బాతాఖానీ ఖబుర్లు–40

మా అబ్బాయి అభిరుచులు వాళ్ళ అక్కకి భిన్నంగా ఉండేవి. చదవడం కూడా తనది ఇంకో స్టైలు.మా అమ్మాయైతే ఎప్పుడు చూసినా ఏదో పుస్తకం చేతిలో కనిపించేది. వీడు ఎప్పుడు చదివేవాడో తెలియదు, కానీ క్లాసులో ఎప్పుడూ ఫస్టే. టీచర్లు కూడా వీడి గురించి ఎప్పుడూ మంచిగానే చెప్పేవారు. పరీక్షలైన తరువాత ఎలా చేసాడో అడగడానికి ఎప్పుడూ భయమే–ఏం చెప్తాడో అని !! మా అబ్బాయి క్లాస్ 10 పరీక్షలు బాగానే చేశానని చెప్పాడు. తన రిజల్ట్ టైము లో కూడా జి.ఎం. ఆఫీసులోని మా ఫ్రెండ్ శ్రీ రావు గారే రిజల్ట్ తెప్పించారు, మద్రాసు నుండి.స్కూలు కి ఫస్ట్ వచ్చాడు. మా అమ్మాయి టైము లో ప్రారంభించిన రోలింగ్ కప్ ఈ సారి మా అబ్బాయికి వచ్చింది. ఒక్క విషయం ముందుగానే చెప్పాడు. క్లాస్ 12 లో బయాలజీ సబ్జెక్ట్ మీద అంత ఆసక్తి లేదని. ఇంక మెడిసిన్ చదివించాలేమో ననే సమస్యే లేదు. క్లాస్ 10 లో సోషల్ సైన్సెస్ లో 90 పైగా మార్కులు తెచ్చుకొన్నాడు. ఈ మధ్యన మా ఫాక్టరీ లలో ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ తప్పకుండా ఉండాలని ,ఓ ఆర్డర్ వచ్చింది. దానికి సంబధించిన పని అంతా నాకు అప్పచెప్పారు. అప్పటికి మా జి.ఎం. శ్రీ సుందరం గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. నేను అనుకొనేవాడినీ, కొత్త జనరల్ మేనేజర్ వచ్చినప్పుడు, నన్ను ఇంకో సెక్షన్ కి మార్చేస్తారేమోనని. కానీ నా పనితీరువు చూసి కొత్తాయన శ్రీ బెట్టగిరి గారు నాకు ఆ ఐ.ఎస్.ఓ పని అప్పచెప్పారు. ఇది ఒక ఛాలెంజ్ గా తీసికొన్నాను. నాకు కావలిసిన స్టాఫ్ ఇచ్చారు.నేను అడిగిన అన్ని ఫెసిలిటీలూ ఇచ్చారు. నాకు ఇచ్చిన ఒకే ఆర్డర్ ” యు హావ్ టు గెట్ ఐ.ఎస్.ఓ . ఆస్క్ ఫర్ ఎనీథింగ్ యు విల్ గెట్ “. ఇంత పెద్ద బాధ్యత నేను నిర్వహించగలనా అనిపించింది. మా జి.ఎం. గారు అందరి ఆఫీసర్లతోటీ చెప్పారు ” ఫణిబాబు ఏది చెప్పినా, నా తరఫునే అనుకోవాలి, అతని దగ్గరనుండి ఏ విధమైన కంప్లైంటూ రాకూడదు ” అని.నేను ఒక కోర్ గ్రూప్ తయారుచెసి, ముందుగా మా వాళ్ళందరికీ ఐ.ఎస్.ఓ. గురించి బి.ఐ.ఎస్ వారి ద్వారా ట్రైనింగ్ ఇప్పించాను. అసలు ఈ ఐ.ఎస్.ఓ అంటే ఏమిటీ, దానికి కావల్సిన ముఖ్యమైన రికార్డులూ, మాన్యుఅల్సూ, అన్నీ ముందుగా తయారు చేసికొన్నాము. ఈ సందర్భం లో నా అసిస్టెంట్లు చాలా సహాయ పడ్డారు. ఈ విషయం లో నేను ప్రతీ 15 రోజులకీ ఢిల్లీ, ముంబై లు వెళ్ళవలసి వచ్చేది. నేను ఒక కోఆర్డినేటర్ గా పనిచేశాను. ముందుగా ఒక ప్లాన్ ఆఫ్ ఆక్షన్ తయారుచేసేవాడిని, దానికి మా జి.ఎం గారి అనుమతి తీసికొని అమలు చేయడమే. ఎలా అయిందంటే ఒకానొక టైము లో ఫణిబాబు అంటే ఐ.ఎస్.ఓ అని.అన్ని రికార్డులూ తయారుచేసికోవడానికి, ప్రతీ రోజూ రాత్రి 11.00 గంటలదాకా పనిచెసేవారము. అంతసేపూ, మా జి.ఎం. గారు కూడా ఆయన అఫీసులోనే ఉండేవారు. ఓ ముహూర్తం చూసుకొని బి.ఐ.ఎస్ వారిని ఆడిట్ కి పిలిచాము. ఆడిట్ జరిగిన మూడు రోజులూ నా జీవితం లో ( ఉద్యోగ రీత్యా ) ముఖ్యమైనవి. మా జి.ఎం. గారిచ్చిన ఛాలెంజ్ నెగ్గకలనా అని. ఒక్క రోజు కూడా కంటి మీద నిద్ర లేదు. ఆడిటర్లు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ ల నుండి వచ్చారు.ఒక్క సంగతి ఏమంటే, వచ్చిన ఆడిటర్లకి కూడా నా సిన్సియారిటీ మీద నమ్మకం కలిగింది. ఆఖరి రోజున ఆడిట్ పూర్తి అయిన తరువాత ఓ మీటింగ్ పెట్టి అక్కడ ఎనౌన్స్ చేస్తారు, మాకు ఐ.ఎస్.ఓ ఇస్తున్నారో లేదో. ఆరోజు రాత్రి 8.00 గంటలదాకా మా ఫాక్టరీలోని వర్కర్స్ కుడా అందరూ ఆగిపోయారు, రిజల్ట్ తెలుసుకోవడానికి. మా జి.ఎం గారైతే ఎంత టెన్షన్ పడ్డారో. ఆడిటర్ల మీటింగ్ అవుతుండగానే ముందుగా నాకు చెప్పారు, సర్టిఫికెట్ ఇస్తున్నామని. మా జి.ఎం గారితో ముందుగా ఆవిషయం చెప్పగానే, ఒక్కసారి ఆయన కుర్చీలోంచి లేచి నన్ను ఎత్తేశారు. అది మాత్రం నా జీవితం లో మరచిపోని మధుర సంఘటన. మీటింగ్ లో అనౌన్స్ చేయగానే, అందరికీ తెలిసింది. ఏదో నేనే అంతా చేశానని అందరూ పొగడడమే. పోన్లెండి నేనూ ఒక విజయానికి కారణం అయ్యానూ అనిపించింది.అక్కడ వరంగాం లో ఉన్నన్నాళ్ళూ ఇంక నాకు తిరుగు లేకుండా అయిపోయింది. ఫాక్టరీ లో అందరూ చూపించిన ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను. భగవంతుడి దయ వలన పిల్లలిద్దరూ కూడా చదువులో ఎంతో ఎత్తుకి తీసికెళ్ళారు. ఈ కారణాల వల్ల నా బాధ్యత కూడా ఎక్కువయ్యింది.దీనిని చూసి ఈర్ష్య పడ్డవాళ్ళూ ఉన్నారు ( మన వాళ్ళలోనే ).నా డెజిగ్నేషన్ మిగిలిన తెలుగు వారి కంటే తక్కువది.కానీ ఫాక్టరీలో పొజిషన్ మాత్రం వారందరికంటే పైన ఉండేది. ఇది నచ్చేది కాదు కొంతమందికి. ఇలాంటి విజయాలు సాధించాలని రాసి పెట్టి ఉందేమో , అందుకే నాకు 1986 లో వచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాన్సిల్ అయిపోయింది. ” ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ “. అందుకే నేను దేనికీ నిరుత్సాహ పడను ” ఏదైనా మన మంచికే ” అనేది నా ప్రిన్సిపల్.

%d bloggers like this: