బాతాఖానీ ఖబుర్లు–41

    ఏమిటో మా పిల్లల్ని గురించి, మాగురించి వ్రాయడం మానేసి, ఇన్నాళ్ళూ పిట్టకథల్లోకి వెళ్ళిపోయాను. ఏమిటో రాజమండ్రి వదలి పూణే వచ్చేటప్పడికి, అదీ ప్రతీ రోజూ పిల్లల్ని చూస్తూండడం
వలన కాబోలు, ఆ విషయాల గురించి ఎక్కువ వ్రాయలేదు.

    పూణే లో మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువు బాగానే జరుగుతోంది. చెప్పానుగా మా ఫ్రెండు వాళ్ళని లోకల్ గార్డియన్ గా ఉంచామని, వారేకాకుండా , మా అన్నయ్య గారి అబ్బాయి
నేవీ లో పనిచేస్తూ , దగ్గరలోఉన్న లొనావాలా లో ఉన్న ఐ.ఎన్.ఎస్ . శివాజీ లో ఉండేవాడు, వీకెండ్స్ లో పూణే వచ్చినప్పుడు మా అమ్మాయి క్షెమం అడిగేవాడు.ఒక విషయం మరిచిపోయాను– ఈ అబ్బాయి ఎన్.డీ.ఏ లో చదువుతూండగా నేనూ, మా అమ్మాయీ ఒకసారి తనని చూడడానికి ఖడక్వాస్లా వెళ్ళాము.మాకు మొత్తం ఎకాడెమీ అంతా చూపించాడు.
అప్పుడు అర్ధంఅయింది మన దేశ రక్షణకి, మన పిల్లలు ఎలాంటి ట్రైనింగ్ పొందుతారో.వాళ్ళ చేతిలో మన సరిహద్దులు ఎప్పుడూ సురక్షితంగానే ఉంటాయి. నాకు ఒక్క విషయం లో చాలా గర్వంగా ఉంది, మా చిన్నన్నయ్యగారు హైదరాబాద్ లో రక్షణ శాఖవారి రిసెర్చ్ లాబ్ లో పనిచేసేవారు, వాళ్ళ అబ్బాయి నేవీలో ఉండేవాడు, నాకు పళ్ళ విషయంలో సహాయం చేసిన ఓ కజిన్
ఆర్మీ లో డాక్టర్ గా ఉండేవాడు. ” చంద్రుడికో నూలుపోగు లాగ ” నేను, రక్షణ శాఖ వారి ఆయుధాల కర్మాగారాల్లో పనిచేశాను.
. దురదృష్టవశాత్తూ ,మా చిన్నన్నయ్య గారినీ, వాళ్ళ అబ్బాయినీ దేముడు తనదగ్గరకు తీసికెళ్ళిపోయాడు.

    మా డాక్టరమ్మ గారు కూడా పూణే లోనే ఉండడం వలన మాకు ధైర్యం గా ఉండేది. వీరందరూ కాకుండా, మా ఫాక్టరీలోని ఏ.జి.ఎం గారి అబ్బాయి కూడా మా అమ్మాయిగురించి శ్రధ్ధ తీసికొనేవాడు. మా అమ్మాయి మా నుండి దూరం గా ఉన్నదనే భయం కాని, బాధ గానీ ఎప్పుడూ ఉండేదికాదు. ఇదే కాకుండా నేను ప్రతీ నెలా పూణే వెళ్ళి కలుసుకొనేవాడిని.ఒక్కటే వర్రీ ఆరోజుల్లో, ఎప్పుడైనా తనకి డబ్బు పంపవలసి వచ్చినప్పుడు మాత్రం, కొంచెం శ్రమ అనిపించేది–నా ఉద్దేశ్యము ఆరోజుల్లో ఇప్పుడున్నటువంటి బాంక్ ట్రాన్స్ఫర్లూ, ఏ.టి.ఎం లూ ఉండేవికావు.
ఎస్.బి.ఐ. లో డ్రాఫ్ట్ తయారుచేసి పోస్ట్ ద్వారా, మాకు తెలిసిన వారికి పంపడం, మా అమ్మాయి అక్కడకు వెళ్ళి తీసికోవడమూ. ఇదొక్కటే చాలా తలనొప్పి గా ఉండేది.పాపం ఒక విషయం ఒప్పుకోవాలి–ఏదో కాలేజీ లో చదువుతూందన్నమాటే కానీ, ఎప్పుడూ నేను తలకి మించిన భారం అని ఎప్పుడూ అనుకొనేటట్లుగా డబ్బు అడగలేదు.ఇప్పటి చదువులూ, ఖర్చులూ చూసిన తరువాత నేను తనకి చాలా అన్యాయం చేసేననిపిస్తుంది.ఐనా కానీ అప్పుడూ, ఇప్పుడూ కూడా ఆ విషయంలో మా అమ్మాయి కంప్లైంట్ చేయలేదు. అది నేను చేసికొన్న అదృష్టం.

    అన్ని సెమిస్టర్లూ మంచి మార్కులతోనే పాస్ అయేది. తనకి సంగీతం మీద చాలా ఇష్టం అని చెప్పానుగా, ఆ రోజుల్లో పూణే లో ప్రముఖ గాయకుడు శ్రీ సురేష్ వాడ్కర్ సంగీత ట్రైనింగ్ క్లాసులు చెప్పేవారు.దానికి వెళ్దామని ఆసక్తి చూపించింది. మేము ఆ విషయంలో మాత్రం చెప్పాము ” అమ్మా, ఆ క్లాసులకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పడికి రాత్రిళ్ళు బాగా ఆలశ్యం అవుతుందేమో, పైగా మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి చదువులు ముఖ్యం,హాస్టల్లో రాత్రిళ్ళు 9.00 గంటలకల్లా గేటు మూసేస్తారూ, ఎక్కడికో వెళ్ళి నిద్ర పోవాలీ ఆలోచించు”. ఇప్పటి రోజుల్లో జరుగుతున్న టి.వీ. షోలు చూసి బహుశా మేము తీసికొన్న స్టెప్ తప్పేమో అని ఒకోసారి చాలా గిల్టీ గా ఫీల్ అవుతూంటాము.అప్పుడు ఆ ట్రైనింగ్ కి వెళ్ళుంటే, ఏమో ఈరోజున మా ఇంట్లో కూడా ఓ సునితో, ఇంకో చిత్రా ఓ ఉండేదేమో– పాపం చాలా బాగా పాడేది. మేము తల్లితండ్రులుగా తనుకోరిన ఈ కోరిక తీర్చలేకపోయాము. మే బి అవర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ కారణమేమో!

%d bloggers like this: