బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–బేరసారాలు–2

    నాకు చివరకి అర్ధం అయిందేమంటే, అక్కడ ఉన్నాయనకి ఓ డౌట్ వచ్చింది. ఈ డీల్ లో ఆయనకి ఏమీ కమిషన్ దొరకదేమో అని. అందువలన ఆయన నన్ను ఇలా త్రిప్పుతున్నారు.ఆయన డౌట్ క్లియర్ చేస్తూ అప్పటికీ చెప్పాను– నాకు ఫలానా ఎమౌంట్ వచ్చేలా చూడండీ, ఆపైన వచ్చేది మీరు తీసుకుందురుగానీ అని. కానీ, అప్పటికే మా చుట్టాలు చేయవలసిన డామేజ్ చేసేశారు. నేను అనుకున్నదానికంటే ఎక్కువ చెప్పేసి, అంత కంటె తక్కువకైతే అమ్మరూ అని అందరిదగ్గరా పబ్లిసిటీ ఇచ్చేశారు. ఇంకెవడొస్తాడూ నా ఇల్లు కొనడానికి? ఇలా ఓ ఏణ్ణర్ధం గడిచింది. ఇంక లాభం లేదని “తెలుగు పీపుల్.కాం” లో నా ఇల్లు అమ్మకం గురించి యాడ్ పెట్టాను. ఇంక వివిధ రకాలైన వారి దగ్గరనుండీ ఎంక్వైరీలు ప్రారంభం అయ్యాయి. అందులో కూడా చిత్ర విచిత్రమైనవి– మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారూ, అక్కడ ఏమైనా సమస్యలున్నాయా అంటూ. నేను అక్కడ ఎప్పుడైనా ఉంటే కదా తెలియడానికి. ఇంకోడు అడుగుతాడూ, మీకు ఎంతయ్యిందీ, ఆరేటుకే ఇచ్చేయొచ్చుగా. అవును నాయనా, నీకోసమే కట్టానూ,ఎప్పుడు రాసేయమంటావూ అని అడిగాను!! మొత్తానికి చిరాకు తెప్పించేశారు. చివరకు ముంబై నుండి ఓ అబ్బాయి తో డీల్ ఫైనలైజ్ చేశాను. నేను ఎంతకి అమ్ముతున్నానో ఎవరికీ చెప్పలేదు.

    కాగితాలు సంతకాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు మా చుట్టాలూ, మా ఫ్రెండూ ఒకళ్ళ తరువాత ఒకళ్ళు ” అయ్యో అంత తక్కువకే అమ్మేస్తూంటే, మేమే కొనుక్కునేవాళ్ళం కదా, అయినా చాలా తొందర పడ్డావూ, ఇంకొన్ని రోజులు ఆగవలసిందీ” అని పరామర్శలూ. ఈ మూడేళ్ళూ నన్ను పెట్టవలసిన తిప్పలన్నీ పెట్టి, ఇప్పుడు ఈ భేషజం ఖబుర్లొకటి. ఒకటి మాత్రం నిశ్చయించుకున్నాను– మనం ఏదైనా అమ్మ వలసినప్పుడు ఎవరిమీదా ఆధారపడకూడదు. వాళ్ళు ఏదో మెహర్బానీ చేస్తున్నట్లు చూసే చూపులు మనం తట్టుకోలేము.

అందుకే పూణే లో ఫ్లాట్ అమ్మేటప్పుడు కూడా, నెట్ లోనే పెట్టి డీల్ ఫైనలైజ్ చేశాను. మనకి రాసి పెట్టున్నంత వస్తుంది. జెఫ్రీ ఆర్చర్ చెప్పినట్లు ” నాట్ ఏ పెన్నీ మోర్,నాట్ ఏ పెన్నీ లెస్స్”. నాకు దానిమీద చాలా నమ్మకం !! ఇలా చెప్పినప్పుడు, ” వీడికి బ్రతుకు తెరువు తెలియదు” అన్నా, నాకేమీ బాధ లేదు.

    ఈ బేరసారాలు చేసే వారిని, మేము వరంగాం లో ఉన్నప్పుడు కొంతమందిని చూశాను. అక్కడ వారానికి రెండు సార్లు మార్కెట్ ఉండేది. బుధవారాలు మా ఇంటావిడ వెళ్ళేది. శనివారాలు నేను వెళ్ళేవాడిని. మేము కొన్న ప్రతీ కూరా, మా ఫ్రెండొకడు రేట్లు అడిగేవాడు. ఖర్మ కాలి వాడు కొన్నదానికి తక్కువలో కొన్నామా, మార్కెట్ కి వెళ్ళి ఆ కొట్టువాడితో పేద్ద గొడవ పెట్టుకునే వాడు !! ఈ గొడవలన్నీ పడలేక, నేను దేని రేట్లూ చెప్పడం మానేశాను. మా ఫ్రెండ్ సాయంత్రం చీకటి పడి, మార్కెట్ మూసే వేళకి వెళ్ళి, ఎలాగూ సగం రేట్ కే ఇస్తారు కదా అని అప్పుడు వెళ్ళి కొనుక్కునేవాడు !!

    మనం ఏదైనా సరుకు కొనాలనుకుంటే, కొనేయడమే. అంతే కానీ, ఎప్పుడో పండగలకి ఏవేవో స్కీంలు వస్తాయీ అని కూర్చొంటే, ఆ వస్తువు కొన్న ఆనందం ఎలా వస్తుందీ? ఈ వస్తువులన్నీ లేకపోయినా జీవితం గడిచిపోతుంది. మనం ఎఫోర్డ్ చేస్తున్నాము కాబట్టి కొంటున్నాము. ఒక సంగతి చెప్పండి, ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న ప్రతీ సరుకుకీ, అదే కొట్టుకి బయట ఫుట్పాత్ మీద దొరుకుతుంది. అది ఓ డ్రెస్స్ అవనీయండి, ఓ చప్పల్/షూ అవనీయండి. మనకి “త్రో ఎవే ప్రైస్” లో కొనాలంటే అక్కడే కొనొచ్చు కదా ? సరుక్కి సరుకూ కావాలి, ఎక్కువ ధరా ఉండకూడదు, ” అవ్వా కావాలి బువ్వా కావాలి” అంటే ఎలాగ కుదురుతుందీ ?

    ఏమైనా అంటే ” మాక్రో అనాలిసిస్ ” మీద ఓ లెక్చర్ ఇచ్చేసి, ఈ ఎం.ఎన్.సీ లూ, మాల్ వాళ్ళూ మనల్ని ఎలా దోచుకుంటున్నారూ అని ఓ క్లాసు పీకుతారు.అలాగని నేనేదో కోటీశ్వరుడనుకోకండి. నేను ఒక సామాన్య మధ్య తరగతి జీవుడిని.ఇంట్లో వాళ్ళకి మనకి వీలైనన్ని కంఫర్ట్స్ కల్పించాలి. వాళ్ళు, మన గురించి ఒళ్ళు హూనం చేసికొని, మనని భరిస్తున్నారు కదా( ఏ ప్రతిఫలం ఆశించకుండా) ఈ మాత్రం మనం చేయాలి. ఇవన్నీ లేకుండా కూడా ఇన్నాళ్ళూ జీవితం గడిపేశాము, ఇటుపైనా గడపగలము. అయినా అదో సంతృప్తీ.

    ఇంకో రకం వాళ్ళుంటారు–ఎవరైనా ఏదైనా కొత్త సరుకు కొన్నాడంటే ” అర్రే ఆ కొట్లో కొన్నారా, ఇంకో ఫలానా కొట్లో ఇంతకంటే 20 రూపాయలు తక్కువకే ఇస్తున్నారుట.( సంగతేమంటే ఆయన ఆ రోజు పేపర్లోనో, టి.వీ లోనొ ఓ యాడ్ చూసుంటాడు)” ఆ తక్కువకి ఇచ్చే కొట్టు ఎక్కడో దూరంగా ఉంటుంది, అక్కడకి వెళ్ళిరావడానికి అయే ఖర్చూ అన్నీ పెట్టుకుంటే తడిపి మోపెడౌతుంది. ఆ సంగతి చెప్పడు, తనమాటే నెగ్గాలి, ఎలాగోలాగ తను చేసిందే మనం చేసింది తప్పూ అని నిరూపించాలి. సరే బాబూ నువ్వే తెలివైనవాడివీ, మేము బడుధ్ధాయిలం అని వదిలేయాలి!!

    చివరగా చెప్పేదేమిటంటే బేరసారాలు చేసేవాళ్ళు జీవితాన్ని కూలంకషంగా పరిశీలించి, బ్రతుకుతెరువు తెలిసినవాళ్ళు. మిగిలిన నాలాటి వాళ్ళంతా ” గుడ్ ఫర్ నథింగ్ ” రకం !! సర్వేజనా సుఖినోభవంతూ !!

%d bloggers like this: