బాతాఖానీ ఖబుర్లు –36

                                                          మా అమ్మాయి గురించి చెప్పానుగా, ఇంక మా అబ్బాయిగురించి చెప్పాలంటే– తనని,పుట్టిన మొదటి క్షణంనుండీ దగ్గర తీసికోవడం వల్ల కాబోలు ( పుట్టిన మరు క్షణం లోనే, మాడాక్టరమ్మ గారు నన్ను లొపలికి పిలిచి ” ఇడిగో మీ హీరో అన్నారు ) నా దగ్గర చేరిక ఎక్కువ. చిన్నప్పుడు చాలా తిప్పలు పెట్టాడు. రోడ్ మీద నడుస్తూ మధ్యలో కూర్చునేవాడు, నెనే ఏవో ఖబుర్లు చెప్పేసి ఎలాగోలాగ ఎత్తేసుకొనేవాడిని. ఇద్దరు పిల్లలకీ 6 సంవత్సరాలు ఎడం.వాడిని  హాస్పిటల్ నుండి ఇంటికి తీసికొచ్చిన మొదటి రోజున, మా ఇంకో ఫామిలీ డాక్టర్ శ్రీ దల్వీ గారిని ఇంటికి పిలిచాను. ఆ రోజున ఆయన చెప్పిందేమంటే, ఇద్దరు పిల్లలున్నప్పుడు, పెద్ద పిల్లమీద  ఇంకా ఎక్కువ శ్రధ్ధ తీసికోవాలీ అప్పుడే వాళ్ళిద్దరికీ మంచి రిలేషన్ షిప్ ఉంటుంది అన్నారు. అందువలన మా ఇంటావిడ అమ్మాయి సంగతులూ. నేను బాబు వ్యవహారాలూ చూసుకొనేవాడిని . ఒక విషయం గమనించాలి.నావైపు వారు గానీ,తనవైపువారు గానీ, మేము చాలా దూరం లో ఉండడం వలన వచ్చి మాకు సహాయం చెయడానికి వీలు పడలేదు. అందువల్ల మా పిల్లల్ని మాకు తెలిసిన పధ్ధతి లొనే పెంచాము.క్రమశిక్షణతోనే పెరిగారని నమ్మకం. పిల్లలకి మాతో పూర్తి చనువుగా ఉండడానికి  వీలు పడింది.మేము కూడా వాళ్ళకి కావల్సిన ” ఫ్రీడం ” ఇచ్చాము. ఎప్పుడూ వాళ్ళు దుర్వినియోగం చేసుకోలేదు.

                                                        ఇద్దరు పిల్లలూ చాలా స్నేహంగా ఉండేవారు. దెబ్బలాటలు అనేవి ఉండేవికాదు. బహుశా మా అమ్మాయి కి తన తమ్ముడి మీద బాగా మెటర్నల్ ఇన్స్టింక్ట్ ఎక్కువగా ఉండేది. అప్పుడు అర్ధం అయ్యింది మా డాక్టరమ్మ గారు ఇంట్లో ఎప్పుడూ ఇద్దరు పిల్లలుండాలని ఎందుకు అన్నారో, మన తరువాత ఒకళ్ళకి ఒకళ్ళు తోడు తప్పకుండా ఉండాల్సిందే !! భగవంతుని దయ వలన వాళ్ళ అక్క ఎక్కడుంటే దగ్గరలోనే ఉండేవాడు. బొంబాయి–పూణే, ఢిల్లీ–గుర్గాం, ఇప్పుడైతే పూణే లోనే ఇద్దరూ ఉంటున్నారు .

                                                       పూనాలో ఉన్నంత కాలం, మాకు దగ్గరలో రెండు తెలుగు కుటుంబాలవారు ఉండేవారు. మా వాడికి వాళ్ళతో బాగా అలవాటు అయ్యింది.అక్కడ క్వార్టర్లో కింద అంతా నాపరాళ్ళుండేవి. దానిమీద ఈ మూలనుండి రెండో మూల దాకా పెద్దపెద్ద అక్షరాలు రాయడం , తెలుగులో తిథులూ,వారాలూ,సంవత్సరాలూ వాటి పేర్లు చెప్పడం వల్ల, తెలుగు శుభ్రంగా ( ఇప్పటికీ !!) మాట్లాడడం వచ్చింది.ఎదురుగా ఓ గార్డెన్ ఉండేది, అందులో ఏవైనా మొక్కలుంటే, వాటికి రోజూ నీళ్ళు పోయడం, అవి ఎంతవరకూ పెరిగాయో రోజూ చూడడం కోసం, అవి పీకడం !! నేను సెకండ్ షిఫ్ట్ కెళ్తే, రాత్రి 11.30 దాకా నేను వచ్చేదాకా వేచిఉండడం.

                                                   పూనా లో వాడికి స్కూల్ అడ్మిషన్ దొరికింది కానీ మాకు వరంగామ్ బదిలీ అవడం తో, మా అమ్మాయికి లభించిన కాన్వెంట్ చదువు దొరకలేదు, అలాగే వాడి హాండ్ రైటింగ్  డాక్టర్ల ( క్షమించాలి !!) రైటింగ్ లా ఉండేది !! మా ఫాక్టరీ వాళ్ళ స్కూల్లోనే ఎల్.కే.జీ, యు.కే,జీ చదవవలసి వచ్చింది.

ఫాక్టరీ స్కూళ్ళు ఎలా ఉంటాయో, అదీ రిమోట్ ఏరియా లో అడగకండి. అది అవగానే వాళ్ళ అక్క లాగానే సెంట్రల్ స్కూల్లో చేరాడు. చెప్పానుగా ముందు వాడికి హిందీ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఎలాగో దాంట్లోంచి బయట పడి ఇంగ్లీష్ అలవాటు చేసికొన్నాడు. అక్కడ మాకు సినిమా మా  క్లబ్ లో వేసేవారు. ఓ కిలోమీటర్ దూరం ఉండేది, తిరిగి వచ్చేటప్పుడు, నిద్ర పోతున్నాడు కదా అని ఎత్తుకుని, భుజం మీద వేసికొనేవాడిని. పెళ్ళికొడుకు లా పడుక్కుని, ఇల్లు రాగానే ఠింగ్ రంగా మని లేచేవాడు.

                                             మా మామగారు ఎప్పుడైనా శలవలకి వచ్చినప్పుడు, ఆయనచేత సైకిలు నేర్చుకొనేవాడు.మా ఇంటావిడకి ఓ భయం–నా లాగ వాడికి కూడా సైకిలంటే భయం వస్తుందేమోనని !! పాపం మా అమ్మాయి పూనాలో ఉండగానే నేర్చుకుంది. నేను సొసైటీ లో ఉండేవాడినిగా, ఓసారి రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరికీ చెప్పకుండా అక్కడికి వచ్చేసి అందరినీ ఖంగారు పెట్టేశాడు.

                                            ఓ ఆదివారం సాయంత్రం నేనూ, కొంతమంది సెంట్రల్ స్కూల్ టిచర్లూ ఈవెనింగ్ వాక్ కి వెళ్తున్నాము. ఒకాయన మా అమ్మాయి గురించి చెప్తున్నారు. అప్పటికి మా అమ్మాయి స్కూల్లో అన్ని కార్యక్రమాలలోనూ , చదువులొనూ మొదటి రాంక్ లోనే ఉండేది.  ఇంతట్లో ఒక టీచర్, “మీరు ఏదో పెద్దక్లాసులో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నారూ, మా క్లాసులో ఓ చిచ్చర పిడుగు ఉన్నాడు, నేను జనరల్ నాలెడ్జ్ లో అడిగిన ప్రశ్నలకి అన్నీ అతనొక్కడే చెప్పాడు, ఆ వయస్సు కి చాలా అద్భుతం” అన్నారు. మిగిలిన టిచర్లు అడిగారూ పేరేమిటీ అని. ఆయన మా అబ్బాయి పేరు చెప్పగానే ” అర్రే బాబా, తను కూడా వీరి అబ్బాయే ” అన్నారు. ఆ క్షణం లో నెను ఎంతో  సంతోషించాను, ఇద్దరు మాణిక్యాలకు తండ్రిని అయినందుకు (  చెప్పానుగా పిల్లల్ని చదివించడం అన్నీ మా ఇంటావిడే చూసుకొనేది , వూళ్ళో వాళ్ళందరి దగ్గర శభాష్ అనిపించుకోవడం నా కొచ్చేది !!)

                                        

%d bloggers like this: