బాతాఖానీ-తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు-టెలిఫోన్లు

    మా చిన్నప్పుడు టెలిఫోన్లు అనేవి ఎప్పుడూ చూడలేదు.ఆరోజుల్లో ఎక్కడికైనా సమాచారం పంపాలంటే టెలిగ్రాములే గతి. ఓ గులాబీ రంగు కాగితం మీద వ్రాసేవారు.మన సందేశం లో ఉన్న పదాల్ని బట్టి ఛార్జీలుండేవి. క్రమంగా వాటిని ట్చైపు చేసి గులాబిరంగు కాగితం మీద అంటించేవారు. సాధారణంగా పురిటి ఖబురో, లేక ఎవరైనా స్వర్గస్థులైనప్పుడో ఈ టెలిగ్రాములు పంపేవారు. అందువలన పల్లెటూళ్ళలో ఎప్పుడైనా ఈ టెలిగ్రాములొచ్చేయంటే అందరికీ హడావిడిగా ఉండేది. పైగా ఊరంతా చెప్పుకొనేవారు –ఫలానా వాళ్ళింటికి టెలిగ్రాం వచ్చిందిటా అని !!
అంటే మన సుఖదుఖాలలో అందరూ పాలుపంచుకొనేవారు !!
ఎప్పుడైనా దూర ప్రదేశాలకి మాట్లాడాలంటే పోస్టాఫీసు కి వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేయవలసివచ్చేది. బుక్ చేసి అక్కడే వేచిఉండడం.ఒక్కొక్కప్పుడు గంటల పైన కూడా వేచిఉండవలసివచ్చేది.
మేము వరంగాం లో ఉన్నప్పుడు ఎస్.టి.డి మొదట్లో మాఫాక్టరీ జి.ఎం కి మాత్రమే ఉండేది. బయట ఓ హొటల్ లోనూ, ఇంకో రెండు కిరాణాకొట్లలోనూ ఉండేది. ఎప్పుడైనా మనకి ఫోన్లు వస్తే, ఆ ప్రోగ్రాం అంతా ముందుగానే మనం ఫిక్స్ చేసికొనిఉండాలి. ఆ టైముకి మనం ఆఆ కొట్టుకో, హొటల్ కో వెళ్ళి అక్కడ పడిగాపులు పడడం.పైగా ఆఫోన్లూ అవి కాబిన్ లో ఉండేవికాదు. మనం మాట్లాడేదంతా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేది.మా అమ్మాయి పెళ్ళి టైములో నాకు బాగా గుర్తు-మా కాబోయే వియ్యంకుడిగారితో ఇంగ్లీష్/హిందీ లో మాట్లాడవలసివచ్చేది.మేము మాట్లాడినదంతా , మేము ఇంటికి చేరేలోపలే కాలనీ అంతా టాంటాం అయేది !! ఇదో పెద్ద న్యూసెన్స్ ఆ రోజుల్లో.

    ఇంకో సంగతేమంటే ఆరోజుల్లో డబ్బున్నవాళ్ళే ఇంట్లో ఫోన్లు పెట్టుకుంటారనుకొనేవాడిని. మా పెద్దన్నయ్య గారి ఫ్రెండ్ శ్రీ రంగయ్యనాయుడు గారు కేంద్రంలో కమ్యూనికేషన్స్ మంత్రి అయినప్పుడు, మా అన్నయ్యగారికి రాజమండ్రీ లో ప్రయారిటీ కనెక్షన్ వచ్చింది. నాక్కూడా కావాలేమో అని అడిగారు.నాకు అంత తాహతు లెదేమోనని అఖర్లేదన్నాను. ఆ తరువాత కొద్ది రోజులకి మాకు వరంగాం లో కాలనీలో టెలిఫోన్లు వచ్చాయి. ముందుగా పెట్టుకున్నవాళ్ళలో నేనుకూడా ఒకడిని.బాగా ఎంజాయ్ చేశాము.

    ఆ తరువాత 1998 లో పూణే వచ్చేసిన తరువాత అప్పటికి టెలిఫోన్లు బాగా సుళువుగానే ఇచ్చేవారు.మొట్టమొదట “సెల్” ఫోన్లు వచ్చినప్పుడు వాటి ఖరీదూ, కాల్ ఛార్జెస్సూ చాలా ఎక్కువగా ఉండేవి. అయినా బి.పి.ఎల్ వారి కనెక్షన్ తీసికొని మా అబ్బాయి సెకండ్ ఇయర్ లో ఉండగా వాడికిచ్చాము.తను కాలేజీ కి బైక్ మీద వెళ్ళేవాడు, వాడి బాగోగులు తెలిసికోవడానికి
మా ఇంటావిడ నాచేత కొనిపించింది! వాళ్ళ ఫ్రెండొకరు మాతో అన్నారూ ” మీరు హరీష్ ని స్పాఇల్ట్ బ్రాట్ చేస్తున్నారూ ” అని. మేము నవ్వేసి ఊరుకొన్నాము.ఇంజనీరింగు లో ఉన్న అబ్బాయికి సెల్ ఫోన్ ఇవ్వడమే ఒక వింతగా చూసిన రోజులు గుర్తుచేసికొంటే, ఈ రోజుల్లో స్కూలుకెళ్ళే చిన్న చిన్న పిల్లలు కూడా చేతిలో సెల్ ఫోన్లు, వేళ్ళాడతీసికోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

    మొదట్లో ఈ సెల్ల్ ఫోన్లు తీసికోవాలనే ఆసక్తి ఉండేదికాదు. కొంచెం ఖరీదు కూడా ఎక్కువే ఉండేవి. కూరల కొట్టువాడి దగ్గరనుండి ప్రతీవాడి దగ్గరా సెల్ ఫోన్లు చూసేటప్పటికి నాకూ ఒకటి కొనాలని మనసెసింది.ముందుగా మా ఇంటావిడ ఒక రిలయన్స్ కనెక్షన్ తీసికొని నాకు ప్రెజెంట్ చేసింది. అదో గొప్ప విషయం లా ఉండేది.ఆ ఫోన్ చాలాకాలం నాదగ్గర ఉండలేదు.మా అబ్బాయి ఎం.బి.ఏ చేయడానికి గుర్గాం వెళ్ళినప్పుడు వాడికిచ్చేసింది. నా సెల్ ఫోన్ మూణ్ణాళ్ళ ముచ్చటైపోయింది.తరువాత ఇంటినిండా లాండ్ లైన్లు రెండు, సెల్ ఫోన్లు ఓ అరడజనూ
తయారయ్యాయి. మాఫ్రెండనేవారు “మీ ఇల్లొక ఎస్.టి.డి బూత్ లాగ ఉంది” అని!

    ఈ మధ్యన చూస్తూంటే ఏమిటేమిటో సువిధాలు–హాండ్స్ ఫ్రీ–దానిని ఉపయోగించేవారిని చూస్తే ఒకొక్కప్పుడు నవ్వొస్తుంది.మొదటి సారి చూసినప్పుడు టక టకా అని గట్టిగా మాట్లాడేస్తున్నాడు, నవ్వడం, అరవడం అదిచూసి ” పాపం మతిస్థిమితం తప్పిందేమో “ అనుకొన్నాను.ఆ సందర్భం లోనే ఒకసారి నా ఎదురుగా వస్తున్నవాదు ” హల్లో ” అన్నాడు, నన్నేమో అనుకొని నేను కూడా “హల్లో” అన్నాను. మాఇంటావిడ చివాట్లేసింది–“మిమ్మల్ని కాదు, అతనెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడూ ” అని.ఒక్కొక్కప్పుడు, మనకి ఎదురుగా ఉండేవాడు చేయెత్తి ఏదో అంటాడు, మననేమో అనుకొని మనం కూడా చేయెత్తుతాము, అప్పుడు తెలుస్తుంది, ఆ పెద్దమనిషి మనని అస్సలు చూడలేదని. అప్పుడేం చేస్తామూ–ఆ ఎత్తిన చెయ్యిని జుట్టుసర్దుకోడానికో, లేక ఇంకేదో చేయడానికో మార్చేస్తాము !!ఓ వెర్రి నవ్వు నవ్వెసి, మన వాళ్ళదగ్గర మన పరువు నిలపెట్టుకోవడానికి.ఇలా చాలా మందికి అవుతుంది, చెప్పుకోవడానికి సిగ్గు పడతారు.

    ఈ రోజుల్లో అయితే ఐ ఫోన్లూ, బ్లాక్ బెర్రీలూ –ఎన్నిరకాలో.వాటికి కెమేరాలూ, వాటితో ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టెంట్ ఫొటోలూ, వీడియోలూ ఒకటెమిటి రిలయన్స్ వాళ్ళ ప్రకటన లాగ
దునియా ముఠ్ఠీ మే !!

%d bloggers like this: