బాతాఖానీ—లక్ష్మిఫణి ఖబుర్లు–బేర సారాలు–1

   ఎప్పుడైనా కొట్టుకి వెళ్తే కొంతమంది బేరం చేయనిదే సరుకు కొనరు.అదో అబ్సెషన్! ఒక్కొక్కప్పుడు వీళ్ళు అడిగే పధ్ధతి చూస్తే ఆ కొట్టువాడు కొడతాడేమో అనిపిస్తుంది. వీళ్ళకి చీమ కుట్టినట్లైనా ఉండదు. ఏది ఏమైనా సరే, కొట్టువాడు చెప్పిన దానికి సగం రేటుకి అడుగుతారు, విచిత్రమేమంటే వాడు ఇవ్వడానికి సిధ్ధ పడతాడు. అంటే మన వాళ్ళు రైటే అని అర్ధం కదా!! బేరం ఆడడం ఓ కళ. అందరికీ రాదు !!ఉదాహరణకి నేను కొట్టువాడు చెప్పినదానికే కొంటాను, నాకు సరుకు నచ్చితే. అందుకే మనం రెగ్యులర్ గా వెళ్ళే కొట్టువాడు, మనని చూడగానే మొహంనిండా నవ్వు పులిమేసికొని ” రండి సార్ చాలా రోజులయ్యింది, ఏం తీసికొంటారూ” అంటూ , ఓ కూల్ డ్రింకో, కాఫీయో, చాయో తెప్పించేస్తాడు. అంటే వాడికి మనలాటి ” బక్రా” లని చూస్తే ఎంత సంతోషమో. మనకి మార్కెట్ లో ఎంత పాప్యులారిటోయో అని ఇంటావిడ కేసి చూస్తాము. కొట్టువాడేమో మనతో ఆడేసుకుంటాడు. మొహమ్మాటానికీ, మన ఇమేజ్ కాపాడుకోవడానికీ ఏదో ఒక సరుకు కొని వాడికి డబ్బులు సమర్పించుకొంటాము. ఏదో భర్తగారికి తెలిసినవాడు కదా అని, ఇంకో రెండు మూడు సరుకులు సెలెక్ట్ చేసిందంటే, మన పని గోవిందా. అలాగని ఆ కొట్టువాడు వదులుతాడా, డబ్బు కేముందండీ తరువాత మీకు తోచినప్పుడు ఇవ్వొచ్చూ అంటాడు. అంతే మనం వాడికి ” హైపోతికేటెడ్” అయిపోయామన్నమాట !!

7nbsp; కొందరుంటారు, మన ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొన్నామనుకోండి, ఏదో చూసి వదిలేయొచ్చుగా, అబ్బే దాని “హిస్టరీ” అంతా అడిగి తెలుసుకుంటారు, ఎక్కడకొన్నారూ, ఎంత పెట్టి కొన్నారూ వివరాలన్నీ. అక్కడితో ఆగక, ఆ వస్తువు మనం కొన్నదానికంటే తక్కువ ఖరీదనీ, కొట్టువాడు మనని ఎలా మోసం చేసేడో, లాటివన్నీ ఏకరువు పెట్టి, అబ్బే మిమ్మల్ని చూస్తే మరీ అమాయకంగా కనిపిస్తారు, అలాగైతే లాభం లెదండీ అంటూ ఓ క్లాసు పీకుతారు. ఇంక ఇంట్లో వాళ్ళు, అవకాశం దొరికిందికదా అని, వాళ్ళతో కలసి, ” అన్నయ్యగారూ, మీరు చెప్పేది రైటేనండీ, నేను ఎప్పుడైనా బేరం చేస్తే, అబ్బే నీకేం తెలియదూ అంటూ తోసి పారేస్తారు, శుభ్రంగా గడ్డి పెట్టండి , కాపరానికొచ్చినప్పడినుండీ ఇదే వరస” అని తనలో ఇన్నాళ్ళూ దాచుకొన్న కసి అంతా బయట పెడతారు !!

అసలు సంగతేమంటే, మనం కొన్న ఆ వస్తువు ఆ వచ్చిన వాడు ఎప్పటినుండో కొనాలని కోరికా, కొనలెని అశక్తతా,స్నేహితుడు తనకంటే ముందే కొనేశాడు. వీడిమీద

” బ్రౌనీ పాయింట్స్” ఎలా స్కోర్ చేయడమా అని ఆలోచించి, ఇలాగ మన కాపురం లో చిచ్చు పెడతాడన్న మాట !!ఇవన్నీ మన ఇంట్లో వాళ్ళకి తెలియక, వాడు ఏదో మన శ్రేయోభిలాషీ అని వాడిని సపోర్ట్ చేస్తారు.

ఇంకొందరుంటారు, మార్కెట్ లో ఉన్న ప్రతీ దాని ఖరీదులూ తమకే తెలుసన్నట్లు. ప్రతీ దానికీ ఏదో ఒక రిఫరెన్స్ ఇచ్చి,అడిగినా అడక్కపోయినా సలహాలిచ్చేస్తూంటారు. ప్రపంచం లో దేనిగురించైనా ఓ లెక్చర్ ఇచ్చేస్తారు. ఖర్మ కాలి, మనం ఏదైనా, స్థలమో, ఇల్లో కొందామనుకుంటున్నామని అన్నామా, మనని వదలడు. వాడికి తెలిసిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడూ, తీసికెళ్తానూ, మనకైతే కన్సెషన్ ఇస్తాడూ అంటూ ఏవేవో ఏకరువు పెట్టి మనని, ఆ ఊబిలో ముంచడానికి కంకణం కట్టేసుకుంటాడు. వాడికి తెలుసు, మనం అంత సులభంగా వాడి వలలో పడమూ అని. అంతే అటునుండి నరుక్కొస్తాడు. మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే, మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వాళ్ళని ఊదరకొట్టేస్తాడు. ఇంక ప్రతీ రోజూ ఇంట్లో మనకి క్లాసులు ప్రారంభం, ” మీరు కొనరూ, ఎవరైనా ఉపకారం చేస్తానంటే వినరూ, అస్సలు నాకు స్వంత ఇంట్లో ఉండే యోగం ఆ దేముడు రాసి పెట్టాడో లేదో” అంటూ కన్నీళ్ళు పెట్టేసికొని ఓ పేద్ద సీన్ క్రియేట్ చేయడం. ఇంక ఈ గొడవ భరించలేక, ఓ రోజు ఆ ఫ్రెండు తో ” సరే మీ ఏజెంట్ దగ్గరకు తీసికెళ్ళూ ” అంటాము. మనం అడగ్గానే ఒప్పేసుకుంటే వాడి వాల్యూ తగ్గిపోదూ, ఓ వారం రోజులు

ఫోన్లూ, తిరగడాలూ అయిన తరువాత, ఓ పెద్ద పోజు పెట్టేసి ఆ ఏజెంట్ దగ్గరకు వెళ్ళే కార్యక్రమం ఫిక్స్ చేస్తాడు. ఇంత హడావిడీ పడి వెళ్తే, అక్కడ మన వాడికున్న పరపతి ఏమిటో తెలుస్తుంది. ఇలాటి వాళ్ళంతా అసలు ఏజెంట్ కి సబ్ ఏజెంట్లన్న మాట. అయిన లావా దేవీల్లో వీడికి కూడా కొంత కమీషనుంటుంది. మనమీదేదో ప్రేమ కాదు, వాడికి వచ్చే సంభావన మీద ప్రేమ.

ఇంక మనం ఇల్లేదైనా అమ్ముదామని చూశామో, దానికి వచ్చే ధర గురించి అందరూ మనకి అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు. ఇక్కడ రేట్లు చాలా బాగున్నాయండి, అమ్మదలిస్తే నాతో చెప్పండీ, మంచి రేటు వచ్చేట్లా చూస్తానూ అంటూ. మనం ఆ ఇంటికి వచ్చే ధర గురించి బంగారు కలలు కంటూ, ఆ పై కార్యక్రమం గురించి ప్లాన్స్ రెడీ చేసుకుంటాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తణుకు లో మా ఇల్లు అమ్మేటప్పుడు నేను పడ్డ బాధలన్నీ మీకూ తెలియాలి. దీనిలో ఏమైనా మీకు ఉపయోగిస్తే సంతోషం. ఇంక మన ” ఇల్లు అమ్మడం కార్యక్రమం ” ప్రారంభం. వారానికో సారి ఫోన్ చేయడమూ, ఆయన ( మాకు సహాయం చేస్తానన్న పెద్ద మనిషి), అబ్బే ఇంకా ఎవరూ అంతగా రాలెదండీ, మొన్న ఒకళ్ళిద్దరు చూసి వెళ్ళారూ, ఏ సంగతీ ఓ రెండు మూడు రోజుల్లో చెప్తామన్నారూ.దానర్ధం ఓ రెండు మూడు రోజుల తరువాత మనం మళ్ళీ ఆయన్ని అడగాలన్న మాట.ఏదో రిటైర్ అయిపోయాడుకదా, ఇంట్లోనే ఉంటాడూ అనుకొని ఫోన్ చేస్తే, వాళ్ళావిడ ఫోన్ తీసికొని ” ఇప్పుడే అలా బయటకి వెళ్ళారండీ, వచ్చిన తరువాత మీరు ఫోన్ చేశారని చెప్తానూ” అంటుంది.ఇక్కడ మనకి టెన్షనూ, ఇల్లు అమ్మకం సంగతి ఏమయిందో అని.

మనం వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసికోలేదుకదా అని అక్కడ ఉండే మన చుట్టాలకి మనమీద పీకలదాకా కోపం. వీళ్ళేం చేస్తారూ, అడిగిన వాడికీ, అడగని వాడికీ, ఈ ఇల్లు అమ్మేస్తారండీ, కానీ ధరే కొంచెం ఎక్కువా, అని ఏదో ఎక్కువ రేట్లు చెప్పేసి మన ఇంటికి వచ్చే బేరాల్ని తగలేయడం. దీనివలన వాళ్ళకి ఒరిగేదేమీ లెదు, మనం బాగుపడకూడదు అంతే వారి లక్ష్యం. మళ్ళీ రేపు కలుసుకుందాం….

%d bloggers like this: