బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు- Freedom at Midnight.

    మా మనవరాలు నవ్య కి కొంచెం వంట్లో బాగుండ లేదని మా అబ్బాయి ఫోన్ చేశాడు. అందువలన మా ఇంటావిడ కొంచెం ముందుగానే పూణే వెళ్లింది. మా నవ్య తల్లి ప్రస్తుతం కులాసాగానే ఉంది. ఎలాగూ, ఈ నెలాఖరుకి మేము పూణే తిరిగి వెళ్ళిపోతున్నాము, సంగతేమంటే మా ఇంటావిడ నాకంటే ఓ మూడు వారాలు ముందుగా వెళ్ళింది. రెండు మూడు రోజులకి సరిపోయేలా తోటకూర పులుసూ, వంకాయ కూరా చేసేసి వెళ్ళింది. కొంచెం కొంచెం మైక్రోవేవ్ లో వేడి చేసికొని తినమంది.

ఈ రెండు రోజులూ కుక్కర్ లో అన్నం పడేసుకొని, ఆ కూరా,పులుసూ తో లాగించేశాను. ఇంక రేపటినుండి ప్రారంభం అవుతాయి నా పాట్లు !!

    ఫ్రిజ్ లో వారానికీ కావలిసిన కూరలన్నీ కొని పెట్టి ఉంచాను, ఆవిడ వెళ్ళే ముందర, అవన్నీ నేనేం చేసికోనూ అని, అవన్నీ మా కజిన్ వాళ్ళింటికి తీసికెళ్ళి వాళ్ళకి ఇచ్చేశాను, సాయంత్రం అక్కడే భోజనం చేసేసి వచ్చేశాను. మా మరదలు అందీ, ప్రతీ రోజూ వాళ్ళింటికే భోజనానికి వచ్చేయమని, సలహా బాగానే ఉంది కానీ, దూరం ఎక్కువ అందుకని అక్కడికి ప్రతీ రోజూ రావడానికి వీలు పడదని చెప్పాను.

    ప్రొద్దుటే మా అత్తగారు తణుకు నుండి ఫోన్ చేసి అక్కడికి వచ్చేయమన్నారు. నాకు కాలక్షేపం అవదూ రానని చెప్పేశాను. ఏదో ఇంటావిడ ఇక్కడ ఉన్నంత కాలమూ, హాయిగా నా దారిని నన్ను వదిలేయొచ్చు కదా అనుకునేవాడిని.ఇదిగో ఇలా అవసరం వచ్చి తను వెళ్ళేసరికి, నేను వీధిని పడిపోయాను !! ఎమ్తైనా భార్య భార్యే !! ఎలాగోలాగ భరిస్తుంది. అస్సలు భర్తా అంటే భరించేవాడంటారు. కానీ ఇప్పుడు అర్ధం అవుతోంది– నిజంగా భరించేది భార్యే అని . ఈ విషయం అర్ధం చేసికోవడానికి, అరవైయ్యేళ్ళు దాటింది ” బెటర్ లేట్ దాన్ నెవ్వర్”.

    హాయిగా చేస్తూంటే తిని తిరక్క, ప్రతీ దానిమీదా వంకలు పెడతాము. ఏదో అలసిపోయి ఏదైనా చిన్న పనిచేయమంటే ఏదో ఘనకార్యం చేసినట్లు పోజులు పెడతాము. అలా చేసిన పాపాలన్నీ ప్రోగై ఇదిగో ఇలా మనమీదకే త్రిప్పి కొడతాయి !! మా కజిన్ అంటాడూ, ఉన్న కొన్ని గిన్నెలూ నువ్వే తోమేయొచ్చూ, ఇల్లు తుడవడానికి మాత్రం ఓ పనిమనిషిని పెట్టుకో, ఈ మూడు వారాలూ అని. ఈ వేళ సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళ పని మనిషి వారంరోజులనుండి రావడం లేదుట. వాళ్ళింట్లో పని చేసుకోలేక నానా అవస్థా పడుతున్నారు. ముందుగా మీ ఇంట్లో పనిమనిషి సంగతి చూసుకో, నా గొడవేదో నేనే పడతానూ అన్నాను.

    పని మనిషంటే గుర్తొచ్చింది–మా ఫ్లాట్ పైన ఒకరుంటున్నారు. వాళ్ళింటికి ఓ పనిమనిషి వస్తుంది. అదేం ఖర్మమో తెలియదు, ప్రతీ రోజూ ఏదో ఒకటి రుబ్బురోలులో రుబ్బడమో, లేక దేంట్లోనో నూరడమో, లేకపోతే ఏదో ఒకటి పేద్దగా చప్పుడు చేసికుంటూ కొట్టడమో. ప్రతీ రోజూ మధ్యాహ్నం 1.00 నుండి, 2.00 వరకూ, మళ్ళీ రాత్రి 9.00 నుండి అరగంటా ఈ భాగోతం తప్పడం లేదు. మరి ఆ ఇంటావిడ మిక్సీలూ అవీ వాడరేమో !!ఇన్నాళ్ళూ, ఆ పనిమనిషి ఇంకో చోట ఎక్కడో ఉండేది. అందువలన ఆ చప్పుళ్ళ కార్యక్రమానికి నిర్ణీత సమయాలుండేవి. మా అదృష్టం బాగుండక, ఆ పనిమనిషి భర్త మా సొసైటీ లొకే వాచ్ మన్ గా వచ్చాడు. ఇంక మకాం ఈ బిల్డింగ్ లోనే కదా, ఈ చప్పుళ్ళ భాగోతానికి ఇంక ఓ టైమూ అవీ లేవు. ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఈ నూరడాలూ, రుబ్బడాలూ ప్రారంభం !! ఎప్పుడో తిక్కరేగిందంటే, టెర్రేస్ మీదకు వెళ్ళి నేనూ మొదలెట్టేస్తాను చప్పుళ్ళు చేయడం. ఈ హింస ఎలా ఉంటుందో వాళ్ళకీ తెలియాలిగా !!ఏదో అంటాం గానీ అలా చేయడానికి సంస్కారం అడ్డొస్తుందిగా !!

    ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు ఇల్లంతా తుడుచుకోవాలి. ఇదివరకు మా ఇంటావిడ ప్రొద్దుటా, సాయంత్రమూ ఇల్లంతా తుడిచి తడిగుడ్డ పెట్టి పోచా చేస్తూంటే, తిన్న తిండి అరక్క ఏవేవో వ్రాసేశాను నా బ్లాగ్గుల్లో. ఇప్పుడు తెలుస్తోంది, అలా చేయడం వల్ల ఉండే సుఖం ఏమిటో. ఇల్లంతా కడిగిన ముత్యం లా ఉండేది. మా ఇంటికి ఎవరొచ్చినా ” అబ్బ లక్ష్మిగారు ఎంత నీట్ గా ఉంచుతారో “ అనే వారు. అదంతా ఆవిడ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అనేవాడిని. చెప్పుకుంటే చేసిన పాపం పోతుందిట !!

అందుకనే ఈ బ్లాగ్గు.

    అందుకనే తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కలిసే ఉండాలి కానీ లెకపోతే ఇలా ఎక్పోజ్ అయిపోతాము.అయినా ఇదంతా పురిటి వైరాగ్యం లాటిది. మళ్ళీ పూణే వెళ్ళిన తరువాత, ఎక్కడున్నావే గొంగళీ అంటే అక్కడే. ఆవిడ తాపత్రయాలూ ప్రారంభం, నా గోలా ప్రారంభం. ఫ్రీడం ఎట్ మిడ్నైట్ వినడానికీ, చదవడానికీ మాత్రమే బాగుంటుంది. కావాలని ఎప్పుడూ కోరుకోకండీ !! సర్వే జనా సుఖినోభవంతూ.

%d bloggers like this: