బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Compromiజులు….1

    ఏదో ఎవరి పేరో “సోమయా జులు” లాగ ఈ “Compromi జులు” ఏమిటీ అనుకుంటున్నారా? ప్రపంచం లో అందరి సంగతీ ఎందుకు లెండి, రమారమి సామాన్య మానవుడు ( స్త్రీ పురుష బేధం లేకుండగా) ,ఒక్కోప్పుడు ఎక్కువగా స్త్రీలే, జీవితాంతం బ్రతికేది ఈ “Compromi జుల” తోనే !! ప్రతీ విషయం లోనూ Compromi జులే! ఏదో కొద్దిగా తెలివి మీరి, వాటిల్లోంచి బయట పడదామనుకునే సరికి పుణ్య కాలం కాస్తా అయ్యేపోతుంది. అదృష్టం బాగుంటే, వచ్చే జన్మలోనైనా, మొహమ్మాటం లేకుండా ఉంటే బాగుండునూ అని అనుకోవడం తప్ప చేసేదేమీ లేదు!

మామూలుగా, ఇంట్లో పెద్ద కొడుగ్గానో, పెద్ద కూతురుగానో పుట్టిన ప్రతీవారికీ, ఈ Compromi జులు ఓ in built quality! పాపం పుట్టినప్పటినుంచీ, తల్లితండ్రుల్ని చూసి చూసి,పోన్లెద్దూ, అమ్మా నాన్నా నాకోసం ఇంత కష్ట పడుతున్నారూ, ఏదో సద్దుకుపోతే పోలేదూ, అనే భావం వచ్చేస్తుంది. అది పెరిగి పెరిగి పెద్దయేసరికి, దాంట్లోంచి, అసలు బయట పడలేనంతగా, మహా వృక్షమైపోతుంది. ఇంక ఆ మిగిలిన వాళ్ళు ( తరువాత పుట్టిన జనాభా!) ఉన్నారే వాళ్ళు మాత్రం డాం భిస్ గాళ్ళు!వాళ్లకి to hell with Compromi జులు! వాళ్ళకి కావలిసినవేవో చేయించుకుంటారు!

ఓ పెళ్ళనండి, చదవ్వలసిన చదువులనండి, అన్నీ కావలిసినట్టుగానే. పాపం పెద్ద పిల్ల, అమ్మా నాన్నా తెచ్చిన సంబంధం, చేసికుంటుంది. నాన్న చెప్పిందే వేదం అనుకుంటుంది పూర్ ఫెలో ! చిన్నప్పుడు ఇంట్లో చెల్లెలో, తమ్ముడో పుట్టినప్పుడు ప్రారంభం అయిన ఈ Compromi జులు, ఈ పెళ్ళితో ఓ మలుపు తిరిగి, మళ్ళీ ఇంకో ప్రస్థానం మొదలెడతాయి!
అక్కడ కూడా పెద్దకోడలే అయిందా, గోవిందో గోవింద… ఆ భార్యా భర్తలిద్దరి నోముఫలమూ ఇంకో Compromi జు… కుర్ కురే వాళ్ళ యాడ్ లో లాగ
क्या फामिली है
…. అనుకోవడమే ! ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళతో ఫుట్ బాలాడేసికుంటారు.

రెండో పిల్ల కో, పిల్లాడికో పెళ్ళవుతుంది. ఇవ్వవలసిన లాంఛనాలూ ఇస్తారు, పుచ్చుకుంటారు కూడానూ. అంతా మహరాజభోగమే! ఎక్కడిదాకా వెళ్తుందంటే, పెళ్ళై ఓ పిల్లో పిల్లాడో పుట్టిన తరువాత కూడా, పుట్టింటికి వచ్చినప్పుడు, ముక్కు పిండి వసూలు చేసికుంటుంది! మా చుట్టాలలో ఒకళ్ళ గురించి చెప్పుకునేవారు- పెళ్ళై పదేళ్ళు గడిచినా, పుట్టింటికి వచ్చినప్పుడు, ” మావారికి ఒక్కరూ పడుక్కోవడం ఇష్టం ఉండదూ, విడిగా ఓ రూమ్మియండమ్మా…’అని అడిగేంతవరకూ! వెధవ్వేషాలు కాపోతే ఏమిటీ? జరుగుబాటు!
ఇక్కడ ఇంట్లో పెద్దక్క ఉందిగా, Compromi జిణి.. “పొన్లే అమ్మా చెల్లికీ, మరిది గారికీ మా గదిచ్చేయండి, మేము వంటింట్లో సద్దుకుంటామూ అంటుంది! పాపం ఆ బడుగు జీవి

తనకి ఉన్న కొన్నైనా ” ప్రాధమిక హక్కులు” ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా ఉండదు! అలాగని, National Human Rights Commission కి వెళ్ళి, బాలకృష్ణన్ గారికి Su moto కంప్లైంటు ఇవ్వమని కాదూ. అప్పుడప్పుడైనా తనకి పుట్టింట్లో ఉండే, ఇలాటివి ఉపయోగించుకోలేదే అని బాధ! అదృష్టం కొద్దీ, ఈ రెండో పిల్ల భర్త, వాళ్ళింట్లో పెద్దాడైతే, కొద్దిగా పరిస్థితి పరవా లేదు. ” బుధ్ధుందా లేదా, నాకు విడిగా రూమ్ము కావాలని నేనెప్పుడు చెప్పానూ అసలు నీతోటీ..” అని కొద్దిగా నసుగుతాడు. అయినా సరే, ఆ భార్య( ఇంటికి రెండో పిల్ల!) ” అబ్బ మీరూరుకోండి, మీకేం తెలియదు, మనకి కావలిసినట్టుగా చేయించుకోవాలి. అడక్కపోతే అమ్మైనా పెట్టదు..” అని ఓ జ్ఞానబోధ చేస్తుంది.మళ్ళీ, అక్కడ కూడా ఆ పూర్ భర్త Compromi జు mode లోకి వెళ్ళిపోతాడు,( ఎంతైనా వాళ్ళింట్లో అలవాటు పడ్డవాడు!)ఎందుకొచ్చిన గొడవా దీనితోటి, తిరిగి వెళ్ళిన తరువాత రోజూ సతాయిస్తుంది” అనుకుని!

ప్రతీ ఇంట్లో ఉండే ప్రతీ రెండో పిల్లలందరూ ఇలాగే ఉంటారని కాదు నా ఉద్దేశ్యం. కోప్పడకండి… అక్కడక్కడ….
ఇంకా చాలా ఉన్నాయి… ఇంకో టపాలో… బై దవే మా ఇంట్లో నేను మూడో వాణ్ణి, మా ఇంటావిడ మాత్రం ఇంటికి పెద్దపిల్లే ! ఆవిడ Compromi జు లు చూసి చూసే ఈ టపా!

నేను చదివిన ఓ జోక్కు…

There is only one perfect wife in the world and every neighbor has it!

%d bloggers like this: