బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు- Freedom at Midnight-2

IMG_0521IMG_0520

    మా ఇంటావిడ పదిహేను రోజులనుండి ఫ్రిజ్ లో జాగ్రత్త పెట్టిన క్రీం ని నిన్న వెన్నలోకి మార్చేను. ఫ్రిజ్ లో పెడితే అది చూడ్డానికైనా వెన్నలాగుంటుందని ఫ్రిజ్ లో పెట్టేశాను. దానిని నెయ్యి లోకి మార్చాలని ఈ వేళ నిశ్చయించుకొన్నాను. ప్రొద్దుటే, దేవాలయ దర్శనము అయిన తరువాత, బ్రేక్ ఫాస్ట్ తీసికొని ఆ కార్యక్రమం మొదలెట్టానండి. ఎంత సేపు మరిగించినా ఉడుకుతుందే తప్ప, ఏమీ మార్పు కనబడలేదు!! బహుశా వెన్నగా కన్వర్ట్ అవలెదేమో అనుకున్నాను. అక్కడే నుంచొని, దానిని పరిశీలించగా, ఓ గంట సేపైన తరువాత నెయ్యిలోకి మారినట్టనిపించింది. సాయంత్రం మా కజిన్ వచ్చి అది లేత కాపు వచ్చిందీ, ఇంకొంచెం ఉంచితే బాగా అయ్యేదీ అన్నాడు. ఏమైతేనే నెయ్యి లాంటి పదార్ధాన్ని తయారుచేశాను.

    మరీ మూడు రోజులైపోయింది కదా అని, ఇల్లు తుడవడం, తడిగుడ్డతో పోచా చేద్దామని మొదలెట్టాను. మేము 30 న ఖాళీ చేస్తామని మా ఇంటి ఓనర్ తో చెప్పడం వల్ల, అద్దెకు ఈయడానికి, ఎవరైనా వస్తే చూపించడానికి, మా వాచ్ మన్ ఎవరో ఒకరిని తెస్తూంటాడు. అలాగే ఈ వేళ ప్రొద్దుటా ఎవరో వచ్చారు. నేనేమో ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్స్ లో ఉన్నాను, బెల్లు కొట్టగానే తలుపు తీయడం, ఎవరో ముగ్గురు లోపలికి వచ్చేశారు. ఇక్కడ ఎవరికీ అడగడం లాటి అలవాటు లెదు, నేరుగా వచ్చేయడమే.నేను చచ్చేటట్లుగా తడిగుడ్డ పెట్టి తుడిచి, ఇంకా తడి ఆరని నేల మీద అడుగులు వేసేసరికి నాకైతే చిర్రెత్తుకొచ్చింది. ఇదివరకు మా ఇంటావిడ ఎప్పుడైనా, అలా తుడిచిన నేలమీద నేను ఎప్పుడైనా అడుగేస్తే గయ్య్ మని ఎందుకు అరిచేదో !!

    వాళ్ళని చూస్తే చాలా చిరాకనిపించింది. అద్దె ఎంతిస్తున్నారూ అని అడగ్గానే ఒళ్ళు మండి ” ఏమీ ఇవ్వడం లేదండీ, ఊరికే ఉంటున్నామూ ” అన్నాను.వాళ్ళ ఉద్దేశ్యం ఇంట్లో ఉన్న అన్ని సరుకులూ కూడా ఇంటాయనే ఇచ్చినట్లు అనుకుంటున్నారేమో !! అడగ వలసిన పధ్ధతి లో అడిగితే ఏదో సరైన సమాధానం చెప్పేవాడిని. ఈ మూడు వారాలూ, ఎవడో ఒకడు వచ్చేదాకా నాకు ఈ గోల తప్పదులా ఉంది.

%d bloggers like this: