బాతాఖానీ – తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు–ఏ.టి.ఎం కష్టాలు

    ఈ మధ్యన భారత ప్రభుత్వం వారు ఓ ప్రకటన చేశారు.ఇదివరకటిలాగ కాకుండా ఇప్పుడు ఏ బాంక్ ఏ.టి.ఎం నుండైనా డబ్బు తీసికోవచ్చనీ దానికి ఎటువంటి ఫీజూ తీసికోరనీ.
ఇదివరకైతే బోల్డంత ఫీజు తీసికొనేవారు. మా ఇంటికెదురుగా ఎచ్.డి.ఎఫ్.సి వాళ్ళ ఏ.టి.ఎం లో నా స్టేట్ బాంక్ కార్డ్ తో ఒకసారి తీసికుంటే వాళ్ళు, 50 రూపాయలు తీసికొన్నారు.ఇంతకంటే ఆటో లో వెళ్ళినా నాకు 40 రూపాయలతో అయిపోయేది. అప్పటినుండి బుధ్ధిమంతుడిలాగ ఏ కార్డైతే ఉందో అదే ఏ.టి.ఎం లలో మాత్రమే డబ్బు తీసికొనేవాడిని.

    నాకు సంతకం చేయడం లో తేడా వస్తుంది. చాలా సార్లు నా చెక్కులు బౌన్స్ అయ్యాయి. అందువలన అప్పటినుండీ చెక్కులమీద సంతకాలు పెట్టడం మానేశాను. ఏ.టి.ఎం ల ద్వారానే
నా కార్యకలాపాలు లాగించేస్తున్నాను.

    ఒకసారి హైదరాబాద్ లో ఎవరికో ఇవ్వాల్సివచ్చి పది వేలరూపాయలు డ్రా చేశాను. ఆ తరువాత ఎప్పుడో చెక్ చేసికుంటే మా బాంక్ వాళ్ళు నా అకౌంట్లో రెండుసార్లు పదివేలచొప్పున తీసేశారు. అంటే నాకొచ్చే పెన్షన్ తినేశారు !! ఇంట్లో చెప్తే మా ఇంటావిడ ఖంగారు పడుతుందని చెప్పలేదు. మా వియ్యపరాలుగారు ఎస్.బి.ఎచ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఎవరిదో చెప్పకుండా నా సమస్య చెప్పాను ఆవిడకి ( లేకపోతే వాళ్ళ వియ్యపరాలు కి చెప్పేస్తే !!). ఆవిడ చెప్పారు– అకౌంట్ ఉన్న బాంక్ కి వెళ్ళి ఈ స్లిప్పులు జోడించి కంప్లైంట్ చేస్తే, వాళ్ళు చెక్ చేసి మన డబ్బు మనకి ఇచ్చేస్తారూ అన్నారు. సరేనని ఆవిడ చెప్పిన ప్రకారం చేసిన ఒక వారానికి నా డబ్బులు ఏమైతేనే నా అకౌంటు లోకి తిరిగి వచ్చాయి. అప్పుడు చెప్పాను ఇంట్లో ఈ కథంతా.

    ఆ తరువాత రాజమంద్రీ వెళ్ళినప్పుడు ఒకసారి 13,000 వేలు డ్రా చేద్దామని ఏ.టి.ఎం కి వెళ్ళి కార్డ్ పెట్టి నొక్కితే ఆ డబ్బులు-రెప రెప మని చప్పుడు చేసికుంటూ, ఆ స్లాట్ దాకా వచ్చి
వెనక్కి వెళ్ళిపోయాయి. పోన్లే నేనంటే అంత ఇష్టం లేదేమో అని ఊరుకొన్నాను. అంతలో మషీన్ స్టాప్ అయిపోయింది.సరేనని ఇంకో ఎస్.బి.ఐ కివెళ్ళి ప్రయత్నిస్తే ఆ 13,000 రూపాయలూ, నా అకౌంటు లోంచి డెబిట్ అయిపోయాయి. ఇదేంటో నా పెన్షన్ కీ ఏ.టి.ఎం లకీ ఏదో శత్రుత్వం ఉందని నిశ్చయించేసుకొన్నాను. ఈ సారి నా డబ్బులు తిరిగి రావడానికి 25 ఫోన్లూ( రాజమండ్రి, పూణే ల మధ్య ), 60 రోజులూ పట్టింది.

    అప్పటినుంచీ ఏ.టి.ఎం లో వెయ్యి రూపాయలకు మించి ఒకేసారి ఎప్పుడూ తియ్యలేదు!! పోతే వెయ్యే పోతుంది మరీ వేల మీద పోతే రోడ్డెక్కాలి. ఇదండీ మన ఏ.టి.ఎం లూ, వాటి
అల్లర్లూ. నా సలహా ఏమిటంటే ప్రతీ వారూ కూడా వీలున్నప్పుడల్లా బేలెన్శ్ చెక్ చేస్తూండండి. మన బాంకులమీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. మన బాంకుల వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళకి ఎడా పెడా అప్పులిస్తారు. వాళ్ళు జెండా ఎత్తేస్తే నెత్తిమీద గుడ్డ వేసికొని వాటికి అదేదో ” ఎన్.పీ.ఏ ” అనో మరేదో పేరు పెట్టి నోరు మూసుకుంటారు. అదే మనలాంటి వాడికి ప్రపంచం లో ఉన్న అన్ని రూల్సూ చెప్తారు. బాంకుల వాళ్ళు ప్రతీ ఏడాదీ చూపించే లాభాలు మనలాంటివాళ్ళ దగ్గర దోచేసినవే !!

    ఇంక పోస్ట్ ఆఫీసుల కొస్తే అదో గోల. నాకు పూణే లో ఒక టర్మ్ డిపాజిట్ ఉంది మూడు సంవత్సరాలది. అది ఈ 2009 మార్చ్ లో మెచ్యూర్ అవుతుందని, పూణే వాళ్ళ సలహా మీద
రాజమండ్రి ట్రాన్స్ఫర్ కి పెట్టుకొని జనవరిలో పాస్ పుస్తకం సబ్మిట్ చేసి, మార్చ్ 20 వ తారీఖున రాజమండ్రీ పోస్టాఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఇంకా రాలేదన్నారు. మూడు నెలలయింది, ఇంత ఆలశ్యం ఎందుకైయిందని అడిగితే ” మాకేమీ తెలియదు పూణే వెళ్ళి అడగండి” అన్నారు. నెట్ లో పూణే వాళ్ళ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ” మా దగ్గర తగినంత స్టాఫ్ లేరూ , ఇంకొక నెల పడుతుందీ” అన్నారు. అంటే నా అమౌంట్ మచ్యూర్ అయిన నెల తరువాత దాకా ఆగాలన్న మాట. ఇలా కాదని పూణే లో ఉన్న పోస్ట్ మాస్టర్ జెనరల్ పెర్సనల్ నంబర్ పట్టుకొని ఆయనని రెక్వెస్ట్ చేశాను. సంగతంతా చెప్పాను,అంతే మూడు రోజుల్లో నా డబ్బు ట్రాన్స్ఫర్ అయి నా చేతికొచ్చింది.

    నేను చెప్పేదేమిటంటే మనకి ఇలాంటి సమస్య ఏదైనా వస్తే ఊరికే వీళ్ళనీ వాళ్ళనీ ఆడగడం కాదు– ఆ డిపార్ట్మెంట్ హెడ్ కే కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ దాకా ఇలాంటి విషయాలు
వెళ్ళవూ, వెళ్తే తప్పకుండా సహాయం చేస్తారు. ఆల్వేజ్ అప్రోచ్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఆయన తప్పించుకో లేరు. జనరల్ గా మన పని శులభం అవుతుంది.
ఏదో నాకైన అనుభవాలు మీతో పంచుకుంటే ఎవరికైనా ఉపయోగ పడుతాయేమో నని ఈ బ్లాగ్గు.

%d bloggers like this: