బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్

   ప్రొద్దుటినుండీ ఇంట్లోనే ఉండిపోయాము.టి.వీ. చూద్దామా అంటే ఒకటే విషయంగా, దానిమీద అంత పెద్ద ఆసక్తేమీ లేదు. పోనీ సరదాగా క్రికెట్ టెస్ట్ చూద్దామా అంటే, దాంట్లోనూ మనవాళ్ళేమీ పొడిచేయలేదు. మొత్తానికి 300 దాకా చేరారు. ఎక్కడక్కడే సంతోష పడాలి లెండి.

    ఇంకేం చేద్దామా అనుకున్నంతలో, మా ఇంటావిడ, రిమోట్ తో అన్ని చానెళ్ళూ వెదుకుతూ నన్నూ పిలిచింది. కారణం మరేమీ లేదు- భేజా ఫ్రై లో నటించిన వినయ్ పాథక్ నటించిన సినిమా ఒకటొస్తోంది. సినిమా పేరు–CHALO DILLI— అందులో నటించినవారు, లారాదత్తా, వినయ్ పాఠక్ . చాలామంది భేజాఫ్రై చూసేఉంటారు, అందులో వినయ్ పాథక్ నటన చూసి, ఆనందించనివారు బహుశా బహు తక్కువమంది అని నా అభిప్రాయం. నిజంగా మన బుర్ర తినేస్తాడు!

   ఈ సినిమాలోనూ అదే రంధి. కథాక్రమం ఏమిటయ్యా అంటే, లారా దత్తా ముంబైలో ఓ పేద్ద బ్యాంకు పెద్ద పొజిషన్ లో పనిచేస్తూంటుంది. వినయ్ ఢిల్లీ లో ఓ వస్త్రవ్యాపారి.లారా తన భర్తని కలుసుకోడానికి ఢిల్లీ బయలుదేరి, ప్లేన్ తప్పిపోవడంతో, విధివశాత్తూ వినయ్ పాఠక్ పాలిట పడుతుంది. ఇంక చూసుకోండి, రెండు గంటల్లో ముంబైనుంచి ఢిల్లీ వెళ్ళగలననుకున్న లారా, వినయ్ తో పడే పాట్లు! ముంబైనుండి, జయపూర్ అక్కడినుంచి ఏమైతేనేం ఢిల్లీ ! లారా ఏమో మితభాషీ, వినయ్ ఏమో ఎప్పుడూ ఏదొ ఒకటి మాట్లాడుతూనేఉంటాడు. పైగా తనుచెప్పేది ప్రతీదీ సరిగ్గానే మాట్లాడుతాడు.

   దారిపొడుగునా వీళ్ళిద్దరికీ ఎదురయ్యే అనుభవాలే ఈ కథ. క్లైమాక్స్ మాత్రం వదలొద్దు. ఇంక నటనా కౌసల్యానికొస్తే, వినయ్ పాథక్ సూపర్ ! ఢిల్లీవాలాల హావభావాలూ, మాటతీరూ అతనిలా ఇంకెవరూ చేయలేరేమో? ఈ సినిమా చూసిన తరువాత Bheja Fry నథింగనిపించింది. ఒక్కసారి తప్పకుండా చూడవలసిన సినిమా .లారాదత్తా నటన కూడా బావుంది.అవడం ఢిల్లీ లాటి మహానగర వాసులైనా, వారి ప్రవర్తనలో అదో టిపికల్ కల్చర్ ఉంటుంది. అలాగే ముంబైవాసులు చాలా సాఫిస్టికేటెడ్ అనుకుంటారు. సినిమా అంతా ఈ రెండుమహానగరాల కల్చర్ గురించే !

   మధ్యమద్యలో మనవాళ్ళు ఓవల్ లో ఏం వెలగబెట్టేస్తున్నారో అని చూస్తూ, హిందీ సినిమా పూర్తయిన తరువాత మరాఠీ చానెళ్ళలోకి వెళ్తే అక్కడ ఈ టీవీ మరాఠీలో ఓ సినిమా వస్తోంది — KAS–అని.ఇదికూడా చాలా బావుంది. ఓ బ్యాంకులో పనిచేసే ఆవిడమీద డబ్బు గోల్ మాల్ చేసిందని ఓ అభియోగం వస్తుంది. బ్యాంకు మేనేజరంటాడూ, నేరం ఒప్పేసికుంటూ ఓ కాగితం వ్రాసిచ్చేస్తే, కేసుండదూ అని. ఆమె భర్త కూడా అలాగే చెప్తాడు. కానీ తను నిర్దోషిననీ, ఆత్మగౌరవం కాపాడుకునేందుకు జైలుకి కూడా వెళ్తుంది. ఆవిడకి బెయిల్ ఇవ్వడానికి కూడా భర్త రాకపోతే, తనని ఇదివరకు ప్రేమించిన ఒకతను ఈమె రెస్క్యూకి వచ్చి బెయిలిప్పిస్తాడు. ఆ విషయం భర్తకి నచ్చదు. బెయిలిప్పించిన తరువాతకూడా, కేసు మాఫీ చేయడానికి ఓ డాక్యుమెంటుమీద సంతకం పెడితే చాలంటాడు భర్త. కానీ ఆమె దానికి ఒప్పుకోక, తన తండ్రి ( రిటైర్డ్ జడ్జ్) వ్రాసిన ఓ డైరీ కారణంగా, తన నిర్దోషిత్వం నిరూపించుకుంటుంది. ఆ భర్త , తనన్న మాటలు మర్చిపోమనీ, తనతో సంసారం చేయమనీ అడుగుతాడు ,కానీ ఆమె ఇతని ప్రవర్తనతో విసిగిపోయి, అతన్ని వదిలి వెళ్ళిపోతుంది.
సినిమా లో నాయిక నటన చాలా బావుంది.

    హాయిగా రెండు మంచి సినిమాలు చూడకలిగాము. విడిగా ఉండడం వలన వచ్చే సౌకర్యం ఇదోటి !

%d bloggers like this: