బాతాఖానీ –తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–నమ్మకాలు

    నాకు దేముడంటే చాలా నమ్మకం ఉంది. ఆ మధ్యన మా ఫ్రెండ్ ఒకాయన హైదరాబాద్ నుండి వచ్చారు. నాకు ఆయన మార్కెట్లో కనిపించి పేరు పెట్టి పిలిచారు. సరేనని నేనుకూడా ఆయనని గుర్తు పట్టాను.1983 వరకూ పూణే లో ఉండగా ఆయనతో పరిచయం ఉంది.ఇద్దరం రిటైర్ అయ్యాము. ఆయన హైదరాబాద్ లోనూ, నేను పూణే లోనూ సెటిల్ అయ్యాము.ఇంటికి తీసికొచ్చి , చాయ్ తాగి ఖబుర్లు మొదలెట్టాము. ఇలా వచ్చారు ఏమైనా పనిమీద వచ్చారా అని అడిగాను. దానికి ఆయన ” ఇక్కడ ఓ కాన్ఫరెన్స్ జరుగుతోందీ, దానికి వచ్చానూ అన్నారు. సరే ఆ వివరాలుకూడా తెలిసికోవాలిగా.అదేదో ” అంధవిశ్వాస్ విమోచన్ సమితి” ట. వారు ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాల్ని పోగొట్టి వారిలో సైంటిఫిక్ ఆలోచనలు రేకెత్తిస్తారుట.

    మా ఇంట్లో హాల్లో ఎదురుగా శ్రీవెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫొటోలు ఉంటాయి. వాటిని నేను 40 సంవత్సరాలనుండీ ఉంచాను. ఎవరైనా మా ఇంటికి వచ్చేవారు, హాల్లో సిగరెట్లుకూడా కాల్చడానికి వెనుకాడుతారు ఆ ఫొటోలు అక్కడ ఉండడం వలన. ఆయనన్నారూ,వాటిని చూపించి –“ఇదిగో ఇలాంటి మూఢ విశ్వాసాలని రూపు మాపడమే మా సంస్థయొక్క ప్రధాన ఉద్దేస్యం” అన్నారు.నాకు దేముడి మీద నమ్మకం ఉంటే మీకేమిటి నష్టం అన్నాను.అంటే ఆయనన్నారూ ” ఇదిగో ఇలా మనలాంటి చదువుకున్నవాళ్ళు ఈ మూఢనమ్మకాల్ని ఎంకరేజ్ చేయడం వలనే దేసం వెనక్కి పడిపోతూందీ,సైన్స్ ని నమ్మాలి కానీ, ఇలా కనిపించని దేముడినేమిటీ” అన్నారు.

    నాకు కనిపించని దేముడుమీద చాలా నమ్మకం ఉంది.అలాగని ఎదో పెద్ద పెద్ద పూజలూ అవీ చేయను, ఉపవాసాలుండను.ఎప్పుడైనా ఉండవలసివచ్చినా కాఫీ ఏదో తాగుతాను. మా అమ్మమ్మ గారు ఒకసారి చెప్పారు– ఉపవాసాలుంటే కాఫీ అదీ తాగకూడదని ఎక్కడా లేదూ, పైగా నీకు దానిమీదే దృష్టి ఉంటుందీ, అందుకని నీకు కావలిసినది తీసేసుకొని నీ పూజలు చేసికో. అప్పుడు పూజైనా దిక్షతో చెస్తావూ –అని చెప్పారు.అప్పటినుండీ ఏదైనా పూజ లాంటిది చేయవలసివచ్చినా నేను కాఫీ తీసికొనే చేస్తాను. ఇప్పటి దాకా నాకు ఎలాంటి సమస్యా రాలెదు. మనకి భక్తి, నమ్మకం ముఖ్యం గానీ ఇలాంటివన్నీకాదని నా నమ్మకం.

    నేను 1963 నుండీ తిరుమల కొండ కాలి నడక తోనే వెళ్తున్నాను. అదో నమ్మకం, మొక్కు ఏమీ కాదు ఓపిక ఉన్నన్నాళ్ళూ నడిచే ఎక్కుదామని అనుకున్నాను మనస్సులో. ఒకేఒకసారి
మా అమ్మాయిని బెంగుళూరు లో ఉద్యోగం లో చేర్పించి, అక్కడనుండి తిరుపతి మీదుగా వరంగాం తిరిగి వెళ్దామని రిజర్వేష్న్లూ అవీ చేసికొన్నాను.బెంగుళూరు లో బస్సెక్కి బయలుదేరాను, ఉదయమే, అలిపిరి దగ్గర దిగిపోయి కొండ మీదకు నడిచి వెళ్దామని నా ఉద్దేశ్యం.దురదృష్టవశాత్తూ, అక్కడకు వచ్చేటప్పడికి నిద్ర పట్టేసింది. కళ్ళుతెరిచేటప్పడికి బస్సు తిరుమల చేరిపోయింది. చాలా బాధ వేసింది, నడిచి ఎక్కలెకపోయానే అని.

    చేసేదేమీలేక సామాను అంటే ఓ వి.ఐ.పి సూట్కేసు, అదేదో లాకర్(ప్రైవెట్) లో పెట్టి రసీదు తీసికొన్నాను.ఆ తరువాత జుట్టుతీయించుకొని స్నానం చేసి, నా పర్సూ, అవీ ఓ జోలా బాగ్(అంటే భుజానికి వేళ్ళాడేసుకొనేది )లో పెట్టి , ఓ న్యూస్ పేపర్ తీసికొని, సావకాశంగా క్యూ కాంప్లెక్స్ (వైకుంఠం ) లో కూర్చున్నాను.సావకాశం అని ఎందుకన్నానంటే నా తిరిగివెళ్ళే టికెట్ గూడూరు నుండి ఆ మర్నాడు మధ్యాహ్నానికి. ఎక్కడా హడావిడి లేకుండా తాపీగా , కంపార్ట్మెంట్ తలుపులు తీయగానే, పేపర్ లోపల పెట్టి మెల్లిగా నడవడం మొదలుపెట్టాను. అక్కడ ఎటువంటి రష్షూ లెదు, అందరూ తాపీగానే వెళ్తున్నారు. అకస్మాత్తుగా నా వెనక్కాల క్యూ లో తొక్కిసిలాట లాంటిది ప్రారంభం అయి, నన్ను తోసుకొని ఓ నలుగురు నాముందుకు వెళ్ళిపోయారు. సరేనని వాళ్ళకి దారిచ్చి నెను పక్కకి తప్పుకొన్నాను. దృష్టి అంతా త్వరలో దర్శనం అయ్యే ఆదేవదేముడుమీదే ఉంది.సడెన్ గా చూసేసరికి, నా భుజాన్నున్న బాగ్ పక్కని కోసేసి ఉంది!! చూసుకుంటే అందులోని నా పోచ్ (అందులో డబ్బూ, నా టికెట్టూ, లాకర్ వాడిచ్చిన రసీదూ) అన్నీ ఉన్నాయి.

    ఇంకేముందీ గోవిందా అయిపోయింది నాపని. ఎవర్నడిగితే ఎవరు చెప్తారూ తీశామని, కళ్ళంబట నీళ్ళొచ్చాశాయి, చేసేదేమీ లేదు. ఆ క్యూ లోంచి బయటకు రావడానికి మార్గం లేదు. దర్శనం అయితేనే కానీ బయటకు రాలేము.చివరకు మిగిలింది నా చిరిగిన బ్యాగ్గూ, మెరిసే గుండూ!!ఎలాగోలాగ దర్శనం పూర్తి చేసికొని ఆ క్యూలోంచి వచ్చాను.దృష్టి అంతా దేముడిమీద ఎక్కడుంటుందీ, నన్ను క్షేమంగా ఇల్లు చేర్చమని ఆ భగవంతుడిని ప్రార్ధించేను.

    ముందుగా ఆ లాకర్ వాడి దగ్గరకు వెళ్ళాను , చెప్పాను నా సంగతంతా, అతనేమో రసీదు లేకుండా , తాళం చెవిలేకుండా , నా వస్తువులెలా ఇస్తాడూ. చివరకు అతనిని బతిమాలి, బామాలి, ఆ లాకర్ తాళం బద్దలుకొట్టడానికి ఒప్పించేను. నేను తిరిగి వెళ్ళి ఆ లాకర్ ఖరీదు వంద రూపాయలూ అతనికి ఎమ్.ఓ. చెసే కండిషన్ మీద. నన్ను ఎలా నమ్మేడో ఇప్పటికీ తెలియదు.ఆ సూట్కేసు తీసికొని జేబిలో నయా పైస లెకుండా ( మొత్తం డబ్బు అంతా పోయినట్లే ), అప్పుడు సడెన్ గా జ్ఞాపకం వచ్చింది, మా ఇంటావిడ నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా
బట్టల సందులో ఓ వెయ్యి రూపాయలదాకా దాస్తుంది ( ఎమర్జెన్సీ కోసం). అక్కడ ఉన్నట్లు జ్ఞాపకం వచ్చింది కానీ ఆ సూట్కేసు తాళం తీయడం ఎలా? ఆ రోజుల్లో వి.ఐ.పి వాళ్ళు పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చేవారు వాళ్ళ తాళాలు ఎంత స్ట్రాంగో.

    ముందుగా పోలీసు స్టేషన్కి వెళ్ళాను.,కంప్లైంట్ ఇద్దామని, ఆ ఇనస్పెక్టర్ ” ఈమధ్యన ఇవి మామూలైపోయాయండీ, ఏమీ చేయలేకపోతున్నామూ ” అంటూ స్వాంతన పలుకులు చెప్పి, రెండు ఉచిత అన్నదానం టికెట్లూ, క్రిందకు వెళ్ళడానికి ఓ పాతిక రూపాయలూ చేతిలో పెట్టాడు !!ఎక్కడైనా ఎవరైనా పోలీసులకి చేతిలో పెడతారు ఇక్కడ నాకు ఉల్టా , పైగా నా వి.ఐ.పి సూట్కేసు తాళం తీయించుకోవడానికి మార్గం కూడా చెప్పారు !!కింద తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయం దగ్గరలో ఉన్న పువ్వుల దుకాణం దగ్గరలోఉన్న , గొడుగులు బాగుచేసేవాడు– పైగా అతనిదగ్గరకు వెళ్ళి ఈ ఇనస్పెక్టర్ గారి పేరు చెప్పాలిట !! ఇలా ఉంటుంది పోలీసు నెట్వర్క్ !!

    ఈ కార్యక్రమాలన్నీ చేసికొని, సాయంత్రానికి గూడూరు వెళ్ళి , మళ్ళీ టికెట్ కొనుక్కొని ( నంబర్ లేకుండా డూప్లికేట్ టికెట్ ఇవ్వనన్నారు ), నా పెరునే రిజర్వ్ అయిన బెర్త్ లో నేనే మళ్ళీ టికెట్ కొనుక్కొని తిరుగు ప్రయాణం అయ్యాను. నా గొడవంతా అక్కడ ఉన్నవాళ్ళతో చెప్పాను.అందరూ విని వాళ్ళకి తోచిందేమిటో చెప్పారు. నా నమ్మకమేమిటంటే , ఎప్పుడూ నడిచి వెళ్ళేవాడిని ఆ సారి ఒళ్ళు కొవ్వెక్కి మెట్లమీద నుండి నడవకుండా వెళ్ళడం వల్లే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడని.నమ్మేవాళ్ళు నమ్ముతారు.
అందులో ఓ కుర్రాడు పై బెర్త్ మీదున్నాడు–‘ అంకుల్ ఇదంతా ట్రాష్, మీ అజాగ్రత్తవల్లే పోకొట్టుకున్నారూ, అని చెప్పి నాకు ప్రయాణాల్లో తీసికోవలసిన జాగ్రత్తల మీద ఓ లెక్చర్ కూడా ఇచ్చాడు.నేనన్నానూ ” ఎవరి నమ్మకాలు వారివీ, వాటిమీద ఆర్గ్యూ చేయకూడదూ, నీకైనా అవ వచ్చూ” అని. అదేం ఖర్మమో విజయవాడ దాటిన తరువాత చూసుకొన్నాడు ఆ అబ్బాయి తను కొత్తగా కొనుక్కున్న ” నైకీ ” బూట్లు అందరం చూస్తూండగానే మాయం అయిపోయాయి. రైళ్ళలో తుడిచే కుర్రాళ్ళు వస్తారు చూశారూ, వాడు సంచీలో దాచేసి పారిపోయాడు.ఇంక ఈ అబ్బాయి మళ్ళీ నాకు లెక్చర్ ఇవ్వలేదు.

    నేను చెప్పొచ్చేదేమిటంటే ఇంకొకళ్ళ నమ్మకాల్ని పరిహాసం చేయకండి. మిమ్మల్నేం నమ్మమని చెప్పడం లేదుకదా . వాళ్ళదారిని వాళ్ళని వెళ్ళనీయండి.
సర్వేజనా సుఖినోభవంతూ !!

%d bloggers like this: