బాతాఖానీ-తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు–ఆత్మవిశ్వాసం

    నాకు ఒకసారి సర్వీసు లో ఉండగా ఓ రోజు ఖాళి గా కూర్చొంటే అవేవో వెర్రి మొర్రి ఆలోచనలు వచ్చేశాయి. నా చుట్టూ ఎవరిని చూసినా

అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లల దగ్గరనుంచి, పెద్దవాళ్ళ దాకా ఏదో ఒకదానిలో ప్రావీణ్యత సంపాదిస్తారు. ఆఖరికి మా ఇంట్లో మా ఇంటావిడ దగ్గరనుండి

పిల్లల దాకా ఏదో ఒకదానిలో స్పెషాలిటీ కనిపిస్తుంది. పిల్లలకి భగవంతుని దయ వలన చదువులోనూ, మా ఇంటావిడ కి వంట లోనూ, అల్లికలూ, కుట్లలోనూ, అన్నిటికంటే ముఖ్యంగా

ఇల్లు నీట్ గా ఉంచడం లోనూ, ఏమీ లేకపోతే నామీద గయ్య్ మనడంలోనో, సంథింగ్ స్పెషల్.

    నాకు దేనిలోనూ ప్రత్యేకత ఉన్నట్లు అనిపించలేదు. ఓ సైకిలు తొక్కడం రాదు, ఇప్పుడు చిన్న పిల్లలుకూడా సైకిలు మీద స్కూల్స్ కి వెళ్ళడం

చూస్తూంటాను. ఓ పాట రాదు, ఆట రాదు. ఏమైనా వ్రాయ కలనా అంటే అదీ రాదు. ఎప్పుడైనా స్టేజ్ మీదకు వెళ్ళవలసి వస్తే కాళ్ళు వణుకుతాయి. స్విమ్మింగ్ రాదు. నీళ్ళంటే భయం.

ఎక్కడ చూసినా, ప్రపంచం చాలా ఫాస్ట్ గా వెడుతూంది. ఎవరైనా చిన్న పిల్లల్ని కంప్యూటర్ మీద పనిచేయడం చూస్తే ఇంకా డిప్రెషన్ వచ్చేసేది.చాలామంది ఏదో ఒక వాయిద్యం నేర్చుకొంటారు

మా పెద్ద మనవరాలు గిటార్ నేర్చుకొని వాయిస్తుంది.

    ఇలా ఎందుకూ పనికి రాని జీవితం, ఎవరికోసం అనే డిప్రెషన్ లోకి వచ్చేశాను. మా డాక్టర్ ఫ్రెండ్ దేష్పాండే గారిని అడిగాను. ఆయన అన్నారూ

” నీలో ఏమీ ప్రత్యేకత లేదని ఎందుకు అనుకుంటావూ, అది అవతల వాళ్ళకి తెలుస్తుంది. నీకొచ్చే జీతం లో భార్యనీ, ఇద్దరు పిల్లల్నీ పోషించావు.పిల్లలకి చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళమీద

వాళ్ళుండేటట్లుగా చేశావు” అన్నారు. అవేమీ ప్రత్యేకతలు కావు అదొక రొటీన్,నన్ను నన్ను గా గుర్తిస్తే అదీ ప్రత్యేకత, అన్నాను. అంటే ఆయన అన్నారూ ” నువ్వు ఫాక్టరీ లో చేసే పని

ఇంకొకళ్ళు చేయగలరా, వరంగాం లో ఉన్నప్పుడు ఐ.ఎస్.ఓ గురించి మాట వచ్చినప్పుడు ఇప్పటికీ నీ పెరే చెప్తారు. ఇచ్చిన పనిని నిస్వార్ధంగా,శ్రధ్ధగా చేయడం కూడా ఓ ప్రత్యేకతే, ఊరికే

నిరుత్సాహ పడకూడదూ . అని నన్ను ప్రోత్సహించారు.అప్పూడు ఆయన చెప్పినది ఆలోచిస్తే నిజమేమోఅనిపించింది. అందుకే సరి అయిన సమయం లో మనకి సరి అయిన సలహా చెప్పే

స్నేహితుడు ఒక్కడైనా ఉండాలనేది నా అభిప్రాయం.

    రిటైర్ అయిన నాలుగు సంవత్సరాలకి, గోదావరి తీరాన ఉండాలనే కోరిక కలగడం ఏమిటి,వెంటనే మార్చేశాము.గోదావరి గాలి తగిలేటప్పడికి నాలో

ఎప్పుడూ లేని ఈ వ్రాయడం అనే కొత్త వ్యాపంగం బయటకు వచ్చింది. ఇదివరకు కొన్ని రోజులు ఇంగ్లీష్ లో వ్రాశాను. కానీ దానిని ఎవరూ చదివిన దాఖలాలు లేవు( ఏదో మొహమ్మాటానికి

మా పిల్లలు తప్ప !!). ఆ తరువాత ఇంగ్లీష్ పేపర్లకి ఉత్తరాలు వ్రాయడం, అది పడిందో లేదో అని మర్నాడు పేపర్ చూడడం. ఈ పని మొదట్లో రాజమండ్రి వచ్చిన కొత్తలో కూడా చేశాను

పాపం ఒకాయన మాత్రం ఎప్పుడినా ఫోన్ చేసేవారు ” మీ లెటర్ చదివానండీ ” అని.తెలుగులో వ్రాయడం నేర్చుకున్న తరువాత స్వాతి వార పత్రిక లో నా లెటర్ అచ్చయినప్పుడు, చాలా

ఆనందం వేసింది. బ్లాగ్గులు వ్రాయడం మొదలుపెట్టిన తరువాత మీ అందరి అభిమానానికీ పాత్రుడనయ్యాను.

    కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయింది. ఇంక ఇప్పుడు ఇంకోళ్ళకి సలహాలు కూడా ఇస్తున్నాను ( మా ఇంటావిడకే లెండి !!). ఎప్పుడూ, పిల్లలూ,

పిల్లలూ అనొద్దు, నీకు ఒక లోకం నిర్మించుకో మని చెప్పాను. కంప్యూటర్ లో తెలుగు లో వ్రాయడం నేర్చుకుంది. బాగానె ఉందనుకున్నాను.ఏ.టి.ఏం లో డబ్బు తీసికోవడం, ఆన్లైన్లో

టికెట్ తీసికోవడం నేర్పాను. తన కాళ్ళమీద తనుండాలని– ఇది ఎంత దాకా వచ్చిందంటే ఈ మధ్య మేము పూణే లో ఓ రెసెప్షన్ కి వెళ్ళామని చెప్పానుగా, ఆ రోజున, మమ్మల్ని

ఇంటికి వెళ్ళిపోమని, తను ఆ రాత్రి అక్కడే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉండీపోయి మర్నాడు పొద్దుటే వచ్చింది. ఆ రెసెప్షన్ లో కూడా, ఎవరో మా గురించి మాట్లాడుతూ ” అదిగో వాళ్ళే

బెల్లం మిఠాయి అంకుల్, ఆంటీ ” అని అనడం వినిపించేసరికి ఓ సారి తల ఎగరేసి కాలరెత్తేసుకుంది . ఫరవా లేదూ నా మొగుడి గురించి కూడా మాట్లాడుకుంటున్నారూ అనుకుంది.

    మీలో చాలా మంది నెట్ లో వచ్చే కౌముది మాస పత్రిక చదువుతారనుకుంటాను, దానిలో ప్రముఖ రచయితలు– యెండమూరి, మల్లాది, వంగూరి.

గొల్లపూడి, ఇంకా ఎందరో మహానుభావులు వ్రాస్తారు. ఈ నెల అంటే జూన్ సంచిక లో నేను వ్రాసిన ” మా మంచి టీచర్లు ” కూడా ప్రచురించారు. ఫర్వాలెదూ, నాక్కూడా ఎంతోకొంత

వ్రాయడం వచ్చిందీ అని నామీద నాకు నమ్మకం ఇప్పూడిప్పుడే వస్తూంది.,

%d bloggers like this: