బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మీ ఫణి ) ఖబుర్లు

నేను మా అబ్బాయి కావాలంటే 1996 లోనే ఒక కంప్యూటర్ కొన్నానని చెప్పేనుగా, అలాగే 1998 లో దాన్ని మార్పించేసి ఇంకోటి కొనిపించాడు. నేను ఆరోజుల్లో మా ఫాక్టరీ (  అమ్యునిషన్ ఫాక్టరీ,ఖడ్కీ ) లో ప్రొవిజన్ ఆఫిసులో పనిచేస్తూండేవాడిని. తెలుసుగా అన్ని కార్యక్రమాలూ ఆన్ లైన్ లోనే జరిగేవి. నా టేబిల్ మీద ఓ కంప్యూటర్ కూడా పెట్టారు. ఎప్పుడూ దానిమీద చెయ్యికూడా వెయ్యలేదు. అదో భయం, సంకోచం.

మా బాస్ లు ఏదైనా అడిగినా, నాకు గుర్తున్నదానిని బట్టే జవాబులు ఇచ్చేవాడిని. ఇంకో జోక్ ఏమిటంటే, మా ఫాక్టరీ లో కావలిసిన అన్ని కంప్యూటర్లూ కొనడానికి

నేనే ఆ కేస్ అంతా ప్రాసెస్ చేసి తెప్పించేవాడిని.  టెండర్లు పిలిచిన తరువాత వివిధ కంపెనిల డీలర్లు వచ్చి నాతో ఏమేమో సంప్రదింపులు చేసేవారు !! ఓ అంటే ఢం రాదు నాకు, అయినా పెద్ద కంప్యూటర్ శావ్వీ లాగ పోజులు పెట్టేసేవాడిని. ఎవడైనా ఏమైనా ప్రశ్నలు వేస్తాడేమో అని మా ఐ.టి. సెక్షన్ నుండి ఒక ఎక్స్పర్ట్ ని నాతో కూర్చోపెట్టుకొనే వాడిని, ఎవరైనా నన్ను ఇరకాటం లో పెట్టినా అతనే చూసుకొనేవాడు. ఏది ఏమైనా పూర్తి బాధ్యత నేనే తీసికొనేవాడిని.

మా ఏ.జి.ఎం గారు చాలా ప్రయత్నం చేశారు, నా చేత ఎలాగైనా నెట్ లోంచి వివిధ ఐటమ్స్ కీ వెండర్స్ వెదకమని. అబ్బే, నాకు అలాంటి ఆసక్తి ఉండెదికాదు. ఇప్పుడు అనుకుంటున్నాను, ఆయన మాట విని నెట్ ఉపయోగించుకోవడం తెలిసికుంటే ఇంకా ఎంత బాగా మానేజ్ చేసేవాడిని అని. ఎనీ వే పాస్ట్ ఈజ్ పాస్ట్.

అన్నింట్లోకీ నా అసమర్ధత ఎప్పుడు తెలిసి వచ్చిందంటే, మా అబ్బాయి ఎం.డి.ఐ రిజల్ట్ వచ్చినప్పుడు  ఇంట్లో కంప్యూటర్ ఉండికూడా , అది ఉపయోగించడం తెలియనందువల్ల, ఆఖరికి గుర్గాం ఫోన్ చేయవలసివచ్చింది. ఎంతో సిగ్గు పడ్డాను. ఆ తరువాత వాడు నేర్పిస్తానంటే నోరుమూసుకొని, నేర్చుకొన్నాను ( మెయిల్స్ వరకే !!). వాడితో రోజూ కాంటాక్ట్ ఉండేది. సరే బాగుంది కదా అని నెట్ సెర్చింగ్ మొదలెట్టాను. ఏదో వెర్రి మొర్రి సైట్లు కనిపించేవి!! సరే నా తెలివితేటలు ఇంకొకళ్ళకి చూపిద్దామని ఓ ఫ్రెండ్ ని పిలిచి ” నీకు బలే హాట్ సైట్స్ చూపిస్తానంటూ, “ఎడల్ట్ ” అని టైపుచేశాను. మా ఫ్రెండ్ నోరు వెళ్ళపెట్టుకుని చాలా ఉత్సాహంగా చూడడం మొదలెట్టాడు, ఆ సైట్ల లిస్ట్ రావడానికి టైము పట్టింది. తీరా చూస్తే ” ఎడల్ట్ ఎడ్యుకేషన్ ” వయోజన విద్య గురించి వచ్చింది !! అప్పటినుంచీ నెట్ లో మళ్ళీ ఎప్పుడూ సెర్చింగ్ చేయలేదూ, చేసినా మన ప్రజ్ఞ ఎవరికీ చూపించలేదు.

అలాగే ఉద్యోగం లో చేరిన మొదట్లో  పిచ్చి పుస్తకాలు పూనా లో ఎక్కడ దొరుకుతాయో తెలిసికొని, ఎవరూ చూడకుండా కొనేవాడిని !! ఒకసారి తెలుగు పుస్తకం అనుకొని కన్నడ పుస్తకం కొన్నాను !!

అలా అని నా శీలం శంకించకండి. చాలా బుధ్ధిమంతుడిని, అప్పుడప్పుడు ఇలాంటి కక్కూర్తి పనులుచేసేవాడిని. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవండోయ్.

ఈ వేళ పొద్దుట ఈ టీవీ-2 లో ” అంతర్జాలం లో తెలుగు వెలుగు ” చూస్తూంటే ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఈవేళ్టి కార్యక్రమం చాలా బాగా ఉంది. ఒకటి అర్ధం అవలెదు, మాట్లాడిన వాళ్ళంతా తెలుగు లో వ్రాయడానికి ఉన్న టూల్స్ అన్నీ చెప్పి ” యంత్రం.కాం ” గురించి ఎందుకు చెప్పలేదూ అని. నేనైతే అదే ఉపయోగిస్తున్నాను. ఎక్కడా తప్పులు లేకుండానే వ్రాస్తున్నానని తలుస్తాను. అది మీరే చెప్పాలి. నేను అన్నీ  ట్రై చేసిన తరువాత ” యంత్రం” కి సెటిల్ అయిపోయాను.

బ్లాగ్గులు మొదలుపెట్టడానికి పూర్వం, ముందుగా స్వాతి వారపత్రిక లో ప్రచురించిన లెటర్ టైపుచేశాను. వాళ్ళేమో ” మీ ఉత్తరం సెలెక్ట్ చేశామూ, దాన్ని పీ.డీ.ఎఫ్ లో పంపించండి అన్నారు. ఓరి నాయనో ఇదేమి గొడవరా బాబూ అనుకొని, మన బ్లాగ్ మిత్రుడు రాకేశ్వరరావు కి ఫోన్ చేశాను. అతనెమో ” మీ లెటర్ నాకు పంపండి, సాయంత్రానికి మీకు దానిని పీ.డీ.ఎఫ్ లో కన్ వర్ట్ చేసి తిరిగి పంపుతానూ ” అన్నాడు. ఇక్కడ వీళ్ళేమో అర్జెంట్ గా కావాలన్నారు. మా అబ్బాయి కి ట్రై చేశాను, వాడేమో ఏదో మీటింగ్ లో ఉన్నాను, టైము పడుతుందీ అన్నాడు.

మా ఇంటావిడ నాకు ధైర్యం ఇచ్చి  రోజూ కంప్యూటర్ కెలుకుతూ ఉంటారుకదా మీరే ప్రయత్నించవచ్చు కదా అంది. జై భజరంగభళీ అంటూ, ఓ రెండు సార్లు ప్రయత్నించి మొత్తానికి నేనే పీ.డీ.ఎఫ్ లోకి కన్వర్ట్ చేశాను.

ఈ గోలంతా మీలాంటి ఎక్స్పర్ట్ లకి నవ్వులాటగా ఉంటుంది. ” పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం ” లాంటిది. అప్పడినుంచీ ఇదిగో రోజుకోటి చొప్పున మిమ్మల్నందరినీ బోరు కొట్టేస్తున్నాను.

ఇంకో విషయమండోయ్ — “తెలుగు వెలుగు” లో చివర్న శ్రీ గరికపాటి వారు మన తెలుగు  వాడుక భాష ఎంతగా క్షీణించి పోయిందో చెప్పారు. నాలాంటి వారు వ్రాసేది చదివి ఆయన ఇలా వాపోయుంటారు !!

%d bloggers like this: