బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు — దంత సిరి

జీవితంలో భరింపలెనిది పన్ను నొప్పి అని నా అభిప్రాయం.మాములుగా పిప్పి పన్ను నొప్పి పుడితే  ఆ దవడ అంతా వాచిపోతుంది. చిన్నప్పుడైతే అదేదో శొంఠి గంధమో ఏదో రాసేసి న తరువాత తగ్గేది. కొంచెం పెద్ద అయిన తరువాత అయితే క్లౌవ్ ఆయిల్ (లవంగం నూనె ) కాటన్ లో ముంచి అక్కడ పెడితే  తిమ్మిరెక్కేసి అదో శవనగా ఉండేది. ఎలాగోలాగ  ఆ నొప్పైనా భరించగలమెమో కానీ, డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళాలంటే ఎప్పుడూ భయమే !!

అలాంటిది ఒకసారి మా అబ్బాయి కి పన్ను నొప్పి పెడితే భుసావల్ లో ఓ డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళాను ( నా పన్ను కాదు గా !!). ఆయన వాడిని చెక్ చేసి ఓ పన్ను తీసేయాలన్నారు. వాడు చాలా ధైర్యంగా తీయించుకొన్నాడు ( చెప్పానుగా దేంట్లోనూ నా పోలికలు రాలేదు !!).  ఇంత చిన్న పిల్లాడు తీయించుకోగా లేనిది మనకేం భయం అని ప్రెస్టిజ్ కోసం నా పన్నుకూడా చూడమన్నాను. ఆయనకేం, ఇంకో బేరం వస్తోంది కదా అని నా పన్ను కూడా పీకేశాడు.

ఇదివరకెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయలేదు.డాక్టర్ గారు ఓ గంట పోయిన తరువాత ఐస్ క్రీం లూ తినమన్నారు కదా అని ఓ అర డజను  అవి కూడా లాగించేశాము.  సాయంత్రం దాకా బాగానే ఉంది, ఒక్కసారిగా విపరీతమైన బ్లీడింగ్ మొదలెట్టేసింది. డాక్టర్ ని పిలిపించి సెలైన్ కూడా పెట్టించవలసి వచ్చింది ( అప్పుడు మా డాక్టర్ ఫ్రెండ్ ఆ ఊళ్ళో లేరు ). ఈ సైలెన్లూ అవీ చూసి చాలా ఖంగారు వచ్చేసింది. ప్రాణం పోతే ఎలాగా అని– పిల్లల చదువులు కూడా అవలెదు, నాకు ఏదైనా అయితే  నా ఫామిలీ ఏమైపోతుందా అని. ఏమైతేనే ఓ వారం రోజులకి ఆ బ్లీడింగ్ తగ్గింది. ఇంక అప్పటి నుంచీ డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళాలంటే ధైర్యం ఉండేదికాదు.

అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే బాగానే ఉంటుంది. పూణే తిరిగి వచ్చేటప్పడికి నా పళ్ళు  ముందరివి ( ఎత్తుగా ఉండేవి )

సగం సగం విరిగి  ” డిజైనర్    టీత్ ” లా తయారయ్యేయి. అదేదో సినిమాలో కమల్ హాస న్ పళ్ళ లాగ. మళ్ళీ ప్రారంభం నా కష్టాలు. ఒక సారి రూబీ హాల్ కి వెళ్ళి ముందర కి పొడుచుకువచ్చిన పళ్ళని పీకించాను, పైగా నా సలహా మీద అక్కడ కుట్లు కూడా వేశారు ఆవిడ. ఇంక చూసుకోండి ఆ రాత్రంతా బ్లీడింగ్ అవడమే, కాటన్ పాడ్లు అక్కడ పెట్టుకోవడమూ, ప్రతీ గంటకీ మార్చుకోవడమూ.  . అలా ఓ వారం రోజులు బాధ పడ్డాను. ఇంక మా డెంటిస్ట్ కి ఖంగారు పుట్టింది, రక్త పరీక్ష చేయించుకోమంది. అవీ బాగానే ఉన్నాయి, అయినా ఆవిడ అదేదో ఫాక్టర్ 8 కి చెక్ చేయించుకోమన్నారు. దాని గురించి అడిగితే ఆ టెస్ట్ ఏవో ఇంపోర్టెడ్ కెమికల్స్ తో చెయ్యాలీ చాలా ఖర్చు అవుతుందీ అన్నారు. ఇంతోటి పళ్ళకీ అంత ఖర్చు ఎందుకని మానేశాను.

ఆ సమయం లో మా కజిన్  ( నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఏ.ఎఫ్.ఎమ్.సీ లో చదివేవాడు ) మా పక్కనే ఉన్న ఖడ్కీ ఎం.ఎచ్.  సీ.ఓ గా ఉండేవాడు. అతనిని అడిగాను ఈ ఫాక్టర్ 8 వ్యవహారం ఏమిటని–తను నన్ను ఓ కల్నల్ కి అప్పచెప్పి ఏ.ఎఫ్.ఎమ్.సీ లో ఆ పరీక్షలన్నీ చేయించాడు. తేలిందేమిటంటే నాకు ఆ ఫాక్టర్ 8 తక్కువ ఉందనీ, దానివలనే ఈ బ్లీడింగ్ సమస్యా అని. నాకు ఎటువంటి సర్జరీ చేసినా  చాలా సీరియస్సు అవుతుందనీ చెప్పారు. అప్పుడు ఆయనతో  సగంలో ఆగిపోయిన నా పళ్ళ ప్రస్తానం గురించి చెప్పాను. అందుకు ఆయన ”  సర్జరీ చేసేటప్పుడు ఫాక్టర్ 8 సప్పోర్ట్  ఉంటే ఎలాంటి  సర్జరీ అయినా చేయవచ్చు ” అని

అవి అన్నీ నేను చూసుకొంటానూ ఇక్కడే నా హాస్పిటల్ లోనే చేయించేద్దాము అన్నాడు. ఆ మర్నాడు మిలిటరీ హాస్పిటల్ లో చేరిపోయాను. ఎంతైనా కమాండెంట్ గారి సోదరుడినీ, చూసుకొండి అన్నీ రాచమర్యాదలే. వి.ఐ.పి రూం లో చేర్చారు. ఏ.సీ, టి.వీ రాత్రంతా ఇద్దరు డాక్టర్లూ, అన్ని రకాల టెస్ట్ లూ అంతా రాజ భోగమే. పొద్దుటే  కమాండ్ హాస్పిటల్ కి పంపి ఆ ఫాక్టర్ 8 పాకెట్లు ఓ అర డజను తెప్పించేశారు. అదంతా ఓ గంటసేపు నాకు ఎక్కించి, ఆ తరువాత ఒకోసారి      5  పళ్ళచొప్పున , అయిదు సిటింగ్స్ లో మొత్తం మిగిలిన  పాతిక పళ్ళూ పీకేశారు ( అంటే ఈ కార్యక్రమం అంతా పూర్తి అవడానికి మొత్తం 40 రోజులు పట్టింది).. ఆఖరికి నాకు 56 ఏళ్ళు వచ్చేసరికి నా కష్టాలన్నీ తీరాయండి.  ఎంత రిలీఫో, చెప్పలెను. మొదటి సారిగా నానోట్లో రక్తం అనేది లేకుండా గడపకలిగేను.

అదైన తరువాత మా కజిన్ కి మేజర్ జనరల్ గా ప్రమోషన్ మీద లక్నో ట్రాన్స్ఫర్ అయింది. అందరూ పరామర్సించేవారే వీళ్ళ బాధ భరించలెక డెంచర్లు పెట్టించుకోడానికి మళ్ళీ ఎం.ఎచ్ కి వెళ్తే నన్ను ఏ.ఎఫ్.ఎం.సీ కి పంపించారు. అక్కడకి ఓ అర డజను సార్లు వెళ్ళిన తరువాత నాకు డెంచర్లు తయారు చేసి ఇచ్చారు. దీనికంతా అంటే పళ్ళు పీకించుకోడానికీ, డెంచర్లు తయారుచేసికోవడానికీ ఒక్క పైసా ఖర్చు అవలెదు. నా అదృష్టం కొద్దీ మా కజిన్ ఇక్కడే ఉండడం వల్ల, భగవంతుని దయ తో ఈ కష్టాలనుండి గట్టెక్కాను.

డెంచర్లు పెట్టుకొని ప్రాక్టిస్ చేయమన్నారు . అలవాటు పడడానికి కొంచెం టైము పడుతుందీ, ఓపిగ్గా చేయాలి అన్నారు. చాలా నిజాయితిగా ప్రయత్నం చేశానండి. ముందుగా దోశ తినడంతో మొదలెట్టాను, మెత్తగా ఉంటుంది కదా అని. దీనిల్లు బంగారం గాను, ఒక దోశ తిండానికి గంట పట్టింది.

దోశ నోట్లో పెట్టుకోవడం, తింటుంటే ఆ పై డెంచర్ ఊడిపోవడమో లేక ఈ దోశ ముక్క వెళ్ళి దానికింద ఇరుక్కోవడమో, చచ్చేను ఈ గోల భరించలేక. మెత్తగా ఉండే దోశ కే ఇలా ఉంటే పూర్తి భోజనానికి ఎంత టైము పడుతుందో. పైగా ఈ డెంచర్లకి  ఒ స్టీల్ డబ్బా దానికి రొజూ అభిషెకం.  ఈ తిప్పలు ఇంక మనకి వద్దురా బాబూ అని, ఆ డెంచర్లని క్షేమంగా పక్కకి పెట్టేశాను.

అప్పడినుంచీ నోట్లో ఎలాంటి ” ఫారెన్ మెటీరియల్ ” లేకుండా హాయిగా జీవితం గడిపేస్తున్నాను. అందరూ అన్నారూ  డెంచర్లు ఉంటే ఉపయోగం గా ఉంటుంది ఫలానా, ఫలానా అని సలహాలు ఇచ్చారు.  డెంచర్లనెవి అసలు ఎందుకండీ నా ఉద్దేశ్యం లో వాటి ఉపయోగాలు క్రింది విధం గా ఉంటాయి.

1. మనం మాట్లాడేది అవతల వాడికి అర్ధం అవడానికి, 2 మన మొహం సో కాల్డ్ అందంగా కనిపించడానికీ, 3. మనం తిన్నది అరగడానికి.

ఇందులో మొదటి దానికి– నేను చెప్తేగానీ నాకు పళ్ళు లేవని ఎవరికీ తెలియదు–అంత స్పష్టంగా ఉంటుంది నా మాట.

రెండో దానికి– అరవైఎళ్ళు వచ్చిన తరువాత మన వెనక్కాల ఎవరు పడతారండి- పళ్ళున్నా ఒకటే లేకపోయినా ఒకటే

మూడో దానికి–పళ్ళు పీకించుకొని 7 సంవత్సరాలు అయింది- ఇప్పడిదాకా ఎలాంటి సమస్యా రాలేదు ( మా ఇంటావిడ ధర్మమమా అని !!)

పళ్ళన్నీ తీయించుకున్న తరువాత జరిగిన విచిత్రం ఏమిటంటే, నా కళ్ళద్దాలు ఇదివరకు  – 6 ఉండేవి, ఇప్పుడు  -2 అయ్యాయి.

ఒక్కటి మాత్రం గమనించాలి చిన్నప్పుడు మనం ఎప్పుడైనా వేళకాని వేళలో ఆకలేస్తూందంటే  ” ఇప్పుడే కదురా పీకలదాకా మింగావూ ” . ఇప్పుడు అదే చేస్తున్నాను

” పీకల దాకా మింగడమే ( పళ్ళు లేవు గా !!)

%d bloggers like this: