బాతాఖాని–లక్ష్మిఫణి ఖబుర్లు-పాశర్లపూడి

IMG_0550IMG_0552IMG_0559IMG_0560IMG_0573IMG_0576

    పూణే తిరిగి వెళ్ళడానికి ఇంకా టైముంది కదా అని నిన్న బయలుదేరి , నేనూ, మా కజినూ బస్సులో పాశర్లపూడి వెళ్ళాము. అమలాపురం నుండి బోడసకుర్రు రేవు దాటి వెళ్తే చాలా దగ్గర. కానీ, మా ఇద్దరికీ కూడా గోదావరి పడవలో దాటడం భయం. అందువలన రోడ్డు మార్గం లో, ముందుగా అంబాజీపేట, అక్కడనుండి జగ్గన్నపేట దాకా బస్సులో వెళ్ళి, షేర్ ఆటో ఎక్కి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము ( ఆయన నాకు వరంగాం లో పని చేసినప్పుడు మంచి స్నేహితుడు).

    వాళ్ళ ఇల్లు ఓ కొబ్బరితోటలో ఉంది. ఆ ఇల్లూ పరిసరాలూ చూస్తూంటే కడుపు నిండిపోయింది. దానికి సాయం ఆయన మాకోసం తాజాగా కొబ్బరిబొండాలు తీయించి ఉంఛారు. అక్కడ ఓ రెండు గంటలు గడిపాక, ఆయనే అన్నారు–తిరిగి వెళ్ళేటప్పుడు రేవు దాటి వెళ్ళండీ అని.సరే అని మళ్ళీ ఓ షేర్ ఆటో తీసికొని,పాశర్లపూడి రేవు దాకా వేళ్ళే సరికి, అక్కడ రేవు దాటడానికి ” బంటు” అంటే బల్లకట్టులాగ ఉంది, దానికి ఓ ఇంజనూ. దానిమీద కార్లూ అవీ కూడా తీసికెళ్ళొచ్చుట. దానిమీద అప్పటికే ఓ కారు కూడా ఉంది.నెనే అనుకుంటే, మా వాడికి నాకంటే ఎక్కువ భయం, ఇలా వద్దురా, మనం బస్సు రూట్లోనే వెళ్ళిపోదామని ఒకటే గొడవ.టికెట్ 3/- రూపాయలు, తీసికొని, భగవంతుడి మీద భారం వేసేసి అది ఎక్కేశాము!!

    రేవు దాటడానికి ఓ పావుగంట పట్టింది. ఎంత బాగుందో చెప్పలెను. ఆ ప్రక్కనే వంతెన కడుతున్నారు. ఇప్పటికే ఓ పిల్లర్ ఒరిగి పోయింది. అది ఎప్పుడు బాగుచేస్తారో, ఎప్పటికి ఈ వంతెన పూర్తి అవుతుందో ఆ భగవంతుడుకే తెలియాలి. కొసమెరుపేమిటంటే–హైదరాబాద్ ఫ్లై ఓవరూ, ఢిల్లీ లో మెట్రో ఫ్లై ఓవరూ కట్టిన “గామన్ ఇండియా ” వాళ్ళే ఈ వంతెనా కడుతున్నారు !!

    రేవు దాటి బోడసకుర్రు చేరాము. మా చిన్నతనంలో మా ఇంటి ముందరనుండి బోడసకుర్రు కి బస్సులుండేవి. పది సంవత్సరాలనుండీ ఆటో వాళ్ళు ఆందోళనలు చేసి ఈ బస్సులు ఆపేశారు .అందువలన ఆటోలే గతి. మళ్ళీ ఓ షేర్ ఆటో తీసికొని అమలా పురం చేరాము. ఈ మధ్యన మూడు నాలుగు సార్లు అక్కడికి వెళ్ళినా నేను చదివిన స్కూలు చూడలేకపోయాను. అమ్దువలన ఈ అవకాశం తీసికొని అక్కడకు వెళ్ళి హెడ్మాస్టారు గారిని కలుసుకొన్నాము. ఆ రూం లో మొదటినుండీ అక్కడ పని చేసిన హెడ్మాస్టర్లందరి పేర్లూ ఉన్నాయి. మా నాన్నగారు మూడు సార్లు పనిచేశారు. ఆ స్కూలూ అదీ చూసిన తరువాత నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ తాజా చేసికొని తిరిగి సాయంత్రానికి రాజమండ్రీ చేరాము.

మీలో ఎవరికైనా అవకాశం వస్తే రేవు దాటి వెళ్ళండి. కార్లున్నా ఫరవా లెదు. అదో మధురానుభూతి.

%d bloggers like this: