బాతాఖానీ-తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు–పెళ్ళి బహుమతులు.

    ఇదివరకటి రోజుల్లో పెళ్ళిళ్ళు అయిదు రోజులు జరిగేవి.అవి తరువాత మూడు రోజులకి దిగాయి. మా రోజులు వచ్చేసరికి ఒకరోజుకి అయ్యాయి.ఇప్పుడైతే గంటల్లోకి వచ్చాయి. ఏదో హాలో,హొటలో కుదుర్చుకోవడం, అక్కడ ఇంకా మిగిలిన గిరాకీలు కూడా ఉంటారు కనుక, మనం ఆ హాల్ ని కొన్ని గంటలకే బుక్ చేసికోవాలి.మన టైము అయ్యేసరికి, తరువాత వాళ్ళు రెడీ అవుతారు

    మా చిన్నప్పుడైతే ఎవరింట్లోనైనా పెళ్ళి అయితే, నాలుగు రోజులు ముందుగా వెళ్ళేవాళ్ళం. పెళ్ళి అయిదు రోజులూ కలిపి మొత్తం పది రోజులూ అంతా పండగ వాతావరణమే,చుట్టాలూ, వాళ్ళతో బాతాఖానీలూ బలేగా ఉండేది. ఆ పదిరోజులకీ గాడిపొయ్యిలు తవ్వించి, వంటబ్రాహ్మల్ని పెట్టి విందు భోజనాలూ అవీను.ఇప్పుడు ఆ హంగామా ఏమీలేదు.ఒక్కొక్కప్పుడు పెళ్ళిళ్ళు ఏదో కొండమీద కూడా చేస్తున్నారు. మాది అలాగే అయింది

    మేము వరంగాం లో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ ఒకతని కూతురు పెళ్ళి అయింది. అక్కడ వాళ్ళకి ముహూర్తాలు మన లాగ అర్ధరాత్రీ అపరాత్రీ ఉండవు. రెండే ముహూర్తాలు– ఒకటి మిట్టమధ్యాహ్నం 12 గంటలకీ, రెండోది సాయంత్రం ఆరు గంటలకీ.పెళ్ళి కూడా తమాషాగా ఉంది, ముందుగా మనం ఇచ్చే గిఫ్టులు, నోట్ చేసికోవడానికి ఒక క్యూ ఉండేది.దానిని మైక్ లో చెప్పేవారుకూడానూ.ఆ తరువాత స్తేజ్ మీద ఏవో మంత్రాలు చదవడం,అందరూ ” సావధాన్ శుభమంగళ్ ” అంటూ చప్పట్లు కొట్టడం.అంతే.చిత్రం ఏమిటంటే, ఆ పెళ్ళిలో మాఫ్రెండ్ ( పెళ్ళికూతురి తండ్రి) కూడా నాతోనే నుంచొని చప్పట్లు కొట్టడం !!

    ఎక్కడినా హొటల్ లో పెళ్ళి అయినప్పుడు కొన్ని గమ్మత్తులు కూడా జరుగుతూంటాయి. మా ఫ్రెండొకాయన ఒక పెళ్ళికి వెళ్ళబోయి, ఇంకొకళ్ళ పెళ్ళికి వెళ్ళి ,బహుమతీ కూడా ఇచ్చి వచ్చాడు.చూశాడుట ఇక్కడేమిటీ మనకి తెలిసిన వాళ్ళెవరూ లేరేమిటీ అనుకుంటూ, స్టేజ్ మీదకు వెళ్ళే క్యూ లో నుంచొని ఆ తరువాత తన టర్న్ వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో గిఫ్ట్ పెట్టి వచ్చాడు.అప్పుడు గమనించాడు తను వెళ్ళవలసిన పెళ్ళి అది కాదని, అయినా చేసేదేమీలేక, భోజనం చేసి వచ్చాడు. ఈ మధ్యన మా ఇంటావిడని రాజమండ్రి లో ఎవరో ఏదో నోముకి పిలిచారు.సరేనని వెళ్ళింది. పిలిచిన వాళ్ళ ఇల్లు సరీగ్గా తెలియదు, ఏదో ఎవరి ఫ్లాట్ ముందరో చెప్పులూ అవీ ఉన్నాయి కదా అని అక్కడ లోపలికి వెళ్ళింది. అక్కడ వాళ్ళు, పెళ్ళికూతురికి మీది కట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఈవిడ వచ్చిందికదా అని ( పిలవని ముత్తైదువ ) బోల్డు సంతోషపడిపోయి చేతిలో వాయినం అవీ పెట్టేశారు.

    కొన్ని మొహమ్మాటం పిలుపులు ఉంటాయి. ఏదో అక్కడ ఉంటున్నాముకదా అని పిలుస్తారు. వాళ్ళెవరూ మనకి తెలియదు. అయినా చేతిలో ఏదో పెట్టాలి. ఇదివరకటి రోజుల్లో అయితే, ఏవేవో స్టీల్ సామాన్లు పెట్టేవారు, చాలా సార్లు ఒకే వస్తువు ఓ అరడజను దాకా ఉండేవి.పిల్ల కాపరానికి కావల్సిన స్టీలు సామానంతా వచ్చేది.ఆ తరువాత కుక్కర్లూ, మిక్సీలూ, డిన్నర్సెట్లూ
అన్నీకూడా రెండేసి, ఒక్కొక్కప్పుడు మూడేసీ కూడా వచ్చేవి. ఆ తరువాత ఇది చాలా గొడవ అయిపోతూందని, గిఫ్ట్ వోచర్లిచ్చేవారు.తెలిసున్నవాళ్ళనైతే అడగొచ్చు, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వొచ్చు.

    ఇంక ఆఫీసుల్లో పిలిచినప్పుడు, అక్కడ అంతా చందా వసూలు చేసి అందరితరఫునా ఒకే గిఫ్ట్ కొంటారు.దీనివలన సమస్య ఏమిటంటే, అందరూ కలిసేనా వెళ్ళాలి, లెదా ఆ గిఫ్ట్ కొని తీసికొచ్చేవాడు వచ్చేదాకా వేచిఉండాలి.ఆ వచ్చేవాడు ఆడుతూ, పాడుతూ ఎప్పుడో వస్తాడు. ఇంతలో పుణ్యకాలం వెళ్ళిపోతుంది.మనం ఎక్కడైనా బాగా తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్తే ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేబదులు, ఇదివరకటి రోజుల్లో నూట పదహార్లు,వెయ్యినూటపదహార్లూ ఇచ్చేవాళ్ళు.ఇప్పుడేమయ్యిందంటే మనం వెళ్ళే మొహమ్మాటం పిలుపులు వెయ్యినూటపదహార్లు ఎక్కువా, నూటపదహార్లు మరీ తక్కువగానూ ఉంటున్నాయి. అందుకని వయా మీడియా గా మనిషికి వంద చొప్పున మనం వెళ్ళేశాల్తీలని బట్టి లెఖ్ఖేసి ఓ కవరులో పెట్టి ఇవ్వడం.ఆ గృహస్థుకి మన తరఫునుండి సహాయం అనుకుంటాము కానీ , ఆ పాకెట్లన్నీ పెళ్ళికూతురో, పెళ్ళికొడుకో తీసేసుకుంటారు

    ఏవో కారణాలవల్ల మనం ఒక్కళ్ళే వెళ్ళాం అనుకోండి, గిఫ్ట్ తీసికుంటారు, కానీ వాళ్ళు పెళ్ళి సందర్భం గా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లాంటి పాకెట్టో, బాగ్గో, మగవాళ్ళకి ఇవ్వరు. మనకి జేబురుమ్మాలే గతి !!.

%d bloggers like this: