బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు- తాతలూ, మనవలూ

    నా చిన్నప్పుడు అల్లరి చేసేవాడినేమో నాకు గుర్తు లేదు. అడగడానికి మా అమ్మగారు కానీ, నాన్నగారు కానీ ప్రస్తుతం లేరు. మా పిల్లల లో అమ్మాయి కొంచెం సౌమ్యం. అబ్బాయి పేచీ పెట్టేవాడు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నా చేతిలో దెబ్బలు కూడా తినేవాడు. మా ఇంటావిడ ఎప్పుడూ ” అస్సలు వీడు ఈయన చేతిలో బ్రతికి బట్ట కడతాడా” అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మాయి అల్లరి చెసేదేమో కానీ నా దృష్టిలో ఎప్పుడూ పడలేదు. అలాగే తనమీద ఎప్పుడూ చెయ్యి చేసికోలేదు. ఇప్పుడంటూంటాడు మా అబ్బాయి ” నా కంటే అక్కే ఎక్కువ అల్లరి చేసేదీ, కానీ ఎప్పుడూ నన్నే అనేవారూ “అని.

    ఎలాగైనా అమ్మాయిలు అల్లరి/పేచీ తక్కువగా చేస్తారు, బహుశా ఇప్పటి వారిని చూస్తే అది తప్పేమో !! ఈ తరం వాళ్ళు ఎంతైనా ” హైపర్ యాక్టివ్” అనుకుంటాను. నా చిన్నప్పుడు మా నాన్నగారిని చూస్తే ఎప్పుడూ భయ పడేవాడిని. ఎప్పుడూ దగ్గరకు తీసికొన్న జ్ఞాపకం లేదు. అలాగని చీదరించుకొనేవారని కాదు.అదేమిటో ఎప్పుడు చూసినా ” చదువు ఎలా ఉందనే” అడగడం. నాకు చిన్నప్పటినుండీ చదువు మీద అంత ఆసక్తి ఉండేది కాదు. బహుశా ఇదే కారణం అయుంటుంది, ఆయనకు దగ్గర కాకపోవడానికి, మా అన్నయ్యలతోనే ( అదీ పెద్దన్నయ్యగారితో) చనువుగా ఉండేవాడిని.

    అదేదో నాకు చిన్నతనంలో “దొరకని” స్నేహం మా పిల్లలకి ఇచ్చేయాలని, వాళ్ళతో చాలా స్నేహంగా ఉండేవాడిని. వాళ్ళు నాతో ఎప్పుడైనా ఆర్గ్యూ చేసినా,ఏమీ అనుకునేవాడిని కాదు. ఈ తండ్రుల ” ప్రవర్తన” నాకే కాదు, చాలా మంది తండ్రులకి ఉన్న పేద్ద జాడ్యం. మన అదృష్టం బాగా ఉంటే, అన్నీ బాగానే ఉంటాయి. వీటిలో కొన్నేమిటి, చాలా లోపాలున్నాయి– పిల్లలు చాలా సందర్భాల్లో మనని ” Take it for granted” గా చేసేస్తారు. ఏదైనా అవసరం వచ్చినా మనం వారికి ఏమీ చెప్పలేని పరిస్థితి వస్తుంది, మొహమ్మాటం అడ్డువస్తుంది. మన నాన్నే కదా ఫర్వాలెదూ ఒప్పుకుంటారూ,అనే ఓ భావం. అలాగని మనల్ని చిన్నబుచ్చుతారని కాదు.

    ఇంక ఇప్పటి వారైతే చెప్పఖ్ఖర్లేదు. పిల్లలమిద ఈగ వాలనీయరు. వాళ్ళు ఎలాటి అల్లరి చేసినా సరే అందరూ ” ఆహా ఓహో ” అనాలే తప్ప, వాళ్ళని ఏమీ అనకూడదు. అదీ మొగ పిల్లలైతే ఇంక అడగఖ్ఖర్లేదు. రెండు సంవత్సరాలనుండి, ఎనిమిదేళ్ళు, పదేళ్ళూ వచ్చేదాకా వీళ్ళు చేసే అల్లరికి కొంప కొల్లేరైపోతూంది. ఇంక అందులో కవలలైతే చెప్పాలా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వేళ మా కజిన్ ఇంటికి వెళ్ళాము. స్వతహాగా వాళ్ళ మనవళ్ళు చాలా యాక్టివ్ , వయస్సు నాలుగేళ్ళు, కాలూ, చేయీ ఊరుకోదు, పరుగులూ, ఉరకలూ. వాళ్ళ తాతయ్యా, అమ్మమ్మా ఏం చెప్పినా వినరు,వాళ్ళ రంధి వాళ్ళదే. వాళ్ళ అమ్మ మాట అప్పుడప్పుడు వింటూంటారు.

    ఈ విషయం మీద ఆ అమ్మాయి( మా కజిన్ కూతురు) తో చర్చ వచ్చింది. తనంటుందీ, “నేను ఒఖర్తీ ఉన్నప్పుడు మా పిల్లలు అస్సలు అల్లరే చేయరూ, అమ్మా నాన్నా వచ్చేటప్పడికి వాళ్ళ గారం తో వీళ్ళు అల్లరి చేసేస్తారూ” అని. దానికి నేనన్నానూ “ నువ్వు ఒఖర్తీ ఉన్నప్పుడు ఏమౌతోందో ఎవరికి తెలుసూ, వాళ్ళు అల్లరి చేసినా మాతో ఎందుకు చెప్తావూ ,నువ్వు పిల్లలతో ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తిసి చూపించూ , ఈ రోజుల్లో ,తమ పిల్లల్ని ఇంకోళ్ళు ( తన తల్లైనా, తండ్రైనా సరే) మందలిస్తే నచ్చదు. ఈ తాతయ్యా, అమ్మమ్మా/ నానమ్మా ఇవన్నీ చూస్తూ ఊరుకోవాలే తప్ప ఏమీ చేయలేరు.

    ఏమైనా అంటే “ మెల్లిగా చెప్తే వింటారూ, మీరు ఊరికే అరుస్తారూ,నా మాట వినడం లెదా, చెప్పే పధ్ధతిలో ఉందీ” అని వాళ్ళ తల్లితండ్రులకి నీతులు చెప్తారు. వీళ్ళకీ వయస్సు మీద పడింది, వయస్సులో ఉండే ఓర్పూ, సహనమూ ఇప్పుడు రమ్మంటే ఎక్కడ వస్తాయీ. ఇదో “అంతు లెని “కథ. ఇంకా ఏమైనా అన్నామో ” నాన్నా నీకు తెలియదు ఊరుకో” లోకి వెళ్ళిపోతుంది !! అలాగని ఈయన ఊరుకుంటాడా , అబ్బే వాళ్ళ అల్లరీ ఆగదు, కూతురు/కొడుకు ల చివాట్లూ తప్పవూ. అలాగని ఈ పెద్దవాళ్ళకి పిల్లల మీద ప్రేమ లేదంటారా, ” ముందొచ్చిన చెవులకంటే, వెనకొచ్చిన కొమ్ముల లాగ” పిల్లలమీద కంటే మనవలు/ మనవరాళ్ళ మీదే వాత్సల్యం ఎక్కువ.అది ఈ తరం పిల్లలు అర్ధం చేసికుంటే అందరికీ హాయి .

%d bloggers like this: