బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు–కుక్కల భయం

      నాకు కుక్కలంటే మహా భయం. చెప్పుకోడానికి ఏమీ సిగ్గు పడను. నాకు చాలా మంది చెప్పారు–కుక్కంటే భయ పడకూడదు, అరిచినా సరే, ఏమీ కదలకుండా నుంచో, అదే భయ పడి పారిపోతుందీ, ఎట్సట్రా, ఎట్సట్రా..ఈ ధైర్యం జనరల్ గా కుక్కలను పెంచేవాళ్ళే చెప్తారు.యజమాని కాబట్టి వాడిని ఏమీ చెయ్యకపోవచ్చు. ఆ కుక్కకి మనమీద " ఎలీజియెన్స్" ఎందుకు ఉంటుందీ ?. నేను చాలా సార్లు ప్రయత్నించాను భయ పడకూడదని, అలా 60 ఏళ్ళు గడచిపోయాయి, కానీ ఆ భయం పోలేదు. ఈ వయస్సులో ఏమీ సాహస కృత్యాలు చేయాలని కోరికా లేదు.దానివలన ఇంకోళ్ళకి ఏమీ నష్టం లేదుగా!!

      నా పోలిక మా అమ్మాయికి పూర్తిగా వచ్చింది.పాపం వెర్రి తల్లి వాళ్ళ నాన్నే తనకి ఓ ఇన్స్పిరేషన్ ఇలాంటి విషయాలలో మాత్రమే !! ఈ వేళ " ఫాదర్స్ డే " అని, ఓ కార్డూ,ఓ గిఫ్టూ ఇచ్చింది.మేం ఇద్దరమే మా కుటుంబం లో కుక్కలకి భయ పడేవాళ్ళం. మిగిలిన వాళ్ళందరూ, ( మా ఇంటావిడతో సహా ) మమ్మల్ని ఏడిపించేవారే.మా అబ్బాయైతే, వాళ్ళ అమ్మాయి కోసం ఓ కుక్క పిల్లని పెంచుకుందామంటూంటాడు. ఇంక నాకు రాజమండ్రి నుండి పూణే వచ్చే యోగం ఉన్నట్లులేదు.

            నేను ఉద్యోగం లో ఉన్నప్పుడు , ఎప్పుడైనా మొదటి షిఫ్ట్ కి పొద్దుటే 6.00 గంటలకి చేరాలంటే చీకట్లో 5.00 గంటలకే లేచి వెళ్ళవలసివచ్చేది. చీకటంటే భయం లేదు.ఈ కుక్కలే, రోడ్డు మొదట్లో ఓ కుక్క అరవడం మొదలెడితే, ఆ ఇలాఖాలో ఉన్న అన్ని కుక్కలూ అరవడం మొదలెడతాయి. నాకు చిత్రహింస లా ఉండేది.మా క్వార్టర్ కి బయట నుంచునేవాడిని, ఆ తెల్లవారుఝామున ఆ రోడ్డు మీద వెళ్ళే పాలవాళ్ళో, పనిమనుష్యులో వచ్చేదాకా ఆగి, వాళ్ళకు తెలియకుండా, చీకట్లో వాళ్ళని ఫాలో అయ్యేవాడిని. ఎప్పుడైనా చూసినా, వాళ్ళలాగే నేనుకూడా ఎవరింట్లోనో పనికి వెళ్తున్నాననుకొనేవారు. అయినా నాకేమిటి, ఆ ఫర్లాంగు దూరమూ, నాకు వాళ్ళ రక్షణ ఉంటూందిగా. ఊరికే వాళ్ళ భావాల్ని కించపరచడం ఎందుకూ ? రాత్రిళ్ళు, అలాంటి తోడు దొరికేది కాదు.పాలవాళ్ళూ, పనిచేసేవాళ్ళూ ఉండరు కదా, అలాంటప్పుడు, మా ఇంటావిడ పాపం, పిల్లల్ని పక్కవారికి అప్పజెప్పి, నాకోసం అక్కడ వెయిట్ చేసేది.ఇలా ఉండేది నా బ్రతుకు !!

      మేము వరంగాం లో ఉన్నప్పుడైతే ఇంకో గోల. మా ఫోర్మన్ ఒకాయనకి రెండు పేధ్ధ కుక్కలుండేవి. ఒకదానిని చెయిన్ తో కట్టేసి పట్టుకునేవాడు.రెండో కుక్కని మామూలుగా ఒదిలేసేవాడు. వీటితో రోడ్డుమీద " వాకింగ్ " కి రావడం –అదో స్టేటస్ సింబలూ. ఎప్పుడైనా ఆయనను రోడ్డు మీద చూసినప్పుడు, పోనీ మన ఫోర్మన్ కదా అని చెయ్యేత్తి "హల్లో" అన్నాను
వాళ్ళ యజమానిని ఏదో చేసేస్తాననుకుందో ఏమో, ఆ రెండో కుక్క నామీదకెగిరింది.నాకు బ్లడ్ ప్రెషరూ అలాంటివి ఏమీ లేవు, కానీ ఆక్షణంలో నాకు అవన్నీ వచ్చేశాయి.ఏదో ఆయన అడ్డుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ కుక్కగారి చేతిలో నా పని అయిపోయేది.అప్పటినుంచీ ఆయన ఎక్కడ కనిపించినా, ఆయనెవరో నాకు తెలియనట్లుగా పక్కనుంచి వెళ్ళిపోయేవాడిని.

      ఇవన్నీ ఇలాగుండగా, మా డాక్టర్ ఫ్రెండ్ దేష్పాండే గారికి ఓ కుక్కని పెంచుకోవాలనే ఓ మహత్తర ఆలోచన వచ్చింది.ఆయనకు తెలుసు, నా భయాలన్నీ.అందుకని నేను ఎప్పుడు వాళ్ళింటికి వెళ్ళినా, దాన్ని కట్టేస్తూంటారు. దానికో పేరూ " గోల్డీ "అని. మేము వెళ్ళగానే " దెఖో ఫణిబాబూ అంకుల్ ఆయా " అంటూ దానితో ఖబుర్లూ. ఒక్క విషయం– ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నదానిని "కుక్క " అనకూడదు. పెరుతోనే పిలవాలి. లేకపోతే వాళ్ళ " ఫీలింగ్స్ " హర్ట్ అవుతాయి. గుర్తు పెట్టుకోండి. ఈ కుక్కల జనాలకి ( యజమానులనాలి కాబొలు), ఊరు వదలి బయటకు వెళ్ళడానికి కుదరదు.అంతేకాదు మనం ఎప్పుడినా వాళ్ళని ఇన్వైట్ చేస్తే, " మాకు కుదరదు, మా గోల్డీ యో, మరేదో ( కుక్క అనకూడదుగా) కి భోజనం టైమో మరేదో అని తప్పించేసుకుంటారు.పోన్లెండి అదే నయం. దానిని మన ఇంటికి తీసికొస్తే అదో గోలా !

      ఒక్కకొప్పుడు మనం ఉండే సొసైటీ ల్లో కుక్కలున్నవాళ్ళు,దానిని బయటకు తీసికెళ్ళి, మళ్ళీ వాళ్ళ ఫ్లాట్ లోకి తీసికెళ్ళడానికి, ఏ లిఫ్ట్ లోనో వెళ్తున్నారనుకోండి, ఆలిఫ్ట్ లో మనం చిక్కడిపోయామో అంతే సంగతి .ఇలా నాకు రెండు మూడుసార్లు అయింది.. నాలుగో అంతస్థనా సరే, నేను మెట్లమీదనుండి నడిచే వెళ్తాను.అక్కడ రాజమండ్రి లో మా వదిన గారింట్లో ఆవిడ ఓ కుక్కని పెంచుకుంటూంది.ఎప్పుడు వెళ్ళినా దాన్ని కట్టేస్తే కానీ ,వాళ్ళింట్లోకి వెళ్ళను., ఎవరేమనుకున్నా సరే !!!!

%d bloggers like this: