బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–most critical decade..అనండి లేదా పుష్కరం అనండి..

    ఏమిటీ ఈవేళ ఏదైనా స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోని “most critical decade..అనండి లేదా పుష్కరం అనండి..” గురించేమైనా పాఠాలు చెప్తాడా ఈయనా అని ఊరికే ఖంగారు పడకండి! నాకు అలాటి జ్ఞానబోధలు చేసే అలవాటూ లేదూ, అంత జ్ఞానమూ లేదూ, ఓపికా లేదు. నేను చెప్పేది, సాదా సీదా ఓ ఆడపిల్ల మామూలు NTP conditions అంటే, పాతికేళ్ళో, మహా అయితే ఇంకో రెండేళ్ళకో, పెళ్ళి చేసికుని, 30 ఏళ్ళకి ఒకరో ఇద్దరో పిల్లల్ని కని, వాళ్ళని పెంచిపెద్దచేసే సందర్భంలో, తను, 30-40 సంవత్సరాల వయస్సులో పడే పాట్ల గురించి. నా టపాలు చదివేవారు చాలా మంది ఈ కోవకే చెందినవారైఉంటారనే ఉద్దేశ్యంతో వ్రాస్తూన్న టపా. ఇవన్నీ నా observations మాత్రమే. తప్పొప్పులు మీరే నిర్ణయించాలి. వేషాలు కానీ, ఈయనకేం తెలుస్తుందీ అని తీసిపారేస్తే, నేనేం చేయలేను! మీ ఇష్టం !

అప్పుడప్పుడే టీన్ ఏజ్ లో అడుగెడుతున్న కూతురికి, ప్రపంచం లో ” అమ్మ” అంత పరమ శత్రువింకోరుండరు. అసలు ఈ అమ్మ అనేది, నన్ను హింసించడానికే పుట్టుకొచ్చిందీ అనుకుంటారు.పదేళ్ళొచ్చేదాకా, కొంగుపట్టుకుని తిరిగే పిల్లకి, బయలాజికల్ ఛేంజెస్ వచ్చేసరికి, అమ్మ అంటే ” అల్లం ముక్క” అయిపోతుంది. నిజమే కదా, ప్రొద్దుటలేచింది మొదలు, స్కూలుకో కాలేజీకో వెళ్ళి తిరిగొచ్చేదాకా, పాపం ఆ తల్లికి ఈ పిల్లగురించే చింతంతా! బయట ఫ్రెండ్సేసుకునే డ్రెస్సులే బావుంటాయి, వాళ్ళు చదివే పుస్తకాలే నచ్చుతాయి. పైగా ఈ రోజుల్లో ఇంటర్ నెట్టులూ, అవీనూ.బయటివాళ్ళు తినే తిండేనచ్చుతుంది.ప్రతీ విషయంలోనూ అమ్మేదో అడుగుతుందీ, అన్నిటికీ జవాబు కావాలంటుంది. స్కూలునుండి రాగానే, స్కూల్లో ఏమేం జరిగేయో చెప్పాలి,ఫ్రెండ్సందరూ ఎలా ఉన్నారో చెప్పాలి, స్కూల్లో చెప్పేపాఠాల విషయం సరేసరి. ఇదేం చిత్రమమ్మా, అసలు నాకో వ్యక్తిత్వం అనేదుందా లేదా అని ఆ పిల్లా, నీమంచికోసమేనమ్మా అని ఆ తల్లీ కొట్టుకోని రోజుండదు. ఫ్రెండ్సందరూ చూశారని అదేదో సినిమాకెళ్ళాలంటుంది. ఇవికాకుండా స్కూలూ, హోంవర్కూ ఉండనే ఉంటాయి.ఇదంతా ఒకెత్తూ, ఇంకో పిల్లాడు కూడా ఉంటే ఇంక అడగఖ్ఖర్లేదు! వాడి గోల వాడిదీ.

వర్కింగ్ లేడీస్ అదీ, ఏ ఐటీ లోనో పనిచేసేవారైతే,వాళ్ళకి 24 గంటలూ సరిపోనే సరిపోవు. బయటివాళ్ళనుకుంటారూ, ఆవిడకేమండి బాబూ, హాయిగా వర్క్ ఫ్రం హోం, మాలాగ ప్రొద్దుటే తెమిలి, వంటచేసికుని, పిల్లల్ని స్కూలు బస్సులో ఎక్కించి, ఆదరాబాదరాగా వెళ్ళాలా ఏమిటీ అనుకుంటారు. వాళ్ళపనే హాయి ఒక విధంగా, ఆఫీసుకెళ్ళి ఓ కాబిన్ లో కూర్చుని వాళ్ళ పనేదో చూసుకుంటారు. టైముకి తిండేనా ఉంటుంది. ఈ కొంపనుండి పనిచేసే ప్రాణులు (కొం.ప. ప్రా) ల సంగతి ఘోరం. ఆ లాప్టాపు 24 గంటలూ ఓపెనయ్యే ఉండాలి. ఏ అమెరికాలోనో, స్వీడన్ లోనో ఇంకోచోటో ఉండేవాడికి అప్పుడే తెల్లారుతుంది, వాడిదేం పోయిందీ, లేడికి లేచిందే పొద్దూ అనుకుని ఓ వరసా వావీ లేకుండా మెయిల్స్ పంపుతూనే ఉంటాడు.ఇక్కడ ఈ అమ్మగారేమో పాపం ఏదో ఒకటి గొంతుకలో పడాలికదా,దానితో ఏ కాఫీయో చాయో తయారుచేసికోడానికి ఏ కిచెన్ లోకో వెళ్తుంది. ఇంతట్లో వాడేమో, ఈవిడ రెస్పాన్సివ్వడం లేదని, ఈవిడగారి పైవాడికి మెయిలోలేకఇంకోటో పంపెస్తాడు. అక్కణ్ణుంచి ఆయన ఫోన్లూ. కాఫీ చాయ్ గయా పానీమే ! పైగా ఈవిడ టైముకి అటెండవకపోతే ” ఆర్ యూ దేర్?” అంటూ సణుగుడూ. హాయిగా ఆఫీసునుంచే పనిచేసికుంటే బావుండేదీ అని ఈవిడనుకుంటుంది. ఓ టైమూ పాడూ ఉండదు ఈ కొం.ప.ప్రా లకి. కానీ ఇందులో ఉండే సౌకర్యాలు దీంట్లోనూ ఉన్నాయి. ఎప్పుడో బయటి దేశాలకెళ్ళవలసివచ్చినప్పుడు వస్తుంది అసలు గొడవంతా. పాపం అప్పుడే వయస్సులోకి వస్తున్న టీనేజ్ పిల్లని వదిలీ వెళ్ళలేదూ, అలాగనిఉద్యోగ భవిష్యత్తూ పాడిచేసికోలేదు.

ఇదంతా టీనేజ్ ఆడపిల్లలుండే తల్లుల కష్టాల పరంపర. ఇంక చిన్న స్కూలుకి వెళ్ళే పిల్ల ఒకర్తీ, ఇంకా క్రెచ్ కెళ్తున్న బాబూ ఉన్న వాళ్ళ కష్టాలింకో రకం. స్కూల్లో ఏమైనా హోం వర్కిచ్చారో లేదో, స్కూలునుండి రాగానే ఛస్తే చెప్పరు. ఏ రాత్రో సడెన్ గా గుర్తొస్తుంది.ఇంక ఆ తల్లి ఉరకలూ పరుగులూ చూస్తే, “పగవాళ్ళకైనా ఇలాటి కష్టాలు రాకూడదురా బాబూ” అనుకుంటాము! ఏం తింటారో తెలియదు, ఎప్పుడు తింటారో తెలియదు. వాళ్ళు ఏదో ఒకటితిని పడకెక్కేదాకా ఈ తల్లులకి నిద్రనేదుండదు.

ఏదో నానా తిప్పలూ పడి, మొత్తానికి ఓ పదేళ్ళో,పుష్కరమో ఏ అవాంతరమూ రాకుండా,గడపగలిగితే వీళ్ళ పెళ్ళిలయేదాకా కొంచం పరవా లేదు. కానీ ప్రతీ స్త్రీ, మామూలు గృహిణైనా (మా ఇంటావిడ లాటిది), ఇద్దరు పిల్లల వర్కింగు లేడీ ( మా అమ్మాయీ, కోడలూ, ఎందుకంటే పైన చెప్పిన వెరైటీలు- టీన్ ఏజ్ కూతురూ, ఏడేళ్ళ కొడుకూ,చిన్నస్కూలుకెళ్ళ్ కూతురూ, క్రెచ్ కెళ్ళే కొడుకూ–), వాళ్ళు పడే తిప్పలు డే ఇన్ డే ఔట్ చూస్తున్నాను. అదృష్టం కొద్దీ నాది అబ్జర్వర్ పాత్రే! పార్టిసిపెంటు పాత్రైతే వామ్మోయ్ !! హ్యాట్సాఫ్ టు ఆల్ వర్కింగ్ మదర్స్ !!

%d bloggers like this: