బాతాఖానీ ఖబుర్లు–34

                                                            మా అమ్మాయి క్లాస్ 10 కి వచ్చేముందర కొన్ని సంఘటనలు జరిగాయి. మా మామగారు తణుకు లో ఓ స్థలం కొనిపించారని చెప్పానుగా, నేనైతే అలాంటి మంచి పనులు చేయను. ఎందుకంటే నా కంత ఓపిక ఆర్ధికంగా లెదు. ఏదో అప్పు చేసి కొనిపించారండి. అక్కడతో నన్ను వదిలేయవచ్చుగా, అబ్బే రోజు విడిచి రోజు ప్రతీ ఉత్తరం లోనూ ఇదే సంగతి– ఇల్లెప్పుడు కట్టడం మొదలెడదామూ అని. ఇదేనండి అత్తారింటి ఊళ్ళో స్థలాలలాటివి కొన్నామా ఇలా ” ట్రాప్ ” అయిపోతాము. ఇంక ఈయన వదిలేటట్లుగా లేరూ అని, ఫాక్టరీ లో నాకు ఎచ్.బి.ఏ ( హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ) ఎంత వస్తుందో కనుక్కున్నాను. అంతా కలిపి       75,000 రూపాయలు వస్తుందని చెప్పారు. అమ్మయ్యా  ఈ డబ్బుతో మనని ఎవరూ ఇల్లు కట్టుకోమని బలవంత పెట్టరూ, ఓ గొడవ వదిలిందిరా  బాబూ అనుకొని ఆ ఏడాది పిల్లల శలవలకి తణుకు వెళ్ళాము.

                                                          వెళ్ళిన రోజు నుండీ మళ్ళీ ప్రారంభం మా మామగారి పాట, శంఖుస్తాపన ఎప్పుడు చేద్దామూ అని. ఇంక చెప్పేశాను ” నా కొచ్చే అప్పు 75000 మాత్రమే, ఆ డబ్బుతో ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా కడదామూ ” అని. ” అయితే సరే రెండు రోజుల తరువాత ముహూర్తం ఉంది ముందుగా పునాదులు లేపేద్దాము” అన్నారు. ఇంక ఈయన వదిలేటట్లుగా లేరురా బాబూ అనుకొని సరే నన్నాను. అంతే ఆ మర్నాడు  రాజమండ్రి వెళ్ళిపోయి కంకరా, స్టీల్ తీసికొచ్చేసి , ఇటకలకి, ఇసకకీ ఆర్డర్ ఇచ్చేశారు. డబ్బు అంతా ఆయనే అరేంజ్ చేశారు. ఆ తెచ్చిన సరుకంతా ఆరుబయట స్థలంలో వేస్తే అదంతా ఎవడైనా పట్టుకుపోతాడేమోనని భయం !! ఎప్పుడైనా ఇళ్ళు కట్టేనా ఏమిటీ ? అదంతా కొనడానికి ఎంత అయ్యిందీ అనే దానిగురించి నాకెప్పుడూ టెన్షన్ లేదు. ఎవరైనా డబ్బు ముందర పెడితే అది ఎలాగోలాగ తీర్చేయకలను. ఏమైతేనే ఓ ఇంటికి శంఖుస్తాపన చేశేశామండి. అందరి ముందరా ఓ పెద్ద హీరో అయిపోయాను !! తెర వెనుక విషయాలు ఎవరికీ తెలియదుగా !!

                                                    వరంగామ్ తిరిగి వచ్చి ఇంక నా ఎచ్.బి.ఏ గురించి ప్రయత్నాలు పూర్తిచేసి, ఆ స్థలం డాక్యుమెంట్లు ఫాక్టరీ వాళ్ళకి మార్ట్ గేజ్ చేయడానికి మళ్ళీ తణుకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికి మా ఇల్లు పునాదులు లేచాయి. అప్పుడే 1986 లో తణుకు లో వరదలు వచ్చాయి. ఆ వరదల్లో మా పునాదులు కొట్టుకుపోయాయేమో అని ఓ భయం. వెళ్ళి చూస్తే ఆ వరదలకి ఇంకా గట్టిపడ్డాయి. ఇదంతా చూస్తే మాకు ఇంటి యోగం ఉన్నట్లనిపించింది!!

                                                 మా మామ గారు జై భజరంగ భళీ అంటూ మా ఇల్లు కట్టించడం ప్రారంభించేశారు. ఆయన ఎక్కడినుండి డబ్బు తెచ్చేవారో తెలియదు, పని ఎప్పుడూ ఆగలెదు. నోట్లమీద సంతకాలు కూడా ఆయనే చేసేవారు.  కానీ ఎప్పుడైనా తణుకు వెళ్ళినప్పుడల్లా ఎవరినో ఒకరిని చూపించడం ” ఈయన దగ్గర ఇంత తెచ్చాము, వడ్డి ఇంత ” అనడం. వామ్మో ఆ పెద్దమనిషి ఇప్పడికిప్పుడు డబ్బు తీర్చేయమంటాడా అనో టెన్షన్. ఆ మనిషి పలకరించినప్పుడు ఓ వెర్రి నవ్వు నవ్వడం. చూస్తే ఓ అయిదుగురు దాకా తేలారు. ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ అడగలేదు. అంత అప్పు నామొహం చూసిచ్చారా ఏమిటీ, అంతా మా మామగారి కాంప్లిమెంట్స్. ఆయన ఓ సెకండరీ గ్రేడ్ టీచర్. వచ్చే జీతం బహు తక్కువ. కానీ సొసైటీ లో ఆయనకున్న పలుకుబడి అద్భుతం. మంచి నోటి మాట తో ఎక్కడా పని ఆగకుండా రెండు లక్షల రూపాయలూ సమకూర్చి , నాకోసం శలవు పెట్టుకొని మా ఇంటిని నిలబెట్టారు..

                                              ఇంత డబ్బు ఏ నమ్మకం మీద తెచ్చావూ, నేను తీర్చగలనని ఏమిటి భరోసా అంటే, ‘ నువ్వు తీరుస్తావని ఎప్పుడూ అనుకోలేదు, నువ్వు నమ్ముకున్న ఆ శ్రీ వెంకటేశ్వరుడు తీరుస్తాడు ” అనేవారు.. నాలాగే ఆయనకు కూడా ఓ వెర్రి నమ్మకం.

                                             ఏమైతేనే, నేనూ ఓ ఇంటివాడినయ్యానండి. పిల్లనిచ్చుకున్న పాపానికి ఓ ఇల్లు కూడా ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆయన నాకోసం చేసిన అప్పు అంతా వడ్డీతో సహా తీర్చేశాననుకోండి. ఎంత చెప్పండి ఆయన ఇచ్చిన ధైర్యం లెకపోతే స్వంత ఇల్లెక్కడిదండి బాబూ.ఈ ఇల్లు కట్టడం లో నేను నిమిత్త మాత్రుడినే, క్రెడిట్ అంతా ఆయనదే.

                                            ఓ ఇంటికి యజమానినయ్యానుకదా అని దానికి ఓ పేరు సెలెక్ట్ చేసి  అంటే మాఅందరి పేర్లలోని, మొదటి అక్షరంతో “హరేఫల” అని నిస్వార్ధంగా  మా వాళ్ళదగ్గర ప్రపోజ్ చేశాను. ఆ రోజుల్లో  నాగార్జునా వారివి, గోదావరి వారివీ ఎరువుల  పేరులా ఉందీ అని నా ప్రస్తావన వీటో చేసేశారు. చివరగా శ్రీవత్సస  ( మా గోత్రం) అని చెక్కించాము.

                                            గృహప్రవేశం టైముకి ఒక్క ముహూర్తం తప్పించి ఇంకేమీ రెడీ అవలేదు. తలుపులు టెంపరరీ.  ఆ రోజు విపరీతమైన వర్షం. అంత వర్షం లోనూ, ఆవుతో ఇల్లంతా నడిపించి మొత్తానికి కార్యక్రమం పూర్తిచేశాము.

%d bloggers like this: