బాతాఖానీ ఖబుర్లు–37

   వరంగాం లో సెంట్రల్  స్కూల్ లో అన్ని సబ్జెక్ట్ లకీ టీచర్లుండేవారు కాదు.ఓపిక ఉన్నవాళ్ళు స్వంతంగా చదువుకోవడమే, ట్యూషన్లు కూడా ఉండేవికాదు. అందువలన సబ్జెక్ట్ కి సంబంధించినంతవరకూ అన్ని రకాల రిఫరెన్స్ పుస్తకాలూ, తెప్పించుకోవడమే. అవి కూడా దొరకడం కష్టం అయ్యేది. నా అదృష్టం కొద్దీ నాకు ఫాక్టరీ ద్వారా బయట ఊళ్ళకి డ్యూటీ లు దొరికేవి. దానికి మా జి.ఎం శ్రీ సుందరం గారు ఎంతో సహాయం చేశారు. ఇందువలన, మా అమ్మాయికి కావల్సిన రిఫరెన్స్ పుస్తకాలు అన్నీ తెచ్చుకొనే వీలు దొరికింది. పుస్తకాలు తేవడంతో సరిపోదుగా, వాటిని సద్వినియోగం కూడా చేసికోవాలి, ఆ విషయం లో మా అమ్మాయి పూర్తిగా న్యాయం చేసింది.

అప్పుడే కేబిల్ టి.వీ వచ్చిన రోజులు. ఏదో పిల్ల క్లాస్ 12 పరీక్షలకు చదువుకోవాలికదా, డిస్టర్బెన్స్ అవుతుందని, మేము కేబిల్ పెట్టించుకోవడానికి సంకోచించాము. ఠాఠ్, కెబిల్ ఉండవలిసిందే అని మా పిల్లలు చెప్పేశారు. ఆ రోజుల్లో పిల్లల చదువు డిస్టర్బ్ అవుతుందని, మా కాలనీ లో

చాలామంది పేరెంట్స్ టి.వీ. కనెక్షన్లు కూడా తీసేసారు !! ఇక్కడ మా ఇంట్లో అంతా దానికి ఉల్టా !! నేనూ, మా ఇంటావిడా పిల్లలు చదువుకుంటున్నంతసేపూ, ఇంటికి బయటే అటూ, ఇటూ తిరుగుతూ,కాలక్షేపంచేసేవాళ్ళం.వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇంట్లోకి  వచ్చేటట్లుగా, దగ్గరలోనే ఉండేవాళ్ళం. పిల్లలమిద నమ్మకం ఉంది. మనం ఇంట్లో లేముకదా అని ఏదో టి.వీ. పెట్టుకుని చదువు పక్కన పెట్టేస్తారేమోనన్న బెంగ ఎప్పుడూ ఉండేది కాదు.

   పరీక్షా ఆర్ నో పరీక్షా ఆ రోజుల్లో వచ్చే సీరియల్స్ ఏదీ వదిలేవారు కాదు ( తల్లీ, కూతురూ). మా అబ్బాయేమో ఏ క్రికెట్ టెస్ట్ మాచ్చీ వదలలేదు !! మాకు ఫాక్టరీ ఎప్పుడూ సాయంత్రం    6.00 గంటలదాకా ఉండేది. ఎప్పుడూ పిల్లల్ని చదువు విషయంలో ఏమీ మందలించవలసిన అవసరం రాలేదు.   చదువు మీద శ్రధ్ధ ఇంకోళ్ళు చెప్తే వచ్చేదికాదు. నాచురల్ గా ఉండాలి. అది భగవంతుడు మా పిల్లలకి ప్రసాదించాడు.

మా అమ్మాయికి క్లాస్ 12 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మామూలుగా అయితే తండ్రి అనేవాడు, పరీక్షలు జరుగుతున్నన్నిరోజులూ శలవు పెట్టుకుని ఇంట్లో ఉండాలి.ఇక్కడ నాలాంటివాడు ఉంటే ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్కరోజూ మామూలు పిల్లల్లాగ తెల్లవారుఝామున లేచి చదువుకోవడం లాంటి సో కాల్డ్ మంచి లక్షణాలు లేవు. ఆ పరీక్షల టెన్షనే కనిపించేది కాదు.

   పరీక్షలు అన్నీ అయిన రోజు ఏదో ఫార్మాలిటీ కోసం మా అమ్మాయిని అడిగాను ” ఎలా చేసేవమ్మా ” అని. “అన్నీ బాగానే ఉన్నాయి కానీ, కెమిస్ట్రీ లో ఒక ప్రశ్న కి నంబర్ తప్పు రాసేనేమోనని అనుమానం” దానివలన ఫుల్ మార్కులు రావేమో “. . ఆరోజుల్లో పూణే యూనివర్సిటీ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశం మెరిట్ మీదే ఉండేది. ఎంట్రెన్స్ టెస్ట్ లూ అవీ ఉండేవికాదు.  సీ.బీ.ఎస్.సీ వాళ్ళకంటే, స్టేట్ వాళ్ళ మార్కులు ఎక్కువగా ఉండేవి. అంటే మంచి కాలేజీ లో కావలిసిన సబ్జెక్ట్ లో సీట్ రావాలంటే ఎలాంటి మార్కులు రావాలో మీరే ఊహించుకోండి. మంచి కాలేజీ లలో 95 శాతం మార్కులు కట్ ఆఫ్ గా ఉండేవి !!

రిజల్ట్ వచ్చేరోజు దగ్గరకు వచ్చేకొలదీ ఇంట్లో అందరికీ టెన్షన్. ఒక్క నిజం చెప్పమంటారా. మా అమ్మాయికి వచ్చే మార్కులు నేను ఒక కాగితం మీద వ్రాసుకొని ఒకచోట దాచేను, ఎవ్వరికీ ( మా ఇంటావిడకి కూడా ) చెప్పలేదు.నాకు తన తెలివితేటలమీద అంత నమ్మకం !! సెంట్రల్ స్కూల్ రిజల్ట్స్ ఆరోజుల్లో సౌత్ రీజియన్ కి మెడ్రాస్ నుండి వచ్చేవి.

   ఫాక్టరీ లో జి.ఎం. ఆఫీస్ లో మాత్రమే ఎస్.టి.డి ఫెసిలిటీ ఉండేది. ఆ రోజు పొద్దుటినుండీ మా ఫ్రెండ్ శ్రీ బి.టి.రావు గారు జి.ఎం.ఆఫీస్ లో ఉండేవారు, నాకంటే ఆత్రుత ఆయనకి. ప్రతీ గంటకీ వెళ్ళి అడిగేవాడిని, ఏమండీ రిజల్ట్ తెలిసిందా అని. ఆయనెమో లంచ్ కూడా మానేసి, మెడ్రాస్ సీ.బీ.ఎస్.సి ఆఫీస్ కి ఫోన్ చేయడంతోటే సరిపోయింది ఆయనకి.

ఆఖరికి మధ్యాహ్నం మూడింటికి వెళ్ళేటప్పడికి ఆయన ఎంతో ఉత్సాహంతో ” గురువు గారూ మీ అమ్మాయి రికార్డ్ బద్దలుకొట్టేసిందీ “ అన్నారు. మార్కులు ఎన్నండి బాబూ అంటే నేను చెప్పలేనండి, రాసి ఇస్తానూ, ఇక్కడ మా అందరికీ నోట మాట రావడం లేదూ అన్నారు.

ఆయన ఇచ్చిన చీటీ చూస్తే నేను అనుకొన్న మార్కులకి ఒక్క సబ్జెక్ట్ లో మాత్రం 3 మార్కులు తక్కువ అయ్యాయి.

   ఆయన ఇచ్చిన చీటీ లో ఉన్న మార్కులు:  మాథ్స్ : 99,  ఫిజిక్స్ : 99,  బైయాలజీ :  99,  కెమిస్ట్రీ  97  ఆ మర్కులు చూసిన తరువాత నాకైతే కళ్ళంబట ఆనందభాష్పాలు  ఆగలేదు. ఇంత బంగారు తల్లిని కన్న మా ఇంటావిడ కు నేనేమిచ్చి ఋణం తీర్చుకోగలను, ఏ తండ్రికైనా ఇంతకంటే ఏం కావాలి.

నేను ఇంట్లో చెప్పడానికి వెళ్ళేలోపల, మా కాలనీ అందరికీ తెలిసిపోయాయి.ఇంటికెళ్ళి నా కుటుంబం తో నేను ఆ రోజున పంచుకున్న ఆనందం చెప్పలేను. మా అమ్మాయైతే చాలా కూల్ గా తీసికుంది, ” చెప్పానుగా డాడీ కెమిస్ట్రీ లో తక్కువ వస్తాయని “.

ఈ మార్కులలో 99 అంకె  చూస్తే ఏదో లీలగా గుర్తుకొచ్చింది !! నాకూ  మాథ్స్ లో 99 వచ్చాయీ, కాకపోతే నావి 300 కి,  మా అమ్మాయికి    100 కి  !!!!

%d bloggers like this: