బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు–సీనియర్ సిటిజెన్స్

   నేను ఈ వేళ వ్రాయబోయే విషయం నా అనుభవాలకు సంబధించినది మాత్రమే. నేను ఎవరినీ ఉద్దేసించి వ్రాయడం లేదు నిన్న రాత్రి ఓ పెళ్ళి రిసెప్షన్ కి వెళ్ళాము. మా ఇంటావిడకి ఆవిడ స్నేహితురాలు.అక్కడ మా పూర్వ స్నేహితుడు కనిపించారు. ఆయనకూడా అమలాపురం వారే. ఇన్నాళ్ళూ పూణే, యు.ఎస్, హైదరాబాద్ లలో గడిపి ఇప్పుడు అమలాపురం లో ఉండాలనిపించిందిట. నాకైతే చాలా ఆనందం వేసింది.నాలాంటి పైత్యం ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారంటే సంతోషం కాదండీ ? ఆయనతో వివరంగా మాట్లాడడానికి టైము కుదరలేదు. అయినా అమలాపురం లోనే సెటిల్ అవుతున్నారుగా, రాజమండ్రి నుండి ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాను. ఆయన భార్యా, మాఇంటావిడా కలసి, నా మీదకు దండెత్తేశారు, చివరకి ఈ వయస్సులో అత్తారింటికి వెళ్తున్నామూ అని.

    ఈ వేళ సాయంత్రం మా పక్క సొసైటీ లో ఒక స్నేహితుడున్నాడు. నాకంటే చాలా ముందర రిటైర్ అయ్యారు.నేను ఏవో కూరలు కొనడానికి వెళ్తూంటే, బస్ స్టాప్ లో కూర్చొని కనిపించారు. తిరిగి వచ్చేటప్పడికి, నా కోసం ఆగారు. ఖబుర్లు చెప్పడానికి. మూడు నెలలైందిగా కలుసుకొని– మాములు కుశల ప్రశ్నలు అయ్యాయి. మేమంతా క్షేమం, మీరంతా క్షేమం అని తలుస్తానూ ఎట్సట్రా ఎట్సట్రా..నన్ను అడిగారూ, అస్సలు నువ్వు అంత దూరం వెళ్ళావుకదా, నీకు కాలక్షేపం ఎలా జరుగుతుందీ, అని. అంటే నేను చెప్పానూ–మీరు కాలక్షేపం గురించి అడుగుతున్నారూ, నాకైతే తీరిక సమయం దొరకదూ అని. ఏమైనా ఉద్యోగం లో చేరావా, అంటే ” నాకు 42 సంవత్సరాలు గవర్నమెంటు లో పనిచేసిన తరువాత ఇంకా ఇంకోళ్ళ క్రింద పనిచేసే ఆసక్తి లేదూ ” అన్నాను. మేము రాజమండ్రి వచ్చేముందర మా అబ్బాయి కి కూడా ఇదే సందేహం వచ్చింది– అక్కడకెళ్ళేం చేస్తావూ, ఎవరూ తెలియదు కదా — అని. నాకైతే అసలు అలాంటి సందేహం ఎప్పుడూ రాలేదు. అక్కడ మొదట్లో కొంచెం కొత్తగా అనిపించింది.రోజూ బయటకు వెళ్ళడంతో, మన మొహం అందరికీ పరిచయం అవుతుంది. ఓ నాలుగు రోజులు వరుసగా చూసేటప్పడికి, ముందు నవ్వుతో ప్రారంభం అయి, ఆ తరువాత ” హాయ్ ” లోకి వెళ్తుంది. నేను ప్రతీ రోజూ, గోదావరి గట్టుమీదున్న దేవాలయాలకి వేళ్తాను. చెప్పానుగా, అక్కడ దండం పెట్టుకుంటూంటే మన పేరూ, గోత్రం అడిగి పూజ చేస్తారు. అక్కడ ఉండే పూజారులకు ఎంతగా అలవాటైందంటే , నన్ను అడగకుండానే, మా గోత్రం తో పూజ చేసేస్తున్నారు. ఏ కారణం తో నైనా వెళ్ళలేకపోతే మర్నాడు అడుగుతారు. వాళ్ళకీ, మనకీ ఏం పరిచయం ? అలాగే కొట్ల వాళ్ళూ అంతే.అక్కడ రెండు మాల్స్ లాంటివి ఉన్నాయి–స్పెన్సర్స్ ఒకటీ, మోర్ ఒకటీ,బట్టల దుకాణం ” మెగా మార్ట్ ” ( అరవింద్ మిల్స్ వాళ్ళ ఔట్లెట్ ). అక్కడకి ప్రతీ రోజూ వెళ్ళం. అయినా వెళ్ళిన వెంటనే పేరు పెట్టి పలకరిస్తారు, ఎందుకనీ, మనం వాళ్ళతో మాట్లాడే పధ్ధతి గుర్తు పెట్టుకొని. నేను చెప్పేదేమిటంటే, మనం అవతలి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు అలా రెసిప్రొకేట్ చేస్తారు. దానికి వయస్సు తో సంబంధం లేదు. నేను పొద్దుటే వెళ్ళినప్పుడు, ప్రతీ రోజూ, ఓ చిన్ని పాప ( మా నవ్య కంటే కొంచెం పెద్దది ) స్కూల్ బస్సుకోసం వెయిట్ చేస్తూంటుంది.” నేనే ఓ రోజు ముందుగా ” హాయ్ “అని పలకరించాను. అప్పటినుండీ ప్రతీ రోజూ నన్ను పలకరిస్తుంది. ఓ రోజు వాళ్ళ అమ్మగారితో నుంచుంది.నన్ను చూడగానే పలకరించేటప్పడికి, ఆవిడకు ఆశ్చర్యం వేసింది.” ఇది ఎవరితోనూ మాట్లాడదూ, మీతో ఎలా ఫ్రెండ్షిప్ అయిందండి” అన్నారు. నేను ఒక విషయం గమనించాను, మన నొరు మంచిదైతే ఊరంతా మంచిగా ఉంటుందని.మంచిగా ఉండడం అనెది ఒక రకమైన పెట్టుబడి. అందులో ఎప్పుడూ నష్టాలుండవు. ఏమైనా ఉంటే లాభాలే ( ఓ కొత్త స్నేహితుడిని సంపాదించడం )

   .మాకు అన్నింట్లోనూ రాజమండ్రి లో అయిన పరిచయాలలో, మన బ్లాగ్ మిత్రులు–రాకెశ్వర్, ఆంధ్రామృతం.కాం చింతావారూ, మరో మిత్రుడు చామర్తి శాస్త్రి. రాకేశ్ తో మొదట బ్లాగ్ లో పరిచయం అయింది ( ఏదో రాజమండ్రి లో ఉన్న పుస్తకాల షాప్ గురించి అడిగితే నేను కొత్తగా తెలుగు టైప్ చేయడం నేర్చుకున్న కొత్త రోజులు, ఏదో సమాధానం వ్రాశాను) అలా మొదలైన పరిచయం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఓ రోజు ఫోన్ చేసి, మీ ఇంటికి ఓ ఇద్దరు మిత్రులతో వచ్చి కొద్దిసేపు గడిపి పరిచయం చేసుకుంటామూ , అన్నాడు.సరే అన్నాను.మా ఇంటావిడ అడిగింది ” ఆ వచ్చేవాళ్ళెవరూ, వాళ్ళు మీ వయస్సు వాళ్ళా” అంది. నాకేం తెలుసూ, వచ్చిన తరువాత తెలుస్తుందీ అన్నాను.తీరా చూస్తే అందులో ఇద్దరు మరీ చిన్నవాళ్ళు ( 30 లోపు ), చింతా ఆయనైతే ఫర్వాలేదు, ఉద్యోగం లోంచి రిటైర్ అయ్యారు. వారితో ఆనాడు అయిన పరిచయం ఎప్పుడూ మరువలేము.మమ్మల్ని కూర్చోపెట్టి ఆయనైతే ఆశువు గా పద్యాలు వ్రాసేశారు, దానికి సమాధానం గా, రాకేష్ ఇంకా చెలరేగిపోయాడు !! శాస్త్రి అయితే ” ఓ సైలెంట్ స్పెక్టేటర్ “గా ఉండి ఈ ఆనందాన్ని పంచుకొన్నాడు.అప్పుడు ఆయన వ్రాసిన పద్యాలూ , అప్పుడు తీసికొన్న ఫొటోలూ ఇంకో సారి పోస్ట్ చేస్తాను.నాలుగు గంటలు ఎలా గడిచి పోయాయో తెలియదు. నేను చేసికొన్న అదృష్టం ఒకటేమిటంటే, మా దగ్గరకు వచ్చిన వారెవ్వరూ ఇంకోసారి రావడానికి సంకోచించరు

   .వినే వాళ్ళుండాలే కానీ, నేను ఎంతసేపైనా ఖబుర్లు చెప్పగలనూ, వినగలనూ.ఎవరి వ్యక్తిగత విషయాలమీదా మాకు ఆసక్తి లేదు.ఏదైనా సలహా అడిగితే చెప్పుతాము. మనం ఏదైనా బాంకుకి కానీ,రైల్వే స్టేషన్ కి కానీ వెళ్తే సీనియర్ సిటిజెన్ లాగ కనిపిస్తే అక్కడ తప్పకుండా మనకి ప్రైయారిటీ ఉంటుంది. ఒకసారి ఇక్కడ కర్కీ స్టేషన్ లో ఏమయ్యిందంటే, నన్ను ముందుకి పంపారు, ఇంతలో మా స్నేహితుడు ఒకరు, నాకంటే, చాలా ముందు రిటైర్ అయిన వారు, వచ్చి అక్కడ నాతో పాటుగా నుంచోబోతే, అందరూ అభ్యంతరం చెప్పారు. కారణం అతని జుట్టు నల్లగా ఉంది ( రంగు వేసికోవడం వలన ). రంగు వేసికోవడం ఎవరిష్టం వారిది.అందులో ఎవరినీ విమర్సించే హక్కు ఎవరికీ లేదు.మన వయస్సు కూడా దృష్టిలో పెట్టుకోవాలనేది నా అభిప్రాయం.మనం ఉండవలసినట్లుగా ఉంటే చూసేవారికెవరికైనా మన మీద గౌరవం కలుగుతుంది. ఇక్కడ నన్ను కలుసుకున్న మా స్నెహితుడు అడిగాడూ , ” నువ్వు మూడు నెలల తరువాత వచ్చావుకదా, మీ అబ్బాయి నీతో ఎంతసేపు గడుపుతాడూ” అని. ” మా అబ్బాయికి పొద్దుటే ఆఫీసుకెళ్ళి సాయంత్రం వచ్చిన తరువాత , తన కూతురితో గడపాలని అనుకుంటాడు గానీ, మనతో ఎలా గడుపుతాడూ ” అన్నాను. నేను చెప్పేది ఏమిటంటే , మనం ఆలోచించే పధ్ధతి ని బట్టి ఉంటుంది మన జీవితం.ఇంకా చాలా వ్రాయాలని ఉంది. ఇంకోసారి వ్రాస్తాను.

%d bloggers like this: