బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   మా కోడలు చి.శిరీష, ఎక్కడికైనా ప్రోగ్రాం వేసిందంటే చాలు, రెండు రోజులు ముందునుండీ, ప్రిపరేషన్లు ప్రారంభిస్తుంది. ప్రతీ చిన్న విషయం మర్చిపోకుండా, ఎవరెవరికి ఏమేం కావాల్సొస్తుందో, అన్నిటినీ రెడీ చేయడం. ఓ చెక్ లిస్ట్ తయారుచేసికుని, అన్నీ మెథాడికల్ గా చేయడం. అలా రెండు రోజులు ముందుగానే అన్నీ రెడీ చేసేసికుని, శనివారం ప్రొద్దుటే
ఏడున్నరకల్లా అందరినీ కారులో కూర్చోపెట్టేసింది. ఛైల్డ్ సీట్ తీసేయడంతో, మాఇద్దరికీ సౌకర్యంగానే ఉంది. పిల్లలిద్దరూ మాతోనూ, వాళ్ళిద్దరూ ముందరా కూర్చుని, అనుకున్న టైముకి బయలుదేరేశాము. అప్పటికే రెండు సార్లు అక్కడకి వెళ్ళడం కారణంగా, వాళ్ళకి అన్నీ తెలిసున్నట్లే. మా సౌకర్యం కోసం, మేము వెళ్ళే ప్రదేశం గురించి ప్రింటౌట్ తీసి మా ఇంటావిడకి ఇచ్చేసింది.

   నాకు నిజం చెప్పాలంటే, ఇలాటి ట్రిప్పులమీద అంత ఆసక్తి లేదు. చెప్పానుగా, కలాపోసణ కొంచం తక్కువ. తక్కువేమిటిలెండి, శూన్యం అంటే బాగుంటుంది! మా ఇంటావిడకలాక్కాదు, ప్రకృతి సౌందర్యం,దానికి యాడెడ్ ఎట్రాక్షన్ గా దైవదర్శనం కూడా ఉంటే, అడక్కండి. ఎంతదూరానికైనా రెడీ. నాకెలాగూ లేదూ, పోనీ ఆవిడైనా ఎంజాయ్ చేస్తుందీ అని నేనూ బయలుదేరుతూంటాను. అదే కాకుండా ఇంకో కారణం కూడా ఉంది. మా అగస్థ్య ఆవిణ్ణి వదలడు, పూర్తి ప్రయాణం అంతా తనే శ్రమ పడ్డం ఎందుకూ, నేను కూడా ఓ చెయ్యేద్దామని వెళ్తూంటాను. మనవడు కూడా నన్ను డిజప్పాయింటు చేయడులెండి. మనవరాలితో అంత గొడవ లేదు. తన విషయాలేవో తనే చూసుకుంటుంది.

   మేము వెళ్ళిన ప్రదేశం పేరు – ” దివే ఆగర్” ట. కొంకణ్ తీరంలో పూణె కి దగ్గరదగ్గర రెండు వందల కిలోమీటర్లుంది. ముందుగానే ఓ Farm House బుక్ చేసేశారు.13 మధ్యాన్నానికి చేరి, 15 మధ్యాన్నం దాకా, అంతా కలిపి ఎనిమిది వేలు తీసికున్నారు. చాలా బావుంది. నాలుగు రూమ్ములూ ఏ.సి. చాలా విశాలంగా ఉన్నాయి. చుట్టూరా ఓ పేద్ద తోట, దాన్నిండా పోక , కొబ్బరి, మామిడి ఒకటేమిటి, అన్నిరకాల పళ్ళూ, పువ్వుల చెట్లూ, వాటితో పాటు ఎకంపనీమెంట్స్ పాములూ, పక్షులూ, కుక్కలూ, వగైరా వగైరా…

   మేముండే ఫార్మ్హౌస్ కి దగ్గరలోనే సముద్రతీరం. ఇంకా ఆ ప్రదేశం పొల్యూట్ అవలేదులెండి. దానితో బాగానే ఉన్నట్టనిపించింది. పూణె లో ఉండి ఉండి, అప్పుడప్పుడు ఛేంజ్ గా ఇలాటివి చాలా బావుంటాయి. ఈ జనరేషన్ వాళ్ళు ఎప్పుడూ ఆఫీసూ, పనీ, పిల్లలూ, చదువులూ, పీర్ ప్రెషర్లూ వీటితో సతమతమవుతూండడం వలన, అప్పుడప్పుడు ఇలాటి ప్రదేశాలు stress bustersగా ఉపయోగిస్తూంటాయి. నాకు పెద్దగా స్ట్రెస్సూ లేదూ, ఉన్నదానిలోనే సంతృప్తి పడుతూంటాను. ఎవరి comfort level వాళ్ళది. అలాగని నన్ను మరీ spoil sport అనుకోకండి. మరీ మూతి ముడుచుక్కూర్చునే రకం కాదు. అలాగని పిల్లలు ఎక్కడికైనా రమ్మన్నా, మరీ ముందర నన్నడగరు, వాళ్ళమ్మని అడిగిన తరువాతే నన్ను.

   ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకూ అంటే, అక్కడ చూసిన విశేషాలు వ్రాసే నేర్పు నాకులేదు. ఆ డిపార్ట్మెంటు మా ఇంటావిడది. చూడ్డం సంగతికొస్తే, దారి పొడుగునా కొండలూ, లోయలూ, పైగా వర్షా కాలమోటి, దానితో ఎక్కడ చూసినా పేద్ద పేద్ద జలపాతాలే. ప్రతీ కిలోమీటరుకీ ఓ జలపాతం, మరీ నయాగరాలూ, జోగ్గులూ, విక్టోరియాలూ , కుర్తాళాలూ కాదు, ఏదో సంసారపక్షంగా, దాంట్లో కాలుజారితే కొట్టుకుపోయేటంత! జలపాతం విడిచి జలపాతం చూసుకుంటూ, వాటిదగ్గర పిల్లల్ని నీళ్లల్లో ఆడిస్తూ, కొడుకూ,కోడలూ, మా ఇంటావిడా, పిల్లల వంక పెట్టి వాళ్ళు కూడా నీళ్ళోడుతూ, నా బట్టలు తడవకుండా పొడిగా ఉన్నాయని కళ్ళు కుట్టుకుంటూ, నేనెక్కడ సుఖపడిపోతున్నానో అని, అగస్థ్య ని నా ఒళ్ళో కూర్చోబెడుతూ, దారిపొడుగునా వాహ్ వోహ్ బ్యూటిఫుల్ ఆసం…అనుకుంటూ మొత్తానికి రెండింటికి చేరాము. భోజనం చాలా బావుంది. చెప్పానుగా, ఇంకా వ్యాపార సరళిలోకి వెళ్ళలేదు! ఆ ఊళ్ళో, ఎక్కడ చూసినా రిసార్టులే.కాఫీలూ, చాయ్ లూ, పిల్లలకి పాలూ పుష్కలంగా దొరుకుతాయి.

   ఊళ్ళో చూడ్డానికి బీచ్ తప్ప ఇంకేమీ లేదు. అసలు వాళ్ళొచ్చింది కూడా దానికోసమేకదా, నేను, వీళ్ళ సామాన్లూ అవీ చూస్తానని చెప్పి, ఓ జంబుకానా వేసికుని సెటిల్ అయిపోయాను. వాళ్ళ దారిన వాళ్ళు ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ కూర్చున్నారు. మర్నాడు బయలుదేరి, దగ్గరలో ఉన్న శ్రీవర్ధన్, హరిహరేశ్వర్ వెళ్ళి, అక్కడ దైవ దర్శనం చేసికుని, దారిలో భోజనం కానిచ్చి, మళ్ళీ బీచ్చీ, ఆటలూ ! వచ్చిన గొడవల్లా ఏమిటంటే, నా కెమెరా హాండిచ్చేసింది! ఏం రోగం వచ్చిందో, బయట తీసిన ఒక్క ఫొటో కూడా రాలేదు.అబ్బాయి కెమేరా లో బ్యాటరీ అయిపోయింది. ఛార్జర్ మర్చిపోయాడు! అస్తమానూ వీడియోలు తీస్తే, బ్యాటరీ డిస్ఛార్జవకేం చేస్తుందీ?

   ట్రిప్పెలా ఉంది మామయ్యగారూ అని మా కోడలడిగింది. బ్రహ్మాండం అన్నాను. కాలు కింద పెట్టకుండా, తీసికెళ్తే రోగం ఏమిటీ? మరీ బస్సులూ వాటిమీద వెళ్తే, ఏమౌనో కానీ, హాయిగా, ఓ ఫార్మ్హౌస్ బుక్ చేసి, అన్ని సౌకర్యాలూ చేస్తే, ఎన్నిసార్లైనా వెళ్తాను. మా నవ్యా, అగస్థ్యా ఎలా ఎంజాయ్ చేశారో చూడండి…పిల్లల మొహాల్లో ఆ నవ్వు చూడ్డానికి ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళొచ్చు. మా రోజుల్లో ఇలాటివుండేవి కావు.అంత అవసరమూ ఉండేది కాదూ. అక్కడ అదే మేము వెళ్ళిన చోట, ఎక్కడ చూసినా, యంగ్ కపుళ్ళూ, పక్కనే ఓ పిల్లో ఇద్దరు పిల్లలో, వాళ్ళని చూడ్డానికి Extra luggage పేరెంట్సూ!


15 Responses

 1. మీ మనవడి కళ్ళలోనే టన్నులకొద్ది చిలిపితనం కనిపిస్తొంది..పిల్లలు బాగున్నారు…

  Like

 2. మీరన్నట్టు ఆ పిల్లల మోహంలో నవ్వు చూడటానికి ఎన్ని కిలోమీటర్లయినా వెళ్ళచ్చు. వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతా ఆ కళ్ళల్లో, నవ్వుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భలే ముచ్చటగా ఉంది మాస్టారూ.
  అయినా మీరు కూడా ప్రతిచోటా అలా గట్టు మీద కూర్చోక పోతే వాళ్ళతో కలిసి నీళ్ళలో ఆడుకోవచ్చుగా. మా తాతగారితో కలిసి ఎంజాయ్ చేసామని వాళ్ళు రేప్పొద్దున్న వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు. :)))

  Like

 3. పక్కనే ఓ పిల్లో ఇద్దరు పిల్లలో, వాళ్ళని చూడ్డానికి Extra luggage పేరెంట్సూ!

  Ha Ha Ha Ha

  Like

 4. సముద్ర తీర యాత్రా విశేషాలు ఎంతో బాగున్నాయి,
  పిల్లలు చాలా ముద్దోస్తున్నారు.
  అంత మంచి కోడలు దొరకడము మీ అదృష్టం,
  అభినందనాలు.

  Like

 5. ఏదో సంసారపక్షంగా, దాంట్లో కాలుజారితే కొట్టుకుపోయేటంత! ******* LOL
  మీ టపా.. అక్కడక్కడా, అల్లం ముక్కలూ, నేతిలో వేయించిన మిరియాలూ పంటికి తగులుతున్న వేడి వేడి కట్టు పొంగలి లా ఉంది.. (మై గాడ్.. కొత్తావకాయ టపా లు పొద్దున్నే చదివిన ఎఫెక్ట్!)

  Like

 6. >>>నాకు నిజం చెప్పాలంటే, ఇలాటి ట్రిప్పులమీద అంత ఆసక్తి లేదు. చెప్పానుగా, కలాపోసణ కొంచం తక్కువ
  >>>మరీ ముందర నన్నడగరు, వాళ్ళమ్మని అడిగిన తరువాతే నన్ను
  >>>నా బట్టలు తడవకుండా పొడిగా ఉన్నాయని కళ్ళు కుట్టుకుంటూ, నేనెక్కడ సుఖపడిపోతున్నానో అని,.
  >>>వాళ్ళని చూడ్డానికి Extra luggage పేరెంట్సూ!

  కడుపులో చల్ల కదలకుండా అన్నీ చూపించి తీసుకు వస్తే మీరేమిటి ఆ సన్నాయి నొక్కులు? ఎందుకు అధ్యక్షా ? 🙂
  పిల్లలు ముద్దు వస్తున్నారు. మీరు కూడా నీళ్ళలోకి దిగి ఆడి ఉండాల్సింది.

  Like

 7. కృష్ణ ప్రియ గారూ,

  కొత్తావకాయ effect మీకు కూడా బాగానే పట్టినట్టుంది. నాకైతే ఘృతాచి లడ్డు లాగా ఉంది. 🙂

  Like

 8. ఆ పిల్లల ఆనందం చూడండి, ఎంత సంబరపడిపోతున్నారో!…దానికోసమైనా మీరిలాంటి ట్రిప్పులు వెయ్యాల్సిందే తప్పదు 🙂

  Like

 9. అక్కడ చూసిన విశేషాలు వ్రాసే నేర్పు నాకులేదు. ఆ డిపార్ట్మెంటు మా ఇంటావిడది”
  మీకు వాళ్ల రియాక్షన్లు రాసే నేర్పు మాత్రం పుష్కలంగా వుంది సుమండీ.
  “……దారిపొడుగునా వాహ్ వోహ్ బ్యూటిఫుల్ ఆసం…అనుకుంటూ”….)
  భలేగా కళ్లకి కట్టినట్లుగా రాశారుగా.
  అమితాబ్ బచ్చన్ మనవల పేర్లూ, మీ మనవల పేర్లూ ఒకటేనండోయ్. కావాలనే అలా పెట్టారా?

  Like

 10. Bhale manchi family andi meedi andaru manchivaalle.meerantaa ilaa happy gaa vundi maaku manchi manchi tapaalu andistoo vundaali

  Like

 11. @నిరుపమా,
  థాంక్స్ !

  @శంకర్,
  ఏదో ఇలా వెళ్ళిపోనీ నాయనా! నాకు వాళ్ళ శెహబాషీలేమీ అఖ్ఖర్లేదు !!

  @కుమార్,

  థాంక్స్.

  @మోహన్ గారూ,
  వీటినే “విశేషాలు” అనడం చాలా బావుంది. మీ అభినందనలకు ధన్యవాదాలు.

  @కొత్తావకాయా,
  ఊరికే ఓ స్మైలీ పెట్టేసి ఊరుకోవడం కాదు.మీ టపాలో వ్రాసినవి నాకు ఎప్పుడు మెయిల్ చేస్తున్నావూ ?

  @కృష్ణప్రియా,

  చక్రపొంగలి అంటే సొమ్మేం పోయిందమ్మా !!!

  @సుబ్రహ్మణ్యం గారూ,

  దీన్నే ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటారనుకుంటానూ !! తిన్న తిండరక్క కూసే కూతలు నావి!!ఏదో గట్టుమీదే బావుందనిపించింది.

  @సౌమ్యా,
  నేననుకునేదీ అదే మాట. కానీ పిల్లలు కూడా అనుకోవాలిగా !!!!

  @సాహితీ,
  పిల్లల పెళ్ళిళ్ళ దగ్గరనుంచి, వాళ్ళ పిల్లల పేర్లు కూడా వాళ్ళిష్టానికే వదిలేశాము. అమ్మాయి కూతురి పేరు తాన్యా, కొడుకు పేరు ఆదిత్య.

  @శారదా,
  భగవంతుడు అలాగే ఆశీర్వదించాలని నా కోరికానూ !!

  Like

 12. మీ మనసు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా వుందో మీ పోస్ట్ ని చూస్తే తెలిసిపోతోంది…. ఈ మధ్యనే నేను కూడా ఇలాంటి ప్రోగ్రామే పెడుతున్నా..

  Like

 13. extra luggage parents aa ? papam antha premato mee abbai teesukelte, pillalani chusukotanike extra luggage ga teeskellaru antara ? khandistunnaa deenni teevram gaa.

  ee rojullo kodalu, atta, mamalu oka roof kinda okka ganta unde paristhithi ledu konni families lo.evari lokam, darlu varive. mee family ala kakunda unnanduku abhinandanalu.

  Like

 14. @శంకర్ వోలేటి గారూ,

  ఇంకెందుకాలశ్యం ?

  @E,
  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: