బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–మొహమ్మాటం/ చేతకానితనం


    మామూలుగా ఒక్కొక్కప్పుడు మనం పడే మొహమ్మాటాన్ని ” చేతకాని తనం ” అనికూడా చెప్పుకోవచ్చు.ప్రతీ మనిషికీ లౌక్యం తప్పకుండా తెలిసిఉండాలి.లేకపోతే ప్రస్తుత ప్రపంచంలో నెగ్గుకు రావడం చాలా కష్టం. పోన్లెద్దూ, వాళ్ళని అనుకోవడం ఎందుకూ, మనమే కాంప్రమైజ్ అయిపోదాము అనుకుంటాము. కానీ అవతలవాళ్ళు దీనిని ఒక అడ్వాంటేజ్ గా తీసికొని, మనని ఉపయోగించుకుంటారు. ఇలాటివన్నీ ఈ ఏడాదీ ఆంధ్రదేశం లో ఉండి అనుభవం లోకి వచ్చాయి. ఇవన్నీ నాకు కొద్దిగా మిగిలిఉన్న భావిజీవితంలో ఎంతవరకూ ఉపయోగపడతాయో తెలియదు.

    ఈ మధ్యన మా ఎదురుగా ఉండే ఆయన, ఏదో కార్యక్రమానికి, హైదరాబాద్ నుండి వచ్చారు, ఓ వారంరోజులు గడుపుదామని. ఆయన ఈ నెలాఖరుకి రిటైర్ అవుతున్నారు. రాజమండ్రీ లో ఉందామనే సదుద్దేశ్యంతో, ఇక్కడ గోదావరి గట్టున ఓ ఫ్లాట్ కొన్నారు.ఆయనా, నేనూ ఓ రోజు ఖబుర్లుచెప్పుకున్నాము.ఇక్కడ ఓ సంవత్సరం నుండీ ఉంటున్నాను కదా అని, ఉండడానికి ఎలా ఉంటుందండీ అని అడిగారు.ఆయన కూడా గత పాతిక సంవత్సరాలనుండీ హైదరాబాద్ లోనే ఉన్నారు.ఎప్పుడో చుట్టపు చూపుగా రావడమే కానీ, గట్టిగా ఓ నెలరోజులు గడపలేదు. నేను నా అభిప్రాయం చెప్పాను, ఎలాగూ ఇక్కడ శాశ్వతంగా ఉండడం లేదు, పోనీ నా అనుభవాలు పంచుకుంటే ఆయనకి ఉపయోగపడొచ్చూ అని.ఇక్కడ రోడ్ల పరిస్థితీ, సొసైటీ ( అంటే మేముండే అపార్ట్మెంట్లు) లో ఉండే సాధక బాధకాలూ,లాటివన్నమాట. నేను చెప్పానుగా ఒక బ్లాగ్గులో, మా ఫ్లాట్ పైన ఉండేవారి పనిమనిషి, ప్రతీ రోజూ, మొత్తం రోజులో ఓ గంటసేపైనా ఏవేవో పొడులు తయారుచేస్తూండడమో, లేక పచ్చళ్ళు రుబ్బడమో , ఏమీలేకపోతే మసాలా నూరడమో, ఆతావేతా నా లైఫ్ ని మిజరబుల్ చేస్తుంది.అయినా ఏమీ చేయలేకపోయేను, దానికి ” సంస్కారం” అని ఓ పేరు పెట్టుకొన్నాను. దానిని “చేతకానితనం” అనాలి.

    ఇంక మా సొసైటీ లో నెలలో ఓ పదిరోజులైనా లిఫ్ట్ పనిచేయదు, ఏదో ఒక రిపైర్ దానికి, ఎప్పుడైనా ఖర్మకాలి వాచ్మన్ ని జనరేటర్ వెయ్యరా అంటే, పనిచేయడంలేదూ అని ఓ రొటీన్ సమాధానం చెప్తాడు. ఎంత చెప్పినా అద్దెకున్నవాళ్ళంకదా. నోరుమూసుకొని నాలుగు అంతస్థులూ ఎక్కి వెళ్ళడమే, పోనీ కంప్లైంట్ చేద్దామా అంటే మళ్ళీ మొహమ్మాటమే ( అదే చేతకాని తనం). ఇవన్నీ ఆయనతో పంచుకొన్నాను.

    అదేరోజు ఆయన ఒక విండో ఏ.సీ తెచ్చి అమర్చారు, ఇక్కడ ఎండ వేడి భరించలేనిదిగా ఉంటుంది. రాత్రి ఏ.సీ పెట్టుకొని, ఆయనా, మనవరాలూ పడుక్కున్నారు, ఓ రాత్రి వేళ, వాళ్ళక్రింద ఫ్లాట్ లో ఉన్న ఒకాయన వచ్చి తలుపులు దబదబా అని తట్టాడు. ఆవిడ లేచి సంగతేమిటా అని చూస్తే, ఈ వచ్చినాయన ” మీకు అస్సలు బుధ్ధి ఉందా లేదా, క్రిందవాళ్ళనుగురించి ఆలోచించఖ్ఖర్లేదా, మీ ఏ.సీ లోంచి నీళ్ళు మా విండో మీద పడి, చప్పుడు చేస్తూ నా నిద్ర పాడిచేస్తున్నాయీ” అంటూ, ఇంకా ఏవేవో వీళ్ళ సంస్కారాన్ని గురించీ వగైరా వగైరా ఏమేమో అరచి, అలసిపోయి వెళ్ళిపోయాడు. ఇది జరిగినది ఎప్పుడూ రాత్రి 12 గంటలకి. ఆవిడ హడలిపోయింది, ఆవిడచెప్పేది ఏమైనా వింటేనా, తన గొడవేదో తనదే. కళ్ళంపట నీళ్ళు పెట్టుకొని ఆయన్ని లేపింది. వాళ్ళు ఏ.సీ.పెట్టింది సాయంత్రం 7.00 గంటలు దాటిన తరువాత, ఇంకా మర్నాడు వచ్చి నీళ్ళు పోవడానికి ట్యూబ్బూ అవీ పెట్టాలి. అయినా ఆ క్రిందాయనకి చెప్పే ధైర్యం లేకపోయింది. ఇవన్నీ నాతో మర్నాడు చెప్పారు. పోనీ ఇవన్నీ ఆయనతో చెప్పొచ్చుగా అని, నేను ఓ ఉచిత సలహా ఇచ్చాను!! నేను ఏడాదినుండీ పడుతున్న హింసని ఆపలేకపోయాను!!ఇంకెంత ఇక్కడ ఉండేది ఓ వారమే కదా అని!! మా ఎదురుగుండా ఉన్నాయనంటారూ, పోనీ ఏ.సీ తిసేద్దామా అంటారు!! ఇదండీ ఆయన మొహమ్మాటం ( అదే చేతకాని తనం!!). కొసమెరుపేమిటంటే అంత దెబ్బలాడినాయన ఫ్లాట్ ఓనర్ కాదు, నాలా అద్దెకుంటున్న పక్షే !!

    ఇవన్నీ కాకుండా ఇంకో సంఘటన జరిగింది– వాచ్ మన్ కి వీళ్ళ బట్టలన్నీ ఇచ్చి ఉతికి, ఇస్త్రీ చేసి ఇమ్మన్నారు. వాడు ఆ బట్టలన్నీ టెర్రేస్ మీద ఆరేశాడు. సాయంత్రం చూస్తే అన్నీ ఉన్నాయి కానీ, వాళ్ళ కోడలి డ్రెస్స్ ఒకటి ( చాలా కాస్ట్లీ దిట) పోయింది. వీడంటాడూ, నాకెమీ తెలియదూ, ఫ్లాట్టుల్లో వాళ్ళే ఎవరో కొట్టేశారూ అంటాడు. ఈయన తూర్పు దిక్కుగా తిరిగి దండం పెట్టడం తప్పించి ఏమీ చేయలేకపోయారు !! ఏమంటే మొహమ్మాటం ( అదే చేతకాని తనం!!) అడగడానికి.

    కొంతమందుంటారు, మనం ఎక్కడికైనా ఎదో ఫలానా ఊరు వెళ్తున్నామూ అంటామనుకోండి, అప్పటికప్పుడు ఏదో ఆలోచించేసి, ఊళ్ళో ఉండే వీళ్ళ చుట్టాలకి, మన చేత ఏదో ప్యాకెట్టో, మరేదో తీసికెళ్ళి ఇమ్మనడం.అది ఓ ఊరగాయ అవొచ్చు, ఓ వస్తువవొచ్చు, మరెదో అవొచ్చు.ఇవ్వమూ అనడానికి మొహమ్మాటం.మన వస్తువులకంటే దాన్ని మహ జాగ్రత్తగా చూసుకోవాలి. తీసికెళ్ళం అంటే కోపాలూ. ఏదో వీడే మోస్తున్నట్లు పోజూ అంటూ అందరిదగ్గరా మనల్ని యాగీ చేసేస్తారు!!

   ఇలాటివాళ్ళకి ఇదో జాడ్యం. అదేం ఖర్మమో ఎక్కడికి వెళ్తున్నామన్నా అక్కడ ఓ స్నేహితుడినో, చుట్టాన్నో సృష్టించేస్తారు, వీళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి. పిల్లికి చెలగాటమూ ఎలక్కి ప్రాణసంకటమూ!! ఇలాటివన్నీ వ్రాస్తే వీడేదో ” అన్సోషల్ యానిమల్” అని ఓ టైటిల్ కూడా ఇస్తారు.

వీటన్నిటినీ మొహమ్మాటం అందామా, చేతకానితనం అందామా? మీరే చెప్పండి !!

4 Responses

 1. నన్నడిగితే, ఖచ్చితంగా ఎదుటి వారి వల్ల మనకు కలిగిన అసౌకర్యాన్ని వారికి తెలియజేయాలంటాను. కొందరు చెప్పకుండానే మారతారు. ఇంకొందరు చెపితే మారతారు. మూడో రకం వారు ఎన్నటికీ మారరు. సాధారణంగా
  మనుషులు మొదటి రెండు రకాలలో ఏదో రకానికి చెందినవారై ఉంటారు. అపార్ట్ మెంట్ అంటున్నారు కాబట్టి పొద్దున్న లేస్తే మొహం మొహం చూసుకోవాలి కాబట్టి అచ్చ తెలుగులో సాధ్యమైనంత తక్కువ స్వరంలో చెప్పడానికి ప్రయత్నించండి. 90% విజయావకాశం ఉంది. చెప్పేటప్పుడు మొహంలో చిరునవ్వు మాత్రం చెరిగిపోకూడదు సుమా..!!

  Like

 2. చాలా బావుందండీ. లగే రహో మున్నా భాయి సినిమా గుర్తొచ్చింది.

  నోహ్ ! అని చెప్పడం ఒక కళ. మా ఫ్లాట్స్ లోనూ ఉన్నారు. అందరూ రిటైర్ అయ్యి, విశ్రాంతి తీసుకునే వయసు దంపతులు. మా లిఫ్టు మూడేళ్ళు గా పనిచేయడం లేదు. ఒకసారి బిల్డరు సహకరించక, చాలా సారులు మిగతా ఫ్లాటు ఓనరులు సహకరించకా, అది మొత్తానికి మూల పడే ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో సోషల్ లైఫ్ అంటే, మా ఇంట్లో విశేషాలు మీ ఇంట్లో, మీ ఇంట్లో తగవులు మా ఇంట్లో గుసగుసగా చెప్పుకోవడమే. సహకారం అస్సలు ఉండదు. మా కిందింట్లో ఉండే ఫ్లాట్ ఓనరు మా ఇంట్లోకీ బాథ్ రూము లోకీ, బాల్కనీ ల్లోకీ చాలా స్వతంత్రం గా (వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు లీక్ అయిపోతున్నాయని గొడవ పెట్టేసుకుని) వచ్చేసి, పనివాళ్ళని తెచ్చి, ఆయనే పనికి పురమాయించి, మమ్మల్ని డబ్బులు ఇచ్చేయమంటాడు. అసలు సమస్య గురించి మాకు రివ్యూ చేసుకునే అవకాశం ఈయకుండా! ఈయన ని లిఫ్టు రెపేరు కు డబ్బు అడిగితే, ‘నాకు లిఫ్టే వద్దు – నేను ఈయను’ అని మూడేళ్ళుగా డబ్బులూ ఈయడు, ఆ అంతస్థులో మిగిలిన వాళ్ళని ఈయనీయడు కూడానూ.

  ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, తాము మాత్రం కొంచం ఇబ్బంది ని కూడా సహించకపోవడం – కొందరి జాతి లక్షణం. అలానే, నవ్వుతూ నోహ్ చెప్పడం అందరికీ సాధ్యంకాదు. మనలాంటి వాళ్ళకి నోరు చేసుకుని యుద్ధానికి వెళ్ళడం అంటే ఏదో పరువు తక్కువ పని లాగా ఫీల్ అయిపోతాం. మీరన్నట్టు మొహమాటానికీ, చేతకాని తనానికీ (గొడవలు పెట్టుకోవడంలో) సంబంధం ఉంది.

  Like

 3. పదనిసలూ,

  మీరిచ్చిన సలహా ఇటుపైన ఉపయోగించి చూడాలి, ఏమైనా నా తలవ్రాత మారుతుందేమో !!

  Like

 4. సుజాతా,

  ఇంటి ఓనర్ విషయంలో మాత్రం, మా ఓనర్ గారు లక్షల్లో ఒక్కరు. మా ఫ్లాట్ క్రిందే ఉన్నారు కానీ, ఒక్కసారి కూడా ఆయన వల్ల అసౌకర్యం కలిగేది కాదు. పైగా అద్దె ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా ” ఇంకా ఏమైనా చేయించాలా ” అని అడిగేవారు. ఎందుకంటే , ఆ ఫ్లాట్ లో చేరిన తరువాత, మాకు కావలిసినవన్నీ చేయించారు.బహుశా మా ఇద్దరి, వేవ్లెంగ్తూ మాచ్ అయినట్లుగా ఉంది !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: