బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–రాజమండ్రి జ్ఞాపకాలు-2


    రాజమండ్రీ లో కొన్ని విషయాలు అంతబాగా మరచిపోలేము. మొదటిది రోడ్డుమీద ట్రాఫిక్, వామ్మోయ్ ఆ రోడ్లమీద నడిచి ఏమీ జరగకుండా ఇంటికి తిరిగి వచ్చేమంటే, అది మన చాకచక్యం కాదు, మన ఇంట్లో వారి మంగళసూత్ర గట్టితనం !!ప్రతీ నగరంలోనూ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది, కాదనను. అక్కడ కొంచెం డిసిప్లీన్ లాటిది చూడడానికి ఉంటుంది. ఇక్కడ వరసా వావీ ఏమీ లేవు.ప్రతీవాడూ అంటే గాడీలు నడిపేవాళ్ళూ, ఆటోలవాళ్ళూ, ఇవికాకుండా సామాన్లు తీసికెళ్ళే సైకిల్ రిక్షావాళ్ళూ, వాటిమీద పొడుగ్గా ఉంచిన ఊచలూ, స్టీల్ బార్లూ, ఒక్కటేమిటి అడక్కండి. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దూరిపోతారు. ఖర్మ కాలి మనం (నడిచి వెళ్ళే “పూర్ ఫెల్లోస్”) అక్కడ ఎక్కడో, మన దారిని మనం వెడుతున్నా సరే, మనని రాచుకుంటూ, అదృష్టం బాగోపోతే మీదనుంచైనా వెళ్తుంది. ఎవడో ఒకడు 108 కి ఫోన్ చేస్తే, ఏదో హాస్పిటల్లో పడేస్తారు !!

రోడ్డుకి అటూ ఇటూ లెక్కలెనన్ని టూ వీలర్సూ. దాన్ని నడిపేవాడు, పని అయిపోగానే, సీట్ మీద కూర్చొని, ఇంక వెనక్కాల ఏముందో చూసుకోకుండా ఝూం అని రోడ్డుమీదకు గాడీని లాగేస్తాడు.దాని ” పాత్” లో మనం ఉన్నామా అంతే సంగతులు !! కాలుకి కొట్టుకోవచ్చు, ఏదైనా అవొచ్చు.ఏమీ అనడానికి వీలులేదు. వీళ్ళు కాకుండా సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, అటూ ఇటూ దిక్కులు చూస్తూ నడిపే ప్రభుధ్ధులు కొంతమందుంటారు, వాళ్ళలోకంలో వాళ్ళుంటారు. రోడ్డుమీద నడిచేవాళ్ళు వాడి దయా ధర్మాలమీద బ్రతకాలి. ఇంకో రకం చూశాను, క్రికెట్లో మన వాళ్ళు చూడండి, రాత్రైనా, పగలైనా డార్క్ గ్లాసెస్ పెట్టుకుని ఆడడం, ఓ స్టైలు గా చేశారు. అలాగే రాజమండ్రీలో కొందరు రాత్రిళ్ళు కూడా డార్క్ గ్లాసెస్స్ పెట్టుకొని మరీ టూ వీలర్స్ డ్రైవ్ చేయడం. “ఏమిటో ఈ మాయా వెన్నెల రాజా ” అంటూ మిస్సమ్మలో పాట గుర్తొస్తుంది !! సిరబ్బ లెదుకానీ చీడ అబ్బిందిట. ఇంత గొడవ జరుగుతూన్నా ట్రాఫిక్ పోలీసు అనబడే ప్రాణి కూతవేటు దూరంలో ఎక్కడా కనిపించడు. కనిపిస్తే మళ్ళీఏం గొడవో అని !!

షేర్ ఆటో లో ఎంతగా పట్టిస్తే అంతమందిని కూరుతారు. ఏవడో ఒకడి కాలూ, మరోడి చెయ్యీ ఇలాటివి వేళ్ళాడుతూంటాయి. ఆ ఆటోవాళ్ళుకూడా బేరాలకోసం ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలిపేస్తూంటారు. దాని వెనక్కాల ఏ స్కూటరో, కారో వస్తూంటే ఇంక అడక్కండి. ఒక విషయం ఒప్పుకోవాలి– ఇక్కడ అందరూ ఇలాటి లైఫ్ కి అలవాటు పడిపోయారు. ఏదో మన లాటి బయటనుండి వచ్చిన వారికి చిత్రంగా కనిపిస్తుంది. <b. లైఫ్ గోస్ ఆన్…..

ఇంక పొలిటికల్ అవేర్ నెస్స్, అయ్య బాబోయ్ ఎవరిని చూసినా రాజకీయనాయకుడిలాగానే కనిపిస్తాడు. సిల్కు చొక్కా,తెల్లఫాంటూ, చేతినిండా ఉంగరాలూ, నోట్లో కిళ్ళీ, కళ్ళకి డార్క్ గ్లాసెస్సూ.</b. ఎవడిని చూసినా వాడికి ఎక్కడో అక్కడ ఇన్ఫ్లుఎన్స్ ఉండే ఉంటుంది. ఏం అడిగినా ఫర్వా లెదండీ, మీ పనైపోతుందీ అనేవాడే !! మనం ఏదో ఆటోలో వెళ్తున్నామనుకోండి, తెలివి తక్కువగా మనం ఏదో పార్టీ గురించి మాట్లాడేమా,ఖర్మ కాలి ఆ ఆటో వాడు ఇంకో పార్టీకి చెందినవాడయ్యాడా గోవిందా !! అందుకనే ఏదో కొంచెం లీడ్ ఇచ్చి వదిలేయాలి. వాడు చెప్పేదానికి మాటలో మాట కలిపేస్తే పుణ్యం, పురుషార్ధం !!

ఏడాది పొడుగునా ఏవేవో ” దీక్షలు ” జరుగుతూనే ఉంటాయి. ఒకసారి “భవాని”లు, ఇంకోసారి ” అయ్యప్ప”.ఎర్ర డ్రెస్స్ లోనూ, నల్లడ్రెస్స్ లోనూ కనిపిస్తారు. ఈ సంగతి తెలియక మా ఇంటావిడ వచ్చిన కొత్తలో తనకి ఇష్టం కదా అని ఎర్ర చీర కట్టుకొని బయటకు వస్తే ” భవానీ గారూ” అని పిలుపు వినిపించింది. తనని కాదేమో అనుకొని వెళ్ళిపోతూంటే, “పిలుస్తూంటే అలా వెళ్ళిపోతారేమిటీ” అని ఓసారి కసిరింది.అంతే, మళ్ళీ ఎర్ర రంగు చీర కట్టలేదు. నేనేదో ఈ ” దీక్ష” పడుతున్నవారిని అపహాస్యం చేస్తున్నాననుకోకండి, ఉన్న సంగతి వ్రాస్తున్నాను. ఇవే కాకుండా “పచ్చ ” చీర కడితే “తెలుగు దేశం” పార్టీ అనుకుంటారు, పింక్ కడితే ” టి.ఆర్.ఎస్ ” అనుకుంటారు. ఇవ్విధమ్ముగా మా ఇంటావిడ లిస్ట్ లోంచి నాలుగు రంగులు వెళ్ళిపోయాయి. గాడ్ బ్లెస్స్ హెర్ !!ఇంకో ఏడాది ఉండిఉంటే ఇంకెన్ని రంగులు మానేసేదో !! అంత అదృష్టం నాకివ్వలెదు భగవంతుడు .

ఇంక హొటళ్ళలో టిఫిన్ తినేసిన తరువాత ప్లేట్ లోనే చెయ్యి కడిగేసుకోవడం. అదో అద్భుత దృశ్యం !! వాష్ బేసిన్ దాకా వెళ్తే వీడి సొమ్మేంపోయిందో, అంత కక్కూర్తిగా ప్లేట్ లోనే కడుక్కోవడం ఎందుకూ? దీనికి సాయం, టేబిల్ క్లీన్ చేసేవాడు వచ్చి ప్లేట్లు తీస్తూంటే, ఆ ప్లేట్లో నీళ్ళన్నీ ప్రక్కన ఉన్నవాడిమీద పడడం, లేదా మనం తింటున్న ప్లేట్ లో పడడం.

అన్నీ చెప్పి రాజమండ్రీ సందులగురించి చెప్పకపోతే బాగుండదు. ఒక్కసారి చూస్తే గుర్తుంటాయనుకోవడం మనం ( స్పెషల్లీ కొత్తవారు) చేసే పొరపాటు. అంతా తెలిసున్నట్లుందే అని ఓ సందులోకి వెళ్ళామా, ఎవరింట్లోనో తేలుతాము. ఓ వెర్రినవ్వు నవ్వేసి, ఇక్కడ మాకు తెలిసినవారుండాలీ అంటూ ఓ దీర్ఘం తీయాలి !! పోనీ ఏదో ఓ కొండగుర్తు పెట్టుకుందామా అనుకుంటే అదీ కుదరదు. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో కూడా కనిపించవు. కొండ గుర్తంటే గుర్తుకొచ్చింది–గోదావరి గట్టు ఒకటే కొండగుర్తు, ఎలా వెళ్ళి ఎలా వచ్చినా గోదావరి గట్టుమీదకి వెళ్ళొచ్చు. దారి మర్చిపోతే గోదావరి గట్టుకి ఎలా వెళ్ళాలండీ అంటే ఎవడో ఒకడు దారి చెప్తాడు !! అందుకనే నాకు ఇక్కడ పోస్ట్ మాన్ అంటే చాలా గౌరవం. ఎండనకా, వాననకా, ఈ సందులన్నీ గుర్తుపెట్టుకొని, ఉత్తరాలు బట్వాడా చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్ !!

అన్నింటికీ మించినది ఇంటిపక్కనే ఉన్న డ్రైనేజి లలో తుక్కు పారేయడం. పక్కనే ఆర్.ఎం.సీ వాళ్ళు తుక్కు పారేయడానికి సదుపాయం కల్పించినా సరే, డ్రైన్ లోనే పారేయడం ఓ జన్మహక్కులా అనుకుంటారు. మళ్ళీ పేద్ద వర్షం వస్తే నీళ్ళన్నీ వెళ్ళడానికి దారేదీ ? రోడ్లన్నీ మోకాల్లోతు నిండిపోతాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదూ అంటూ ప్రతీ వాడూ ఓ స్టేట్మెంటిచ్చేయడమే.

ఇక్కడ ప్రకాష్ నగర్ లో ” ధర్మం చెర” అని ఓ పెన్షనర్స్ అసోసియేషన్ ఉంది. వారి జీవిత కాల సభ్యత్వం 250/- రూపాయలు. గరికపాటి వారి ప్రోగ్రాం చూడ్డనికి వెళ్ళినప్పుడు, డబ్బు కట్టాను. నా ఫోన్ నెంబరూ అదీ తీసికొని, ఎప్పుడైనా ప్రోగ్రాం లుంటే మీకు చెప్తామండీ అన్నారు. అలా అనడం వరకే పరిమితం. గడిచిన ఆరు నెలలోనూ వారిదగ్గరనుండి ఎటువంటి ఫోనూ రాలేదు. మరి ఏమీ నిర్వహించలేదా అంటే అదీ కాదు, డబ్బు తీసికోవడం వరకే వారి ఉత్సాహం. వీరికంటే ” హాసం” క్లబ్బు వారు చాలా బెటర్. దానిలో సభ్యత్వానికి ఏమీ తీసికోరు, అయినా వారివద్ద నెంబర్లు ఉన్న ప్రతీ వారికీ ప్రోగ్రాం ఏదైనా ఉంటే చెప్తారు.

అన్నీ నెగెటివ్ పాయింట్లే వ్రాశాడూ అనుకోకండి. ఇక్కడ నేను అనుభవించిన ఆనందం ఇంకో పోస్ట్ లో. ఇక్కడ నేను మిస్స్ అయే దృశ్యాలు అన్నీ ఒక పోస్ట్ లో పెడతాను .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: