బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–గృహిణులూ,ఉద్యోగాలూ

    నా చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడూ స్త్రీలని ఉద్యోగాల్లో చూసిన జ్ఞాపకం లేదు, ఒకరూ, ఇద్దరూ అటెండర్ల క్రింద ఉండేవారు. ఆ తరువాత కాలేజీ లో చేరిన తరువాత అక్కడ ముగ్గురు లెక్చరర్స్ ఉండేవారు. అందులో ఒకరు మా భాస్కరం అక్కయ్యగారు,ఇంకొకరు ఝాన్సీ లక్ష్మి గారు, మూడో వారు పారుపూడి వెంకటరత్నం గారూ. ముగ్గురిలోనూ మా అక్కయ్యగారికి, ఝాన్సీ గారికీ వివాహం అవలెదు,ఇంక మూడో ఆవిడకి బహుశా భర్త లేరేమో( నాకు అంతగా తెలియదు). ఏది ఏమైనా నాకు ఓ పిచ్చినమ్మకం ఉండేది–వివాహం అయినవారెవ్వరూ ఉద్యోగాలు చేయరని !! నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరూ ఉండేవారు కాదు.

    ఇది ఇలాగ ఉండగా నెను 1963 లో పూనాలో ఉద్యోగంలో చేరాను. అక్కడకూడా మా ఫాక్టరీ లో ఉన్న పది,పదిహేను అమ్మాయిలూ వివాహం అవని వారే !! ఓహో మనం అనుకునేది కరెక్టే అని ఆ నమ్మకం ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది !! ఒకటి మాత్రం ఒప్పుకోవాలి–మా కాలేజీ లో పనిచేసే ముగ్గురూ, ఆ తరువాత ఫాక్టరీ లో పనిచేసే వారిని చూసిన తరువాత, ఆ రోజుల్లో ఉద్యోగం చేసే స్త్రీ లమీద అందరికీ ఎంత గౌరవమూ, ఆప్యాయతా ఉండేదో. వారిని చూస్తే అదో విధమైన, భక్తి భావం ఉండేది. వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఉట్టి పడుతోండేది.

    మా ఫాక్టరీ లో ఒక తెలుగాయన శ్రీ కృష్ణమూర్తి గారు, నాకు ఫోర్మన్ గా ఉండేవారు. ఒకసారి ఆయనా, నేనూ ప్రక్కనే ఉండే ఆఫీసుకి వెళ్ళవలసి వచ్చింది, అక్కడ ఒకావిడ ఆఫీసరుగా ఉండేవారు. మాతో మాట్లాడుతూ, కూల్ గా చేతిలో ఒక సిగరెట్టు తీసికొని, దానిని అంటించి ఉఫ్ మని పొగ విదలడం మొదలెట్టారు !! నాకు అప్పటికే ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటుంది కాబట్టి, ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మా కృష్ణమూర్తి గారిని చూస్తూంటే నాకు నవ్వాగలేదు, ఆయన కొంచెం చాదస్థం మనిషి, ఆయన అవస్థ చూస్తూంటే నవ్వితే , ఆవిడకు కోపం వస్తుందేమో అని భయం.ఈ సంఘటన జరిగి 45 ఏళ్ళు అయింది, అయినా ఇప్పటికీ తలచుకుంటే నవ్వు ఆపుకోలేను.

    1972 లో నా వివాహం అయింది, చెప్పానుగా నాకు సంబంధించిన చుట్టాలలో ఎవరూ పెళ్ళయిన ఉద్యోగస్తులు ఆడవారు లెరు. ఒక్కసారిగా చూస్తే మా అత్తగారు టీచర్ గా పనిచేస్తున్నారని తెలిసి, అమ్మయ్యా పెళ్ళయిన వాళ్ళుకూడా ఉద్యోగాలు చేస్తారూ, ఫర్వా లెదూ అనుకున్నాను !! మా ఇంటావిడ కూడా వివాహానికి పూర్వం, అత్తిలి లో టీచర్ గా పనిచేసిందిట. బహుశా అందువలనెమో రోజూ నాకు పాఠాలు చెప్పి నా ప్రాణం తీస్తుంది. చదువుకునేరోజుల్లో ఇంటినిండా టీచర్లే, చుట్టాలందరూ టీచర్లు. పెళ్ళి అయిన తరువాత అత్తగారూ, మామగారూ టీచర్లు. నేను ఎక్కడ సుఖపడిపోతానో అని ఓ టీచర్ ని కట్టబెట్టారు !! రోజూ నాకు”జ్ఞాన్” పంచుతుంది !!

    అయినా పెళ్ళి అయిన తరువాత సంసార బాధ్యత అంతా ఈ మొగుడు అనే ప్రాణి కే ఉంటుంది అనే అపోహలో పడి, మా ఇంటావిడని ఉద్యోగం చేస్తావా అని కూడా అడగలేదు.ఏదో ఈ 37 ఏళ్ళూ లాగించేశాము. అయినా ఛాన్స్ వచ్చినప్పుడల్లా సణుగుతుంది–నన్ను ఉద్యోగం చేయించలేదూ, లేకపోతేనా…..అంటూ.బహుశా ఈ కారణం వల్లనెమో, తను పిల్లల బాధ్యత పూర్తిగా తీసికొని వాళ్ళని ప్రయోజకులు చేసింది. అలాగని ఉద్యోగాలు చేసే తల్లులు, పిల్లల్ని సరీగ్గా పెంచరని కాదు. ఎంత చెప్పినా ఉద్యోగస్తులు, హౌస్వైఫ్ ల లాగ పూర్తి న్యాయం చేయలేరు కదా. చాలా శ్రమ పడాలి, అదీ నా ఉద్దేశ్యం, కోప్పడకండి.

    ఈ రోజుల్లో ఏ మాట్రిమోనియల్ యాడ్ చూసినా, ఉద్యోగాలు చేసే స్త్రీలే. అదే కాకుండా ప్రస్తుత కుటుంబ అవసరాలు తీరడానికి ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిందే. లేకపోతే

చాలా శ్రమ పడాలి. పిల్లలు కూడా తల్లితండ్రులిద్దరూ ఉద్యోగానికి వెళ్ళడం అలవాటు పడ్డారు, అడ్జస్ట్ అయిపోయారు.వారి దినచర్య కూడా మారింది. ఏదో వీకెండ్స్ లోనే అందరూ కలసి బయటకు వెళ్ళడం లాటివి అలవాటు చేసికున్నారు. అలాగని ఉద్యోగం చేయని గృహిణులందరూ ప్రతీ రోజూ బయట తిరుగుతారనికాదు.

    ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా ఉద్యోగం చేసే వారికోసమే చూస్తున్నారు. ఏదో వేణ్ణీళ్ళకి చన్నీళ్ళ లాగ, ఓ ఫ్లాట్టూ, కారూ, మిగిలిన అలంకారాలూ పెళ్ళైన ఏడాదిలో సమకూర్చుకోవచ్చు, పిల్లల్ని పబ్లిక్ స్కూళ్ళలో వేయవచ్చూ, వగైరా వగైరా… అదే కాకుండా, ఆడ పిల్లలు కూడా చదువులలో, మొగ పిల్లల కంటే ముందున్నారు. ఎక్కడ చూసినా ఇంజనీర్లు, డాక్టర్లు. ఇదివరకటి రోజుల్లో స్కూళ్ళకి వెళ్ళి చదువుకోలేదు కానీ, వాళ్ళకున్న జ్ఞానం ఇప్పటివారికంటే ఎక్కువే.

    అమ్మాయి క్వాలిఫికేషన్ చూసి, తనకన్నా ఎక్కువైనా ఎలాగోలాగ ఒప్పేసికుని పెళ్ళి చేసేసుకుంటున్నాడు ఈ రోజుల్లో అబ్బాయి–మొదటి కారణం వీడి ఉద్యోగం ఆర్ధిక మాంద్యం ధర్మమా అని ఊడిపోయినా, భార్య సంపాదనమీద కొత్త ఉద్యోగం వచ్చేదాకా లాగించేయొచ్చు. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే చాలా మంది కుర్రాళ్ళు వాళ్ళ భార్యలు ఉద్యోగం చేస్తే బాగుంటుందని ఆసిస్తారు.

    నేను ఈ మధ్యన రెండు కేసులు చూశాను మా చుట్టాలలో. ఒకరికి మంచి క్వాలిఫికేషన్ ఉంది, ఉద్యోగం చేయమ్మా అంటే ” నాకు సరిపడే ఉద్యోగం వచ్చినప్పుడు చేస్తానూ” అంటుంది. ” సరిపడే” అంటే ఏమిటీ, ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుందీ, ఈవిడ ఎప్పుడు సంపాదించడం మొదలెడుతుందీ, మనం అమ్మా నాన్నల్ని నాదగ్గరకు ఎప్పుడు తీసుకు రాగలనూ– ఇవన్నీ ప్రశ్నలే. అప్పటి దాకా మావాడు మింగా లేడు, కక్కా లేడూ.

రెండో కేసు–ఉద్యోగం చేస్తూందికదా అని సంబంధం ఖాయం చేసికున్నారు, ఈ అమ్మాయి పెళ్ళికి ముందర ఉద్యోగానికి రాజినామా చేసింది. భర్త ఉద్యోగం చేసే ఊళ్ళో

ఈ అమ్మాయికి ఉద్యోగం దొరికేలా లేదు. ‘ఫర్వా లెదూ ” అంటుంది ఈ అమ్మాయి. ఫర్వా ఎవరికమ్మా నీకు కాదు, నాకు, ఏదో ఉద్యోగం చేస్తూంది కదా అనుకుంటే ఈవిడేమో ఉద్యోగం వచ్చినా లేకపోయినా ఫర్వా లెదంటుంది.

    అంటే ఈ ప్రపంచం లో నాలాటి వారుంటారన్నమాట–చదవరా చదవరా అని నెత్తీ నోరూ బాదుకున్నా నాకు చదువు మీద అంత ఇంటరెస్ట్ లెదూ అని ఒక

పుణ్యాత్ముడు ఉద్యోగం వేయిస్తే ఠింగ్ రంగా మంటూ వెళ్ళిపోయి సుఖ పడ్డాను. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉద్యోగం చేయమ్మా అంటే ‘అబ్బే నాకు ఇంటరెస్ట్ లెదండి” అంటున్నారు.

%d bloggers like this: