బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–ద్వారకా తిరుమల

IMG_0483IMG_0512IMG_0515

    మేము పూణే తిరిగి వెళ్ళేలోపల ద్వారకా తిరుమల వెళ్ళి స్వామివారి కల్యాణం చేసికుందామనుకున్నాము. నిన్న ప్రొద్దుటే 5.30 కి బయలుదేరి, కారులో అక్కడికి వెళ్ళాము. ప్రొద్దుటే 7.30 కి కౌంటర్ తెరిచారు. కల్యాణానికి టికెట్ట్ 1000/- రూపాయలు. 9.00 గంటలకి కల్యాణ మండపం తెరిచారు, ముందుగానే వెళ్ళడం వల్ల, మొదటి లైను లోనే కూర్చోడానికి స్థలం దొరికింది.

    ఇదివరకు 2004 లో నా షష్టిపూర్తి కి తిరుమల తిరుపతి దేవస్థానం లో కల్యాణం చేసికున్నాము. ఈ రెండు కల్యాణాలకీ చాలా తేడా కనిపించింది, అక్కడ అంతా వ్యాపార సరళిలో జరిగిందనిపించింది. బహుశా అక్కడ రద్దీ ఎక్కువ అవడం వలనేమో. ఇక్కడ మాత్రం చాలా సంతృప్తికరంగా ఉంది. చేయించే పురోహితులు కూడా, రెండు మూడు సార్లు మన పేరూ, గోత్రం చదువుతారు. దగ్గరకు వచ్చి అందరికీ అక్షింతలూ, పూలూ ఇవ్వడం,అక్షింతలు నీళ్ళతో వదిలేయమనడమూ, ఇవన్నీ కాకుండా ఏదో పెర్సనల్ అటెన్షన్ తో చేస్తూన్నట్లనిపించింది.

    అన్నింటిలోకీ అద్భుతమేమంటే ఆ ప్రధాన పురోహితుడు గారు మొదటి సారి పేరూ గోత్రం ఒక పుస్తకంలో వ్రాసినది చదివారు. ఆ తరువాత మంత్రపుష్పం చదివేటప్పుడు, అవన్నీ గుర్తు పెట్టుకొని వరుసగా ఏ తప్పూలేకుండా, చూడకుండా చెప్పడం. నిన్నటి రోజున మొత్తం 25 జంటలు కల్యాణం చేసికున్నారు. అందరి పేర్లూ చెప్పారు. ఈ విషయం ఎవరితోనో అంటే, ఆయనన్నారూ,” మీరు ఈ వేళ 25 జంటల విషయం లోనే ఇంత ఆశ్చర్య పోతున్నారూ, నేను ఒకసారి వెళ్ళినప్పుడు 150 మందివి, ఒకేసారి అడిగి, ఆ తరువాత గుర్తు పెట్టుకొని ప్రతీ వారి దగ్గరకూ వచ్చి, గోత్రనామాలు తప్పులేకుండా చెప్పడం నే

ను ప్రత్యక్షం గా చూశాను “. శతావధానం చేసేవారు కూడా ఇలాగే ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారని చదివాను కానీ, ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటి సారి.

    కల్యాణం పూర్తి అయిన తరువాత, ప్రతీ జంటకూ 5 లడ్డులూ, పులిహోరా, తీపి ప్రసాదం,ఒకచీరా జాకెట్టూ, మొగవారికి పట్టు శాలువా ఇచ్చారు. ఇవికాకుండా మనం అడిగినన్ని మీల్స్ కూపన్లూ ( ఆరుకి ఎక్కువ కాకుండా) ఇచ్చారు. నేను చెప్పేదేమిటంటే మనం పెట్టిన వెయ్యి రూపాయలలో సగ భాగం మనకి ఏదో రూపంలో తిరిగి ఇచ్చేస్తారు. అన్నింటిలోకీ ముఖ్యమైనదేమిటంటే ఎవరూ బక్షీస్ అడగక పోవడం. పెద్ద తిరుపతి, అన్నవరాలలో ప్రతి వాడూ (పురోహితులతో సహా) బహుమతి ఇవ్వమని మనని పీకేస్తారు. ఇక్కడ అలాటివేమీ చూడలేదు.

    ఆ తరువాత దేముడి దర్శనం చేసికుని, భోజన శాలలో భోజనం చేసేటప్పడికి 12.00 అయింది. ఆ తరువాత దగ్గరలో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారినీ,సంతానగోపాల స్వామినీ దర్శనం చేసికుని జంగారెడ్డిగూడేం దగ్గరలో ఉన్న ” మద్ది ఆంజనేయ స్వామి” ( రెండు, మూడు ఫొటోలు) దర్శనం చేసికుని రాజమండ్రీ సాయంత్రం అయిదింటికి తిరిగి వచ్చాము.

%d bloggers like this: