బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–షడగోప్యం (శఠగోపనం)

   నేను ప్రతీ రోజూ ప్రొద్దుటే స్నానం అయిన తరువాత గొదావరి గట్టుమీద ఉన్న దేవాలయాలు దర్శించుకొని వస్తూంటాను. వీలున్నంత వరకు అక్కడ నా గోత్రనామాలతో ప్రతీ రోజూ పూజ చేస్తూంటారు. ఓ పదిహెను రోజులనుండి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో లోపలకు వెళ్ళడం మానుకున్నాను.దానికి నా కారణాలు నాకున్నాయి ( అని ఇన్నాళ్ళూ తప్పుగా అనుకున్నాను).

    ఏమయిందంటే— నేను రోజూ ఆ గుడిలో గర్భగుడికి ఈవల నుంచొని దండం పెట్టుకునేవాడిని. ఓ సారి ఏమయ్యిందంటే, గర్భగుడిలో పెద్ద పూజారి గారు పూజ చేస్తూండగా, ఇవతలి గదిలో, వాళ్ళ అబ్బాయో ఎవరో ఒకాయన క్రింద కూర్చొని, నేను అలవాటు ప్రకారం లోపలికి వెళ్తూంటే, చెయ్యి చూపిస్తూ గట్టిగా ” లోపలకి రావద్దూ” అన్నాడు. నాకు మొదట అర్ధం అవలెదు ఏమంటున్నాడో, బయటకు వచ్చేసి దండం పెట్టుకొని వచ్చేశాను. అలాగ ఇంకో రెండు మూడు సార్లు అయింది. అదికూడా ఆ అబ్బాయి ఉన్నప్పుడే అవడం యాదృచ్ఛికం. ఏమో నేను లోపలికి రావడం ఆయనకి ఇష్టం లేదేమో అనుకొని ఈ పదిహేను రోజులూ బయటనుండే దండం పెట్టుకొని వచ్చేస్తున్నాను. ఆ అబ్బాయి నన్ను అదిలించిన పధ్ధతి నన్ను చాలా బాధించింది.

    నిన్న ఏమయ్యిందంటే ఆ పెద్దపూజారిగారు, పూజ పూర్తిచేసికొని, నన్ను చూసి ” ఏమండీ ఫణిబాబుగారూ, లొపలికి వచ్చి తీర్థం పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారేమిటీ ” అని అడగ్గానే, నేను విషయం చెప్పాను, నాకు కోపం వచ్చిన మాట కూడా చెప్పాను,” మేము గుడికి దైవదర్శనానికి మాత్రమే వస్తామూ, మీ పిల్లల మొహాలు చూడడానికి కాదూ, మీ అబ్బాయిలు నన్ను లోపలకి రావద్దని ఒకసారి కాదు, రెండు మూడుసార్లు విదిలించేశారూ, ఏమో నేను లోపలకి రావడం మీకు ఇష్టంలేదేమో అనుకొన్నాను” అని నా మనస్సులో ఉన్న మాట చెప్పేశాను. దానికి ఆయన చాలా బాధ పడి క్షమాపణ చెప్పి, అస్సలు సంగతి చెప్పారు– లోపల పెద్దాయన పూజ చేస్తున్నప్పుడు, ఈ చిన్నవాళ్ళు ఒక్కొక్కప్పుడు, అదేదో గరుడ పూజో ఎదో చదువుతూంటారుట, అలాటప్పుడు బయటవారిని ఎవరినీ ఆ చదవడం పూర్తి అయ్యేదాకా లోపలికి అనుమతించరుట. ఈ విషయమేదో సౌమ్యంగా చెప్తే నాకూ అర్ధం అయ్యేది కదా.ఆయనకూడా నా మాట అర్ధం చేసికుని, పిల్లలకి బయటవారితో సరి అయిన పధ్ధతిలో చెప్పమని చెప్పారుట. అందువలన నిన్నటినుండీ లోపలకి పిలిచి తీర్థం ఇస్తున్నారు !!

ఈ విషయాలన్నీ మాఇంటావిడతో చెప్పాను. ఆవిడ అదేదో పుస్తకంలో చదివినది చూపించింది— ‘గుడిలో శఠగోపం తలమీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుందీ’

అన్నశీర్షిక క్రింద ఇలా వ్రాశారు…...” దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసికోవాలి.చాలా మంది దేముడి దర్శనం చేసికొని, వచ్చిన పని పూర్తయిపోయిందని, చకచకా బయటకు వెళ్ళిపోతారు. కొంతమందే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. షడగోప్యం అంటే “అత్యంత రహస్యం”, అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలచుకోవాలి.

అంటే మీ కోరికే షడగోప్యం. మనిషికి శత్రువులైన కామమూ,క్రోధమూ,లోభమూ,మోహమూ, మదమూ,మాత్సర్యముల వంటి వాటికి ఇక దూరంగా ఉంటానని, తలుస్తూ, తలవంచి తీసుకోవటమూ మరో అర్ధం.ఒక్కోసారి, చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యం వదిలేస్తూంటాము. అలా చెయ్యొద్దు.పూజారి చేత షడగోప్యం తప్పకుండా పెట్టించుకోండి, మనస్సులోని కోరికను స్మరించుకోండి.షడగోప్యమును రాగి, వెండి,కంచు లోహాలతో తయారు చేస్తారు,పైన విష్ణు పాదాలుంటాయి.

షడగోప్యం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్,దాని సహజత్వం ప్రకారం, శరీరానికి లోహం తగిలినప్పుడు, విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బయటకి వెళ్తుంది,దీని వలన శరీరం లోని, ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి . ఈ షడగోప్యాన్నే శఠగోపనం అనికూడా అంటారు “

    ఇదండీ సంగతి. ఇక ఇటుపైన ఎక్కడ, ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా శఠగోపం పెట్టించుకోకుండా బయటకు రాకూడదని నిశ్చయించుకున్నాను. ఇక్కడ రాజమండ్రీ లో ఫర్వా లెదు.ఇంక పూణే వెళ్ళిన తరువాత ఏం చేయాలో తెలియడంలేదు. అక్కడ ఇలాటివేవీ ఉండవు. చేసికున్నవాడికి చేసికున్నంతా అనుకుని సరిపెట్టేసుకోవడమే !!

%d bloggers like this: