బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇలాటివి అప్పుడప్పుడు జరిగితేనే….

   నిన్న నాకు ఓ పెద్దమనిషి తో పరిచయం అయింది. మాతో పనిచేసిన ఒకతను, రిటైరయ్యి, ట్రిచీ లో సెటిల్ అయ్యాడు. వాళ్ళకి ఒక్కడే కొడుకు.క్రిందటేడాది,ఆగస్టులో అతని వివాహానికే, భాగ్యనగరం వచ్చాను. మా ఫ్రెండు కి ఓ “హాబీ” ఉంది. పెళ్ళిసంబంధాలు చూడ్డం! ఊళ్ళో ఉన్నవాళ్ళందరికీ సహాయం చేస్తూంటాడు. జాతకాల్లోనూ కొద్దిగా ప్రవేశం ఉందిలెండి. అవేవో ఉన్నాయిటగా, భారత్ మాట్రిమనీ, తెలుగూ మాట్రిమనీ,ఇంకా ఏవేవో సైట్లున్నాయిట.ప్రతీ రోజూ వాటిని చూడ్డం, అందులో రిజిస్టర్ చేసికున్నవారి వివరాలు చూడ్డం.ఇవే కాకుండా, తన స్నేహితులు ఎవరైనా ఫోన్లు చేసి, మా పిల్ల/పిల్లాడికి ఏదైనా సంబంధం ఉంటే చెప్పమనగానే, ఇతనికి ఏనుగెక్కినంత సంబరం! తను బ్రౌజ్ చేసిన వాటిలో, ఆ ఫోను చేసినవాళ్ళకి దగ్గరగా ఉండే సంబంధం ఏదైనా ఉంటే, దానిగురించి చెప్పడం. కాలక్షేపం బాగానే ఉంది.

   పూణె లో ఉండే పిల్లో పిల్లాడో అయితే, నాకు ఫోను చేస్తూంటాడు, వీలైతే వివరాలు తెలిసికోమని. నాకున్న పరిచయాలతో, ఎవరో ఒకరికి ఫొను చేసి,వీలున్నంతవరకూ సమాచారం ఇస్తూంటాను.అక్కడివరకే నాడ్యూటీ! ఈ సందర్భం లోనే, ఈమధ్యన మా ఫ్రెండు, ఓ సంబంధం చూస్తున్నాడు. ఆ అబ్బాయి పూణె లో పనిచేస్తున్నాడుట. పైగా, ఆ అబ్బాయి తండ్రి కూడా, మా జాతి పక్షే ( ఆర్డ్నెన్స్ ఫాక్టరీలు) ! దానికి సాయం, మా ఫ్రెండు ఫోను చేసినప్పుడు, నేను తెలుసునూ అని కూడా చెప్పారుట.సరే ఇదీ మన మంచికే అనుకుని, నిన్న ప్రొద్దుట నాకు ఫోను చేశాడు. ఆయన పేరు చెప్పగానే, నాకు ఏదీ గుర్తుకు రాలేదు, ఎప్పుడు కలిశానో,ఎవరో ఏమిటో అన్నమాట. అయినా, ఫ్రెండడిగాడూ, పోనీ వివరాలు తెలిసికోడానికి ప్రయత్నిద్దామూ అనుకుని, నాతో పరిచయం ఉందీ అన్న పెద్దమనిషి ఫోను నెంబర్లడిగాను. వెంటనే వివరాలు ఎస్.ఎం.స్ చేశాడు.

   సరే అని వాళ్ళ లాండ్ లైన్ కి ఫోను చేస్తే, ఎవరో స్త్రీ ఎత్తినట్లున్నారు, నేను పూణె నుంచి మాట్లాడుతున్నానూ, ఫలానా వారున్నారా అని అడిగాను. మీరెవరూ, పేరేమిటీ, పనేమిటీ వగైరా అడగడం మొదలెట్టారు.ముందుగా కొద్దిగా disappoint అయ్యాను ఆవిడ టోన్ విని. ఇక్కడనుంచి అడుగుతున్నాను కదా, ఫలానా వారు కావాలీ, నేను పూణె నుండి మాట్లాడుతున్నానూ అని, ఆ వివరాలేవో ఆయనకే చెప్తానుగా,మళ్ళీ ఈవిడకెందుకూ అని నా ఉద్దేశ్యం! ఆయనుంటే ఫోను ఆయనకివ్వండీ, ఆయనతోనే మాట్లాడుతానూ అన్నాను. ఏమనుకున్నారో, ఫోను ఆయనకి ఇచ్చేశారు. ఫలానా ఫణిబాబు ని, పూణె నుండి మాట్లాడుతున్నానూ, మీ నెంబరు ఫలానా అతనిచ్చాడూ, వగైరా వగైరా చెప్పాను. మీ అబ్బాయి ఇక్కడ పనిచేస్తున్నాడని విన్నానూ, అతని కాంటాక్టు వివరాలు ఇవ్వగలరా అన్నాను. పనేమిటీ మీకు వాడితో అన్నారు. మరీ మీ అబ్బాయి గురించి వివరాలు, తెలిసికోవాలీ అని చెప్పలేనుగా, అందువలన, ఏం లేదండీ, మేము ఒక ఆన్లైన్ గ్రంధాలయం నడుపుతున్నామూ, ఆ విషయంలో ఏమైనా ఆసక్తి ఉందేమో, తెలిసికోవాలనీ అనగానే, ” మావాడికి అలాటి ఇంటరెస్టులు లేవూ, వాడి ఫోన్ నెంబరివ్వడం ఇష్టం లేదూ” అనేశారు. నాకైతే మొదట చాలా కష్టం తోచింది. ఇప్పటివరకూ, నాకిలాటి అనుభవం లేదు.అయినా కొద్దిగా సంయమనం పాటించి, అసలు మీకు నాతో పరిచయం ఎప్పుడూ, నాకైతే గుర్తులేదూ అన్నాను.ఎప్పుడో ఆరేడేళ్ళక్రితం, మా కామన్ ఫ్రెండు ఇంట్లో గృహప్రవేశం లో కలిశారుట. అదీ పరిచయం.ఇంకా ఎవరెవరో, అప్పటి మా స్నేహితుల పేర్లు చెప్పారు.అంతా మాట్లాడి, మీ ఫోన్ నెంబరెంతా అన్నారు! మీకెందుకూ నా ఫోన్ నెంబరూ అని అనబోయి, నా నెంబరివ్వడానికి ఏమీ అభ్యంతరం లేదు లెండీ అని నా నెంబరిచ్చాను. ఈసారి పూణె లో వాళ్ళ అబ్బాయిని చూడ్డానికి వచ్చినప్పుడు కలుస్తారట!

   ఇప్పుడు, నాకు అర్ధం కాని కొన్ని విషయాలు చెప్తాను- వాళ్ళ అబ్బాయి డిటైల్స్, ఓ పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు, వీళ్ళ సంబంధం గురించీ, వీళ్ళ అబ్బాయి వివరాలు తెలిసికోడానికి, ఎవరైనా నెంబరడగొచ్చుగా, అలాటప్పుడు నెంబరివ్వడానికి, అభ్యంతరం ఏమిటీ? నేను ఆ విషయం లో, మీవాడి నెంబరడుగుతున్నానూ అని అనిఉంటే, ఆయన నెంబరిచ్చేవారేమో, అని మీరనవచ్చు. నేను తనకి తెలుసునూ అన్న పెద్దమనిషి, పోన్లే పిల్లాడిని కలుస్తారూ అనుకోవచ్చుగా. ఏమో నాకు మాత్రం ఈ అనుభవం చాలా bad taste మిగిల్చింది. ఆయన ఇక్కడకి వచ్చినప్పుడు కలిసినా, కలవకపోయినా, నాకొచ్చిన నష్టం లేదు.

   మా ఇంటావిడతో ఈ సంగతులు చెప్తే, తనందీ, ” వదిలిందా రోగం! ప్రతీవారినీ కావాలి కావాలి అని పూసుకు తిరుగుతారూ, అందరూ మీలాగ ఉండరూ…” అని. ఏమో నేనైతే ప్రతీవారిలోనూ, పాజిటివ్ యాటిట్యూడ్డే చూస్తాను. నా పధ్ధతి మార్చుకోవాలిసిన అవసరం ఏమీ కనబడ్డం లేదు.

   మా ఫ్రెండ్ ఈవేళ ఫోను చేసి, వివరాలు తెలిసికున్నావా అని అడగ్గానే, చెప్పాను నా అనుభవం. పాపం అతనూ బాధ పడి, అయ్యో నీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను, నావల్ల అలాటి అనుభవం అయినందుకు సారీ అన్నాడు. అర్రే బాస్, ప్రపంచంలో ఇలాటి అనుభవాలు కూడా జరిగితేనే కదా, మనకీ మంచీ, చెడూ తెలిసేదీ అన్నాను. మీరేమంటారు ?

%d bloggers like this: