బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఇలాటి స్నేహితులుంటే,నాకేటి లోటు?……

    అప్పుడెప్పుడో పుస్తకం.నెట్ లో సుధామ గారు వ్రాసిన పుచ్చాపూర్ణానందం గారి ఆవకాయ-అమరత్వం పుస్తకం మీది రివ్యూ చదివి, ఈ పుస్తకం చదవకపోతే, మనం అసలు పుస్తకాలు చదవడం ఎందుకూ అనుకున్నాను. మే నెలలో బాపట్ల వెళ్తూ, దారిలో ఓ రెండు రోజులు భాగ్యనగరంలో, పుస్తకాలు కొనే భాగ్యం కలిగింది. నవొదయా కి వెళ్ళి, రావు గారిని, అయ్యా పుచ్చా పూర్ణానందం గారి పుస్తకాలేమైనా ఉన్నాయా అని అడిగితే, ఆయన పేరే వినలేదన్నారు! చటుక్కున కోపం వచ్చేసి, సుజాత గారికి ఫోను చేసి, ఆవిణ్ణి కోప్పడేశాను! అక్కడ నాకు లోకువగా దొరికిందావిడేగా మరి! వెర్రి ఇల్లాలు, ఇదివరకోసారి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి “కృష్ణా తీరం” కావాలంటే, ఆవిడే తన దగ్గరున్న ఓ కాపీ ఇచ్చారు, ఎప్పుడూ నేను క్రితం ఆగస్టులో “తెలుగుభాషా దినోత్సవానికి” 29 న కలిసినప్పుడు. అప్పుడే ఏడాదైపోయింది. ఇంక కావలిసిన పుస్తకాలు అడగొచ్చని, ఓసారి పెర్మిషన్ ఇచ్చేసిన తరువాత వదుల్తానా మరి? ఆ సందర్భం లోనే, ఆవిణ్ణి కోప్పడడం! ‘ మీరు ముందర బాపట్ల వెళ్ళి రండి, తిరిగి వచ్చేటప్పటికి, ఆ పుస్తకమేనా సంపాదిస్తానూ, కాని పక్షంలో ఎక్కడ దొరుకుతుందో తెలిసికుంటానూ అని ఓ భరోసా ఇచ్చారు.

    తిరుగుప్రయాణం లో, రెహ్మాను చే తీసికెళ్ళబడగా, సుజాత గారి ఆతిథ్యం పొందానుగా. అక్కడకి వెళ్ళగానే, మొట్టమొదటి పలకరింపు, “మన వేణు ధర్మమా అని, మీక్కావలిసిన పుస్తకం ఎక్కడ దొరుకుతుందో మొత్తానికి తెలిసికున్నామూ” అని. ఇంతలో వేణు, ఎవరికో ఫోను చేసి, నన్ను మాట్లాడమని, ఆ ఫోనుకాస్తా నా చేతిలో పెట్టాడు. అటువైపు మాట్లాడుతున్న వారు, విజయవాడ లో ఉండే శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు. నా పరిచయం చేసికుని, అయ్యా ఫలానా పుస్తకం గురించి వెదుకుతున్నానూ, మీరేమైనా సహాయం చేయకలరా అని అడిగితే, దానికేం భాగ్యం,నా దగ్గర ఒక కాపీ ఉంది, Xerox చేయించి పంపుతానూ, ఎడ్రస్ ఇవ్వండీ అన్నారు. నేనెవరో ఆయనకు తెలీదు, మొదటి పరిచయం లోనే, తన దగ్గర ఉన్న పుస్తకాన్ని పంపుతామనడం ఆయన సహృదయత.

    పూణె తిరిగి వచ్చిన తరువాత, ఓ పదిరోజులాగి ఆయనకి ఫోను చేశాను. ఏదో పని వత్తిడిలో ఉండి, ఇంకా కాపీ చేయించలేదూ అన్నారు. మరీ స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాగ, ఆయన వెనక్కాల పడలేనుగా, పైగా మరీ ఇన్నిసార్లు అడిగితే, పంపనూ అంటే, నాకు పుస్తకం దొరికేదెలాగ? పోన్లే, చదివే యోగం ఉంటే, అదే దొరుకుతుందిలే అని అప్పటికి వదిలేశాను. అప్పుడు గుర్తొచ్చింది, విజయవాడలో మా మేనకోడలు ఉందని.అవసరం వచ్చేటప్పటికి ఇలాటివి గుర్తొస్తూంటాయి. మేము రాజమండ్రీ కాపరం లో ఉన్నప్పుడు, పిల్లలతో మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది, తనకి పుస్తకాలు చదవడం చాలా ఇష్టమూ అని. అమ్మయ్యా, నాలాటిది ఒకర్తి దొరికిందీ అనుకుని, తనకి ఫోను చేశాను. బ్యాగ్రౌండంతా చెప్పి, ” నీకో ఫోను నెంబరిస్తానూ, ఆయన దగ్గరకు వెళ్ళి, అడిగితే ఓ పుస్తకం ఇస్తారూ, Xerox చేయించి నాకు పంపు తల్లీ” అని చెప్పాను. తను మర్నాడే, తీరిక చేసికుని, ఆయన దగ్గరకు వెళ్ళిందిట. ఈ విషయమంతా, ఓ నాలుగు రోజుల తరువాత ఫోను చేసి ” మావయ్యా, ఎంత అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేశావూ, విజయవాడలో ఇంతకాలం నుండీ ఉంటున్నా, నాకు తెలియదు, ఆయన్ని గురించి, కలిసి చాలా సేపు మాట్లాడాను.నీకివ్వమని, ఇంకో నాలుగు పుస్తకాలు కూడా ఇచ్చారూ” అని చెప్పింది.

    ఈవేళ ఆ పుస్తకాలు వచ్చాయి. ఆ నాలుగు పుస్తకాలూ క్రింద ఇచ్చిన ఫొటో లోవి. ఇంక పనేం ఉందీ? అన్నీ చదివేసి, త్వరలో మా గ్రంధాలయం లో పెట్టేసి, మిగిలినవారిచే చదివించేయడమే !

    ఇప్పుడు చెప్పండి, – రెండేళ్ళ క్రితం “నవ్య” దీపావళి సంచిక దొరక్క అడగ్గానే పంపిన అరుణ పప్పు, “ఇంకోతికొమ్మచ్చి” పంపిన మా గురువు గారు శ్రీ అప్పారావు గారు, క్రిష్ణా తీరం ఇచ్చి పుణ్యం కట్టుకున్న సుజాత, అడక్కుండానే అభిమానంతో “బాపు బొమ్మల కొలువు, ముక్కోతికొమ్మచ్చి” పంపిన శంకర్, పుచ్చా వారి పుస్తకం నాకు లభించేటట్లుగా శ్రీ పన్నాల వారిని పరిచయం చేసిన వేణు, ఎంతో పెద్దమనస్సుతో నాకు కావలిసిన పుస్తకమే కాకుండా, ఇంకో మూడు అచ్చోణీల్లాటి పుస్తకాలు ఇచ్చిన శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారూ, వీటన్నిటినీ జాగ్రత్తగా ప్యాక్కు చేసిన నా మేనకోడలు చి.బాల, అన్నిటిలోకీ ముఖ్యం వాటిని కొరియర్ చేసిన ఆమె భర్త చి.పార్ధసారథి— లాటి స్నేహితులుండగా నాకేటి లోటండీ …..

%d bloggers like this: