారు. మనం ఏమీ అనలేము. ఇంటికి వస్తే భార్యో, భర్తో వీళ్ళకి కాపలా ఉండాలి.
లేకపొతే మన కొంప కొల్లేరైపోతుంది.వాళ్ళ పిల్లలు వాళ్ళకి గారం కానీ, ఊళ్ళోవాళ్ళందరినీ ఎందుకు క్షోభ పెడతారో అర్ధం అవదు. కొంతమందైతే పిల్లలకి అన్నం పెట్టడం చూడాల్సిందే. ఓ కంచం లో ఏదో పెట్టి ఆ పిల్లనో, పిల్లాడినో ఊరంతా తిప్పుతూ బలవంతం చేయడం. అపార్ట్మెంట్ సొసైటీ లలో ఐతే సెల్లార్ లో ఓ సైకిలు మీదో, దేనిమీదో తిప్పుతూ, ఆ డ్రిల్ చేయడం. ఖర్మ కాలి మనలాంటివాడెవడైనా అక్కడనుండి వెళ్తూంటే,” చూడు బూచాడు, అన్నం తినకపోతే నిన్ను ఎత్తుకుపోతాడు ” అని మన ఇమేజ్ అంతా పాడిచేస్తారు.అక్కడ రాజమండ్రి లో ఐతే, నన్ను ఓ డాక్టర్ చేసేశారు. అన్నం తినకపోతే డాక్టర్ అంకుల్ ఇంజెక్షన్ ఇచ్చేస్తారూ, అని ఆ పిల్లని భయ పెట్టడం. పోన్లెండి మరీ బూచాడూ అన లేదు. అప్పటినుంచి ఆ పాప నన్ను చూస్తే భయ పడి పారిపోతుంది. ఏదో తనని చూసినప్పుడల్లా మా నవ్య ని చూసినట్లుంటుందికదా అని నేననుకుంటే ఆ పిల్ల నా దగ్గరకే రాదు.అప్పటికీ నేను అడిగేను ” మీకేం అపకారం చేశానని ఇలా నన్ను హింసిస్తున్నారూ ” అని.వాళ్ళన్నారూ–ఇక్కడ అందరి వంతూ అయిపోయింది, మీరొక్కరే కొత్త ” బక్రా ” అన్నారు ఏం చేస్తానూ ?

   మన ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే, మనం అనవసరమైన త్యాగాలు చేసేసి, మన పిల్లల్ని ” నీ బొమ్మ తీసికోనీయమ్మా, చిన్న బాబు కదూ ” అంటాము. అలాగని వాళ్ళింటికి వెళ్తే అక్కడ ఏమీ ముట్టూకోనీయము. ఇది చాలా అన్యాయం కదూ.ఇలాంటివారిని ” చైల్డ్ అబ్యూజ్ ” కింద అరెస్ట్ చేయించాలి!!

   నిన్న చెప్పానుగా నాకు అందరితోనూ పరిచయం చేసికోవడమనే ఓ జాడ్యం ఉంది. గత 10 సంవత్సరాలుగా, మా నాన్నగారి అబ్దీకం, పూణే లోని రాఘవేంద్ర మఠం లో చేస్తూంటాను. అదే తిథికి పెట్టుకొనేవారు ఓ పదిమంది దాకా ఉంటారు. వాళ్ళందరినీ ప్రతీ ఏడాదీ కలుసుకొనేవాడిని. కలుసుకున్న ప్రతీ సారీ ఒకే డైలాగ్–
” సంతోషం, మళ్ళీ కలుస్తున్నానూ” అని. నేనంటానూ ఎప్పుడైనా నేను కనిపించక మా అబ్బాయి కనిపిస్తే తెలుసుగా… ఈ సారి గోదావరి తీరాన్న కంభం వారి సత్రం లో మా నాన్న గారి ఆబ్దీకం పెట్టాను. మొన్న పూణే లో నా రాఘవేంద్ర మఠం స్నేహితుడొకడు కనిపించాడు. నన్ను చూసి ” అర్రే బాగానే ఉన్నావా, ఇసారి కనిపించకపోతే మేమందరం పాపం నీ గురించే మాట్లాడుకొన్నాం” అని ఓ పరామర్శ చేశాడు.. ఇలా ఉంటుంది ఒక్కో సారి !!

   గత 10 సంవత్సరాలుగా, నేనే కూరలకి వెళ్ళేవాడిని. మార్కెట్ లో ఉన్న కూరల వాళ్ళందరూ పరిచయమే. అందరితోనూ ఖబుర్లు చెప్పడం ఓ అలవాటు ( కొద్దిగా ధర తగ్గిస్తాడేమో అని !!) ఈ మధ్యన రాజమండ్రీ కి మారడం తో , మా అబ్బాయి వెళ్తున్నాడు. వాడితో అందరూ ” బాబా కిధర్ హై” అని పరామర్శా!!అందరితోనూ పరిచయం చేసికొంటే ఇలాంటి ఈతి బాధలు తప్పవు.

   ఇన్ని ఔతున్నా కానీ, నేను నా స్వభావం మార్చుకోను.చెప్పులు కుట్టే వాడి దగ్గరనుండి, కూరల కొట్టు వాళ్ళు,టెలిఫోన్ల వాళ్ళూ, కచ్రా ఎత్తేవాళ్ళూ అందరూ నా ఫ్రెండ్సే. నేను సర్వీస్ లో ఉండగా, మా ఫోర్మన్ ఒకాయన చెప్పేవారు– మనకి ఎంత మంది స్నేహితులుంటే అంత మంచిది. ఎప్పుడైనా మనం ఏ రోడ్డు మీదైనా పడిపోతే, మనని తెలిసినవారు ఎవరో ఒక్కరు ఉంటారు. ఇంట్లో కబురు చెప్పడానికైనా ఎవరో ఒకరుండాలిగా. అలాగే ఆయన రిటైర్ అయిన తరువాత ఒకరోజు న మార్కెట్ లో హార్ట్ ఎటాక్ వచ్చి పడిపోయారు.అక్కడ ఉండే కొట్ల వాళ్ళందరికీ ఈయన తెలుసు. ఆయన అక్కడే స్వర్గస్తులయ్యారు. అ కొట్ల వాళ్ళే ఇంటికి వార్త చేరేశారు.

   .రాజమండ్రీ లో అయితే ఆటో వాళ్ళ దగ్గరనుండి అందరూ స్నేహితులే, మా సొసైటీ లో ఉన్న పాప తప్ప !! మా పిల్లలంటూంటారు ఇంతమందితో స్నేహం ఎలా చేస్తావూ అని.ఈ రోజుల్లో పెద్ద పెద్ద సొసైటీలలో ఒకడికి ఇంకొకడు తెలియదు. తనేమిటో తన కుటుంబమేమిటో అంతే.మన కుటుంబాలు ఎలా ఉన్నాయో అదేదో న్యూక్లియర్ ఫామిలీ అంటారుగా, అలాగే మన ఫ్రెండ్షిప్లు కూడా న్యూక్లియర్ అయిపోయాయి

   మా దగ్గర ఓ డబ్బా కెమేరా ( కోడక్ ) ఉండేది.దాంట్లో ఎనిమిది మాత్రమే బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోలు వచ్చేవి. ఒక సారి పిల్లలకీ, మాకూ రంగుల్లో ఫొటోలు తీయించాలని, మా ఫ్రెండ్ ఒకడిని ఇంటికి పిలిచాను. ఏవేవో తీసి, చివరగా నాకు కూడా విడిగా ఓ ఫొటో తీశాడు. ఓ వారం రోజులు పోయిన తరువాత ( ఇప్పటి లా ఇన్స్టెంట్ వెరైటీ రోజులు కావుగా ) ఫొటోలు అన్నీ తీసికొచ్చాడు. అంతా బాగానే ఉంది, నాది మాత్రం ఎన్లార్జ్ చేసి తెచ్చాడు.. ” ఇదేమిట్రా ” అంటే, మొహమ్మాట పడిపోయి, దానికి డబ్బులు తీసికోకుండా ” ఇది నా దగ్గరనుండి కాంప్లిమెంటరీ, ఉంచండి, తరువాత ఎప్పుడైనా ఉపయోగిస్తుంది ( దండ వేయడానికి అనే అర్ధం వచ్చేటట్లుగా )” అని నాకు అంట కట్టేశాడు !!.

%d bloggers like this: