బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–రాజమండ్రీ జ్ఞాపకాలు–1

IMG_0165IMG_0166IMG_0168IMG_0186

    సరిగ్గా క్రిందటేడాది దసరాల్లో గోదావరి గట్టు పైన ఉండే అపార్ట్మెంట్ లోకి మారాము. ఈ దసరా పూర్తి అయ్యే సరికి తిరిగి పూణే వెళ్ళిపోతున్నాను. ఈ ఏడాది లోనూ, ఎంతోమంది మిత్రులు అయ్యారు. రాజమండ్రీ లో గోదావరి గాలి తగిలేసరికి, నాలో నాకు తెలియకుండా దాగి ఉన్న తెలుగు రచనా వ్యాపంగం బయటకు వచ్చేసింది. ఏప్రిల్ 15 వ తేదీనుండి నేను బ్లాగ్గులు వ్రాయడం మొదలెట్టాను. మొదట్లో కొంచెం సంకోచించాను, నా లాటి వాడు వ్రాస్తే చదివేవాళ్ళు ఎవరుంటారూ అని. కానీ, మన బ్లాగ్గు మిత్రులు ఇచ్చిన అనూహ్యమైన ప్రోత్సాహం చెప్పలేనిది. వారి అండదండలే లేకుంటే, ఈ 150 రోజుల్లోనూ, 162 పోస్టులు చేయకలిగేఉండేవాడిని కాదు.ఇదంతా మీ అందరి చలవే.ఇప్పటికి 23000 కి పైగా సందర్శకులు వచ్చారంటే, మీ అందరి హృదయాలూ ఎంత విశాలమైనవో తెలుస్తోంది.

    మొదట్లో వ్రాయడం మొదలెట్టినప్పుడు, బ్లాగ్గుకి అలంకారాలూ అవీ లేవు. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లు వ్రాసేవాడిని, పేరాగ్రాఫులు విడిగా రాయడం కూడా తెలియదు. జ్యోతి గారి ధర్మమా అని, నా బ్లాగ్గుకి ఓ అందమైన రూపం ఇచ్చారు. ఆవిడకు ధన్యవాదములు. పేరాగ్రాఫ్ లు, రంగుల్లో వ్రాయడం, ఫాంట్లు పెద్దవి చేయడం, మా కోడలి చలవ !! ఏమైతేనే నా బ్లాగ్గుని ఓ కొలిక్కి తెచ్చారు!! చెప్పానుగా, నేనేదో సుఖపడిపోతున్నానని, మా ఇంటావిడ కూడా తెలుగు టైపు చేయడం నేర్చేసుకొని, తనూ ఓ బ్లాగ్గు మొదలెట్టేసింది. పని హడావిడి లో రెగ్యులర్ గా వ్రాయడం లేదు.

    ఈ బ్లాగ్గులు వ్రాయడానికి ముందర ఒక రోజు ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి, మీ ఇంటికి వస్తున్నామూ, ఓ ఇద్దరితో కలిసీ అని చెప్పారు. అతనెవరో తెలియదు, అయినా కాదనడం ఎందుకని, సరే రమ్మన్నాను. అప్పుడు మా ఇంటిపక్కనే, త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నాయి.. మీతో ఓ గంట గడిపి, తరువాత సంగీత కచేరీ కి వెళ్తామూ అని చెప్పారు ఆ పెద్దమనిషి. మా ఇంటావిడ అడిగిందీ, వాళ్ళెవరో మీకు తెలుసునా, వచ్చేయమని చెప్పారూ అని అడిగింది. వచ్చిన తరువాత చూద్దామూ అన్నాను.

    ఆరోజు వచ్చింది శ్రీ చింతా రామకృష్ణరావు గారు, శ్రీ రాకేశ్వర్రావూ, శ్రీ ( డాక్టర్) చామర్తి శ్రీనివాస శాస్త్రీ. వారితో గడిపిన నాలుగు గంటలూ మరువలేనివి. ఓ గంట ఉందామని వచ్చిన వారితో నాలుగు గంటలు తెలియకుండా, గడపకలిగేమంటే, అది వారిలో ఉన్న విశేషమే. శ్రీ చింతా, శ్రీ రాకేష్ ఒకరి తరువాత ఒకరు పద్యాలు వ్రాయడం తోనే గడిచిపోయింది. శ్రీ చింతా రామకృష్ణరావు గారు వ్రాసిన పద్యం….

‘ మరపుకు రాని ఈ రోజు ఇది మాన్యులు శ్రీఫణిబాబుగారు సత్

కరుణకు మారుపేరయిన కాంతలోమణి సూర్యలక్ష్మియున్

సురుచిర సందరాంగుడగు శోభనా సద్గుణ శ్రీనివాసుడున్

తెరువును జూసి కల్సిన సుధమణి సత్ కవి రాక ఈశుడున్

గరువము గొల్పె తెల్గునకు కాంక్షనునొక్కటనుండి నేడిటన్

కరుణను గౌరవంబు నిడి కాంచిరి నన్ను మహాత్యమొప్పగన్”

వెళ్తూ, వెళ్తూ రాఖెష్ ఇలా అన్నాడు……..

కలసినాము నేడు కల్మషములు లేక

సాహితీ వనమున సంధ్యవేళ

గౌతమీ నది తట కల్పవృక్షము క్రింద

మంచి మాటలు విని మనసు పొంగె.

    ఇదండీ ఇలాగ అయింది, మా మొదటి కలయిక. ఆరోజున శ్రీ రమణ గారు వ్రాసిన ” మిథునం”, నా దగ్గర ఒక క్సెరాక్స్ కాపీ ఉంటే చదవమని శ్రీనివాస శాస్త్రి కి ఇచ్చాను. ఆ మర్నాడు వచ్చి చదివి తిరిగి ఇచ్చేశాడు.రాకేష్ నీ, శ్రీనివాసు నీ ” డు” ఎందుకంటున్నానంటే, వాళ్ళు ప్రతిభలో చాలా పెద్దవారైనా, వయస్సులో మరీ కుర్రాళ్ళండీ ( మహా ఉంటే మా అబ్బాయి కంటే ఓ ఏదాది అటో ఇటో) .

%d bloggers like this: