బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓ వారం ముందుగానే వచ్చేసిన అమ్మవారు…


    వచ్చేవారం 13,14,15 తేదీలలో, మా అబ్బాయీ,కోడలూ దగ్గరలో ఉన్న ఓ సీ రిసార్ట్ కి వెళ్ళడానికి ప్రొగ్రాం వేశారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు.12 న వరలక్ష్మి వ్రతం చేసికుని, మూడు రోజులూ దీపం పెట్టకుండా ఉండడం, మా ఇంటావిడకి సుతరామూ ఇష్టం లేదు. దానితో, ఓ వారం ముందుగానే అమ్మవారిని ఆహ్వానించేసింది. ఆవిడకూడా, కాదూ కూడదూ అనకుండా వచ్చేశారు! పైన ఇచ్చిన ఫొటోల్లో మొదటిది మేముండే ఇంట్లో మా ఇంటావిడ అలంకరించిన అమ్మవారూ, రెండో ఫొటో లో మా స్వంత ఇంట్లో మా కోడలు అలంకరించిన అమ్మవారూ.

    ఇంక మామూలేగా, పూజా పునస్కారాలంటే అదీ వరలక్ష్మీ వ్రతం అంటే, మా ఇంటావిడ చేసే హడావిడీ, ఆ సందర్భంలో బయటనుండి ఏమేం కావాలో వాటినన్నిటినీ తెప్పించడం, వగైరా వగైరా.. నిన్న బయలుదేరి బజారు కెళ్ళి పువ్వులూ, పళ్ళూ,తమలపాకులూ, కొబ్బరికాయలూ తెచ్చాను. అక్కడికేదో నెను శ్రమ పడేనని కాదు, అసలు శ్రమంతా ఆవిడదే. తెల్లవారుఝామున లేచి, తొమ్మిది రకాల పిండివంటలూ, తయారుచేసి, పూజ చేసికొని, తొమ్మిదయ్యేసరికల్లా అన్నీ పూర్తయిపోవాలి. అంత ఓపికెక్కడినుండి వస్తుందో నాకైతే తెలియదు. నాకు తెలిసిందల్లా ఆవిడ చేసిన పిండివంటలు!

   మా నాన్నగారూ, అమ్మగారూ పోయిన సంవత్సరాలు తప్పించి, మిగిలిన 35/36 సంవత్సరాలూ తొమ్మిది పిండివంటలూ చేస్తూనే ఉంది. నేను ఆస్వాదిస్తూనే ఉన్నాను. ఏం చేయను చెప్పండి, మీలో ఎవరికీ పంపనూలేను! సరదాగా క్రింద పెట్టిన ఫొటోల్లో రుచి చూసేయండి! ఇంకా కావలిసొస్తే, రాజమండ్రీలో ఉన్నప్పుడు, ఆవిడ వ్రాసిన టపా1, టపా2,
టపా3 చదివి మీకూ ఏమైనా ఉపయోగిస్తాయేమో చూసుకోండి !
ఈవేళంతా భుక్తాయాసం. దాంతో ఏమీ వ్రాయలేకపోతున్నాను ప్రస్తుతానికి !!

%d bloggers like this: