బాతాఖాని-తెరవెనుక (లక్ష్మిఫణి) ఖబుర్లు–రైలు ప్రయాణం

రెండు రోజులనుండి కనిపించడం లేదూ, ” వదిలేడురా బాబూ ” అనుకుంటున్నారా ? నేనెక్కడికి వెళ్తానండీ ? మా పిల్లల్ని చూడడానికి కోణార్క్ లో వెళ్తే బాగానే ఉంటుంది.నేను మామూలుగా ఆన్లైన్ లొనే టికెట్లు బుక్ చేస్తూ ఉంటాను.ప్రతీసారీ అప్పర్,మిడిల్ బెర్త్ లే వస్తూంటాయి. పెద్ద గొప్పగా బుక్ చేస్తున్నప్పుడు, మన ప్రిఫరెన్స్ కుడా అడుగుతారు. అప్పతికీ ఒకసారి నేను ఐ.ఆర్.సి.టి.సి వాల్లని అడిగాను–మీరు ఖాళీలు ఉన్నప్పుడు కూడా సీనియర్ సిటిజెన్స్ కి క్రింద బెర్త్ లు ఎందుకు ఇవ్వరూ అని. అదెదో రాండం పధ్ధతిలో చేస్తారూ, అది మా చేతిలోలేదూ, అని సమాధానం ఇస్తూ ఓ ఉచిత సలహా కుడా ఇచ్చారు– మీరు మీ తోటి ప్రయాణీకులతీ అడ్జుస్ట్ చేసుకోవచ్చూ అని. నెను సీనియర్ సిటిజెన్ అయినప్పటి నుండీ అదే పనిచేస్తున్నాను. కోణార్క్ రాజమండ్రి వచ్చేసరికి అర్ధరాత్రవుతుంది, అప్పుడు ఎవరినీ లేపేందుకు వీలు పడదు, నాకు అంత ఎత్తు ఎక్కడం కుదరదు. ఇలా కాదని అప్పటినుంచీ, కాకినాడ–భావ్నగర్ లో వెళ్తున్నాము. ఆట్రైన్ రాజమండ్రి పొద్దుట 5.00 గంటలకి రావాలి. ఎప్పుడూ రాదు. అలాగని మనం ఆలశ్యం గా వెళ్తే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది !! ఫోన్ చేసి కనుక్కుందామా అంటే రాజమండ్రి లో తెల్లవారుఝామున మనకి జవాబు చెప్పేవాడుండడు. అందువల్ల, రాత్రంతా మెళుకువగా ఉండి, పొద్దుటే ఆటో లో 4.30 కి రాజమండ్రి స్టేషన్ కి చేరాము. ట్రైన్ 5.00 గంటలు లేటన్నారు. ఆఖరికి 10.30 నిమిషాలకి వచ్చింది. ఈ సారి మాకు రెండూ లోయర్ బెర్త్ లే దొరికేయి. మా ఇంటావిడ అంటూనేఉంది. ఇలా రావడం విచిత్రం, ఏదో ఒకటి జరుగుతుందని. దీని ధర్మమే ఈ లేట్ గా రావడం. పైగా ఇంకో బాధ–దీనికి పాంట్రీ కార్ లేదు. ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ కదా ఎందుకు లేదూ అని విచారిస్తే తెలిసిందేమిటంటే–ఇందులో ఎక్కువ ప్రయాణీకులు, మార్వాదీ లూ, గుజరాతీలే ఉంటారు. వారు తమతోనే తెచ్చేసుకుంటారు రెండు రోజులకీ సరిపోయే తిండి. దీని వలన పాంట్రీ కారు ఒకసారి పెట్టేరుట–కానీ వాడు నష్టాలు భరించలేక పారిపోయాడు ఇంకెవ్వరూ ముందుకు రాలేదు.ఇదండీ ఈ ట్రైన్ భాగోతం!! చెప్పేదేమిటంటే ట్రైన్ లో మనకి ఎదురయ్యే అనుభవాలు- ప్రయాణం లో చదువుకోవచ్చుకదా అని నెను అన్ని రకాల పుస్తకాలూ, పేపర్లూ (తెలుగువి) కొంటాను. ఇంగ్లీష్ వి అయితే అందరూ అడుగుతారు కనుక. మన అదృష్టం ఎప్పుడూ బాగుండదు. ప్రయాణం లో కొందరు ” ప్రాణులు ” ఉంటారు. ఎదుటివాడెవడైనా ఏదో పుస్తకమో, పేపరో తెరిస్తే చాలు ” గుంట కాడ నక్క ” లాగ ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ పేపర్ ఎప్పుడు అడగడమా అని. మనం ఏదో ఖబుర్లు చెప్పడానికి పేపర్ పక్కన పెట్టేమనుకోండి, సిగ్గూ శరమూ వదిలేసి ” ఓ సారి ఇలా ఇవ్వండి చూసి ఇస్తానూ ” అని మన ప్రమేయం లేకుండానే లాగేసుకుంటాడు!! చివరకి ఆ పెపర్ వాడు కొన్నంత పోజు పెట్టేస్తాడు.మనం అడిగేమంటే అదేదో వాడి సొమ్ము ధార పోస్తున్నట్లుగా మొహం పెడతాడు. దీని కి కొసమెరుపేమంటే వాడి ఫామిలీ భోజనం చేసేటప్పుడు, వాడి బట్టలు పాడౌకుండా మన పేపర్ అడుగుతాడు. ఇంక మేగజీన్లైతే అడగఖ్ఖర్లెదు. ” అరే స్వాతి తెచ్చారా, ఆంధ్రభూమి ఈ వారానిది రాలేదా ” అని ఓ పరామర్శా !!ప్రపంచం లో ఉన్న ప్రతీ సమస్య మీదా, ప్రతీ తెలుగు సీరియల్ మీదా తన అమూల్యమైన అభిప్రాయాన్ని అందరిమీదా రుద్దడం. అందరూ అలాగే ఉంటారని అనడం లేదు.వారు ఒక మాగజీన్ తెస్తే అది ఇతరులకిచ్చి వారి దగ్గర ఉన్నది తీసికోవడం. కానీ నాకైతే అంత అదృష్టం ఎప్పుడూ కలగ లేదు. నెను ఇప్పటి దాకా ఎవరిదగ్గరా పెపర్ కానీ, పుస్తకం కానీ ఎరువు తీసికొని చదవలేదు. చదవాలని కోరిక ఉన్నప్పుడు, కొనే గుణమూ ఉండాలి. అంతేకానీ ఇంకోడెవడో కొంటే అది ఫూకట్ గా చదవాలనేది ఓ పెద్ద దుర్గుణం. ఈ అలవాటున్నవారు ” కొందామంటే టైము లేకపోయిందీ, అలాగని మీరు అందరినీ విమర్సించకూడదు” అని.చదవాలంటే ట్రైన్ పెద్ద స్టేషన్ లో ఆగినప్పుడు కొనుక్కో, అంతేకానీ ఇంకోళ్ళ ఖర్చు మీద మజా చేయవద్దనీ. నా దగ్గర ఈ వారం స్వాతి,నవ్య, రచన మాస పత్రికా ఉన్నాయి. ఛస్తే బయట పెట్టకూడదనుకొన్నాను. ఎందుకంటే అప్పటికే ఓ మహానుభావుడు తీసికొన్నానా దగ్గర ‘ఈనాడు ” పేపరు త్డీసికొన్నాడు, గుడ్లగూబలాగ చూస్తూన్నాడు ఇంకా ఏమున్నాయా అని !! అవతలివాడు సిగ్గు విడిచి అడిగినట్లుగా మనం చెప్పడానికి మొహమ్మాటం అడ్డు వస్తుంది. ఇలాంటి వారి బారి నుండి తప్పుకొనే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. మా ఇంటావిడ, పిండి పులిహారా , పెరుగూ అన్నం చేసి తీసికొని రావడం వల్ల తిండికేమీ లోటు లేకుండా అయింది.కానీ తనకి చదవడానికే ఏమీ పుస్తకం ఇవ్వలేక పోయాను .

%d bloggers like this: