బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–లేకి తనం

    మాములుగా ఎవరైనా ఏ ఫంక్షన్ కో, రిసెప్షన్ కో వెళ్తే, అక్కడ ఏదో ఒకటి ఇవ్వడమో ఏదో చేస్తారు. మేము 1983 లో వరంగాం ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినప్పుడు, అక్కడ అంతా తమాషాగా ఉండేది. అప్పటి దాకా పూణే లో ఉండేవాళ్ళం. మేము వెళ్ళినది పక్కా పల్లెటూరు, అక్కడ మా ఫాక్టరీ, కాలనీ తప్ప ఇంకేమీ ఉండేదికాదు. అక్కడ కొన్ని రిసెప్షన్స్ కీ, క్లబ్ లో పార్టీ లకీ వెళ్ళవలసి వచ్చేది. ఎవరిదైనా ఫేర్వెల్ పార్టీ అదీ అయితే, ఎవరో ఒకరి క్వార్టర్ టెర్రేస్ మీద పార్టీయో, లేకపోతే భోజనాలో అరేంజ్ చేసేవారు.మొదట్లో నేను మామూలుగా చేతులు ఊపుకుంటూ, వెళ్ళాను. తమాషా ఏమిటంటే, మిగిలిన వాళ్ళందరూ చేతుల్లో ఓ పళ్ళెమూ, గ్లాసూ తెచ్చుకొన్నారు.

మా చిన్నప్పుడు అమలాపురం లో ఎప్పుడైనా సంతర్పణకి వెళ్ళవలసి వచ్చినా, ఓ ఇత్తడి గ్లాసు మాత్రమే తీసికెళ్ళేవారం. అంతవరకూ బాగానే ఉంది. ఇక్కడ పళ్ళెం కూడా తీసికెళ్ళాలిట. వామ్మో అనుకొని, ఇలాటి అలవాటు ఎప్పుడూ లేక, మళ్ళీ ఏ భోజనాల పార్టీ కీ వెళ్ళలేదు. అదేమిటో మరీ ఎంబరాసింగ్ గా ఉండేది.

    అక్కడ ఇంకో విచిత్రమైన సంగతేమంటే, ఏ కారణం చేతైనా, ఒక్కడే వెళ్ళవలసి వస్తే, కుటుంబం లోని మిగతా వారికి డబ్బా( కారీయర్) లో సద్ది తీసికెళ్ళేవారు. మరి ఆ పార్టీకి మొత్తం కుటుంబం అంతా కలిపి చందా ఇచ్చాడు కదా !!ఇది మరీ అసహ్యంగా ఉండేది. మనకి ఎందుకొచ్చిన గొడవా అని ఏ పార్టీకీ వెళ్ళేవాళ్లం కాదు. అయినా ఒక్కోసారి, క్లబ్ లో పార్టీలకి వెళ్ళవలసి వచ్చేది. ఇంక అక్కడ చూద్దామంటే, మా క్లబ్ సెక్రెటరీ గారు, పార్టీలో సర్వ్ చేయడానికి, బర్ఫీలూ, కేక్కులూ తెచ్చి, వాటిని సగానికి కట్ చేసేవాడు!! మిగిలిపోయినవన్నీ ఇంటికి తీసికెళ్ళొచ్చుకదా అని. అప్పుడు ఛూశాము, ఒక్కోచోట ఆర్గనైజర్స్ ఎంత నీచానికి దిగిపోతారో అన్నది !!

దేముడి గుళ్ళో ప్రసాదాలు ఇచ్చే చోట కూడా ఇలాటివే చూస్తాము. ఇంకొంచెం ఇవ్వండీ, మాఇంట్లో వాళ్ళ కోసమూ అని అడిగేవారిని. వీళ్ళు అవతలివాళ్ళేమనుకుంటారో అని ఆలోచించరు, తమ పబ్బం గడుపుకోవడమే వాళ్ళ ధ్యేయం !!

    ఇవన్నీ ఒక ఎత్తూ, ఈ మధ్యన రాజమండ్రీ లో మొన్న హాసం క్లబ్ మీటింగ్ కి వెళ్ళాను. గత 5 సంవత్సరాలుగా ప్రతీ నెలా మూడో ఆదివారం నాడు, ఓ మీటింగ్ పెడతారు. దానికి చందా ఏమీ లేదు. హాస్య ప్రియులందరినీ ఒకచోట సమావేస పరచి, అందరూ ఏవో జోక్కులూ, పాటలూ పాడడం– ఓ రెండు గంటల పాటు హాయిగా గడపడం. ఆ మీటింగ్ కయ్యే ఖర్చు ఓ ఇద్దరు ముగ్గురే భరిస్తారు. అందులో శ్రీ అప్పారావు గారూ, శ్రీ హనుమంతరావు గారూ ముఖ్యులు. వారు మొదటిసారి గా క్రిందటి రెండు నెలలోనే ” నెల తప్పారుట”. అంటే ఏవో కారణాల వలన క్రిందటి రెండు నెలలోనూ మీటింగ్ చేయలేకపోయారుట !! “నెల తప్పాము” అని అదికూడా ఓ జోక్ లాగ చెప్పారు !! ఆ రెండు గంటలలోనూ ఎవరైనా సరే ఓ జోక్ చెప్పొచ్చూ, పాట పాడొచ్చూ, ఎలాగోలాగ నవ్వించొచ్చు !!మన ఇష్టం . అంతా ఉచితం !!

    ఈ సారి మీటింగు లో శ్రీ అప్పారావు గారు– ఆయన గురించి నా బ్లాగ్గులో ప్రస్తావించాను ఈ మధ్యన ( విశ్వక్సేన దర్శనం), శ్రీ బాపూ, శ్రీ ముళ్ళపూడి వారి ఏకలవ్య శిష్యుడు. ఆయన కార్టూన్లు చాలా బాగా వేస్తారు, చాలా పత్రికల్లో వచ్చాయి. తెలుగు వికీపీడియా లో కూడా వారి గురించి వ్రాశారు–. ఆయన వేసిన కార్టూన్లు ఓ పుస్తక రూపంలో ప్రచురించారు. మూల్యం- 30 రూపాయలు. ఈ సారి ” హాసం ” సమావేశంలో పాల్గొన్న వారికి ( అంటే వేదిక మీదకు వెళ్ళి,ఓ జోక్క్ వేసినవారికి, ఓ పాట పాడిన వారికీ) ప్రోత్సాహ సూచికగా ఆ కార్టూన్ల పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

    ఆ పుస్తకాలు ఆయనకి ఏదో అమ్ముడుపోక కాదు, ఏదో తన ఆనందాన్ని ప్రకటించడం కోసం మాత్రమే. అలాగని అక్కడకు వచ్చిన వారందరినీ కొనమనడం లేదు ఆయన. మేము శ్రీ రమణ గారిని కలుసుకొన్నప్పుడు ఆయన సంతకం చేసి ఆయన రచించిన ” శ్రీ రామాయణం” ( మూల్యం 116 రూపాయలు) మాకు జ్ఞాపిక గా ఇచ్చారు. అలాగే శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు ఆవిడ వ్రాసిన ” ఆలింగనం” పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ఆ పుస్తకాలు, మేము వారితో గడిపిన మధుర క్షణాలకి తీపి గుర్తుగా ఉంటాయి.

    అలాగే అప్పారావు గారు శ్రీ బాపూగారినీ, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారినీ కలిసిన ప్రతీ సారీ వారు ఏదో ఒక పుస్తకాన్ని ఈయనకి ఇస్తారూ, వాటిని ఎంతో ప్రియంగా ఈయన వాటిని దాచుకుంటారు. ఊరికే ఇస్తున్నారు కదా అని శ్రీ అప్పారావు గారు తమ పరిచయాన్ని దుర్వినియోగ పరచుకోవడం లేదు కదా, ఇంకొన్ని పుస్తకాలు ఇవ్వండీ అని !! అది జన్మతహా వచ్చే సంస్కారం !!

    ఇప్పుడు అసలు సంగతికి వస్తే, ఓ జంట లో భార్య గారు ఓ పాట పాడారు, భార్య గారు ఓ జోక్ చెప్పారు. శ్రీ అప్పారావుగారు ఓ పుస్తకాన్ని వీరిరువురికీ కలిపి ఇచ్చారు. ఆ భర్తగారు ఊరుకోవచ్చా, నాకూ ఒకటివ్వండీ, నేనుకూడా ఓ జోక్ చెప్పానుగా అన్నారు. పక్కనే ఉన్న నేనన్నానూ, “ మాస్టారూ భార్యాభర్తలిద్దరూ కలిసి చదివితేనే జోక్ బాగా ఎంజాయ్ చేస్తారూ, ఒక పుస్తకం చాల్లెండీ ” అన్నాను. నేను వెళ్లిపోయిన తరువాత ఆ సదరు భర్త గారు శ్రీ అప్పారావుగారిని ” నాకు ఓ మూడు పుస్తకాలివ్వండీ” అన్నారుట. ఈయనకి చాలా బాధ వేసి ” నేను ఇవన్నీ ఏదో పంచిపెట్టడానికి తీసుకు రాలెదూ, మీకు కావలిసిస్తే దుకాణానికి వెళ్ళి కొనుక్కోండీ ” అని మొహమ్మాట పడకుండా చెప్పేశారుట.

నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఉచితంగా వస్తూంటే ఎంత దొరికితే అంత “గుంజుకుందామని చూసే వారిని” చూస్తూంటే. వీళ్ళ లేకితనానికి అంతే లేదా ?

%d bloggers like this: