బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మా కోడలు చి.శిరీష, ఎక్కడికైనా ప్రోగ్రాం వేసిందంటే చాలు, రెండు రోజులు ముందునుండీ, ప్రిపరేషన్లు ప్రారంభిస్తుంది. ప్రతీ చిన్న విషయం మర్చిపోకుండా, ఎవరెవరికి ఏమేం కావాల్సొస్తుందో, అన్నిటినీ రెడీ చేయడం. ఓ చెక్ లిస్ట్ తయారుచేసికుని, అన్నీ మెథాడికల్ గా చేయడం. అలా రెండు రోజులు ముందుగానే అన్నీ రెడీ చేసేసికుని, శనివారం ప్రొద్దుటే
ఏడున్నరకల్లా అందరినీ కారులో కూర్చోపెట్టేసింది. ఛైల్డ్ సీట్ తీసేయడంతో, మాఇద్దరికీ సౌకర్యంగానే ఉంది. పిల్లలిద్దరూ మాతోనూ, వాళ్ళిద్దరూ ముందరా కూర్చుని, అనుకున్న టైముకి బయలుదేరేశాము. అప్పటికే రెండు సార్లు అక్కడకి వెళ్ళడం కారణంగా, వాళ్ళకి అన్నీ తెలిసున్నట్లే. మా సౌకర్యం కోసం, మేము వెళ్ళే ప్రదేశం గురించి ప్రింటౌట్ తీసి మా ఇంటావిడకి ఇచ్చేసింది.

   నాకు నిజం చెప్పాలంటే, ఇలాటి ట్రిప్పులమీద అంత ఆసక్తి లేదు. చెప్పానుగా, కలాపోసణ కొంచం తక్కువ. తక్కువేమిటిలెండి, శూన్యం అంటే బాగుంటుంది! మా ఇంటావిడకలాక్కాదు, ప్రకృతి సౌందర్యం,దానికి యాడెడ్ ఎట్రాక్షన్ గా దైవదర్శనం కూడా ఉంటే, అడక్కండి. ఎంతదూరానికైనా రెడీ. నాకెలాగూ లేదూ, పోనీ ఆవిడైనా ఎంజాయ్ చేస్తుందీ అని నేనూ బయలుదేరుతూంటాను. అదే కాకుండా ఇంకో కారణం కూడా ఉంది. మా అగస్థ్య ఆవిణ్ణి వదలడు, పూర్తి ప్రయాణం అంతా తనే శ్రమ పడ్డం ఎందుకూ, నేను కూడా ఓ చెయ్యేద్దామని వెళ్తూంటాను. మనవడు కూడా నన్ను డిజప్పాయింటు చేయడులెండి. మనవరాలితో అంత గొడవ లేదు. తన విషయాలేవో తనే చూసుకుంటుంది.

   మేము వెళ్ళిన ప్రదేశం పేరు – ” దివే ఆగర్” ట. కొంకణ్ తీరంలో పూణె కి దగ్గరదగ్గర రెండు వందల కిలోమీటర్లుంది. ముందుగానే ఓ Farm House బుక్ చేసేశారు.13 మధ్యాన్నానికి చేరి, 15 మధ్యాన్నం దాకా, అంతా కలిపి ఎనిమిది వేలు తీసికున్నారు. చాలా బావుంది. నాలుగు రూమ్ములూ ఏ.సి. చాలా విశాలంగా ఉన్నాయి. చుట్టూరా ఓ పేద్ద తోట, దాన్నిండా పోక , కొబ్బరి, మామిడి ఒకటేమిటి, అన్నిరకాల పళ్ళూ, పువ్వుల చెట్లూ, వాటితో పాటు ఎకంపనీమెంట్స్ పాములూ, పక్షులూ, కుక్కలూ, వగైరా వగైరా…

   మేముండే ఫార్మ్హౌస్ కి దగ్గరలోనే సముద్రతీరం. ఇంకా ఆ ప్రదేశం పొల్యూట్ అవలేదులెండి. దానితో బాగానే ఉన్నట్టనిపించింది. పూణె లో ఉండి ఉండి, అప్పుడప్పుడు ఛేంజ్ గా ఇలాటివి చాలా బావుంటాయి. ఈ జనరేషన్ వాళ్ళు ఎప్పుడూ ఆఫీసూ, పనీ, పిల్లలూ, చదువులూ, పీర్ ప్రెషర్లూ వీటితో సతమతమవుతూండడం వలన, అప్పుడప్పుడు ఇలాటి ప్రదేశాలు stress bustersగా ఉపయోగిస్తూంటాయి. నాకు పెద్దగా స్ట్రెస్సూ లేదూ, ఉన్నదానిలోనే సంతృప్తి పడుతూంటాను. ఎవరి comfort level వాళ్ళది. అలాగని నన్ను మరీ spoil sport అనుకోకండి. మరీ మూతి ముడుచుక్కూర్చునే రకం కాదు. అలాగని పిల్లలు ఎక్కడికైనా రమ్మన్నా, మరీ ముందర నన్నడగరు, వాళ్ళమ్మని అడిగిన తరువాతే నన్ను.

   ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకూ అంటే, అక్కడ చూసిన విశేషాలు వ్రాసే నేర్పు నాకులేదు. ఆ డిపార్ట్మెంటు మా ఇంటావిడది. చూడ్డం సంగతికొస్తే, దారి పొడుగునా కొండలూ, లోయలూ, పైగా వర్షా కాలమోటి, దానితో ఎక్కడ చూసినా పేద్ద పేద్ద జలపాతాలే. ప్రతీ కిలోమీటరుకీ ఓ జలపాతం, మరీ నయాగరాలూ, జోగ్గులూ, విక్టోరియాలూ , కుర్తాళాలూ కాదు, ఏదో సంసారపక్షంగా, దాంట్లో కాలుజారితే కొట్టుకుపోయేటంత! జలపాతం విడిచి జలపాతం చూసుకుంటూ, వాటిదగ్గర పిల్లల్ని నీళ్లల్లో ఆడిస్తూ, కొడుకూ,కోడలూ, మా ఇంటావిడా, పిల్లల వంక పెట్టి వాళ్ళు కూడా నీళ్ళోడుతూ, నా బట్టలు తడవకుండా పొడిగా ఉన్నాయని కళ్ళు కుట్టుకుంటూ, నేనెక్కడ సుఖపడిపోతున్నానో అని, అగస్థ్య ని నా ఒళ్ళో కూర్చోబెడుతూ, దారిపొడుగునా వాహ్ వోహ్ బ్యూటిఫుల్ ఆసం…అనుకుంటూ మొత్తానికి రెండింటికి చేరాము. భోజనం చాలా బావుంది. చెప్పానుగా, ఇంకా వ్యాపార సరళిలోకి వెళ్ళలేదు! ఆ ఊళ్ళో, ఎక్కడ చూసినా రిసార్టులే.కాఫీలూ, చాయ్ లూ, పిల్లలకి పాలూ పుష్కలంగా దొరుకుతాయి.

   ఊళ్ళో చూడ్డానికి బీచ్ తప్ప ఇంకేమీ లేదు. అసలు వాళ్ళొచ్చింది కూడా దానికోసమేకదా, నేను, వీళ్ళ సామాన్లూ అవీ చూస్తానని చెప్పి, ఓ జంబుకానా వేసికుని సెటిల్ అయిపోయాను. వాళ్ళ దారిన వాళ్ళు ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ కూర్చున్నారు. మర్నాడు బయలుదేరి, దగ్గరలో ఉన్న శ్రీవర్ధన్, హరిహరేశ్వర్ వెళ్ళి, అక్కడ దైవ దర్శనం చేసికుని, దారిలో భోజనం కానిచ్చి, మళ్ళీ బీచ్చీ, ఆటలూ ! వచ్చిన గొడవల్లా ఏమిటంటే, నా కెమెరా హాండిచ్చేసింది! ఏం రోగం వచ్చిందో, బయట తీసిన ఒక్క ఫొటో కూడా రాలేదు.అబ్బాయి కెమేరా లో బ్యాటరీ అయిపోయింది. ఛార్జర్ మర్చిపోయాడు! అస్తమానూ వీడియోలు తీస్తే, బ్యాటరీ డిస్ఛార్జవకేం చేస్తుందీ?

   ట్రిప్పెలా ఉంది మామయ్యగారూ అని మా కోడలడిగింది. బ్రహ్మాండం అన్నాను. కాలు కింద పెట్టకుండా, తీసికెళ్తే రోగం ఏమిటీ? మరీ బస్సులూ వాటిమీద వెళ్తే, ఏమౌనో కానీ, హాయిగా, ఓ ఫార్మ్హౌస్ బుక్ చేసి, అన్ని సౌకర్యాలూ చేస్తే, ఎన్నిసార్లైనా వెళ్తాను. మా నవ్యా, అగస్థ్యా ఎలా ఎంజాయ్ చేశారో చూడండి…పిల్లల మొహాల్లో ఆ నవ్వు చూడ్డానికి ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళొచ్చు. మా రోజుల్లో ఇలాటివుండేవి కావు.అంత అవసరమూ ఉండేది కాదూ. అక్కడ అదే మేము వెళ్ళిన చోట, ఎక్కడ చూసినా, యంగ్ కపుళ్ళూ, పక్కనే ఓ పిల్లో ఇద్దరు పిల్లలో, వాళ్ళని చూడ్డానికి Extra luggage పేరెంట్సూ!


%d bloggers like this: