బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సరదాగా మీకోసం..

నాకు ఈమధ్యన వచ్చిన పుస్తకాలు చదవడంలో బిజీ అయిపోయాను. శ్రీ పుచ్చా పూర్ణానందం గారి హాస్యం సరే, కానీ వారి పుత్రరత్నం శ్రీ భార్గవ రామోజీ గారైతే, తండ్రిని మించిపోయారు. ఎప్పుడో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఆయన చేసిన హాస్య ప్రసంగాల సంకలనం “పలుకే బంగారం” అనే ఓ పుస్తక రూపంలో అందిచ్చారు. వాటిలో మొత్తం 15 “కథలు” ఉన్నాయి. ఒకదాన్ని మించి మరోటీ. కడుపునిండా తిండి తిని, ఈ పుస్తకంలో కథలు చదవడం మొదలెడితే, కొంచం కష్టం. ఎందుకంటే, నిండు పొట్టమీద నవ్వడం చాలా కష్టం! అదే ఖాళీ కడుపైతే, హాయిగా ఒక్కో కథా చదివితే, కడుపు నిండిపోతుంది. పైగా నవ్వి నవ్వి తిండి మాటే మర్చిపోవచ్చు కూడా! మచ్చుకి “పలుకే బంగారం” లోని ఒక్కపేరా వ్రాస్తున్నాను. చదివి మీరు కూడా నవ్వుకోండి……

   “అనవసరంగా మాట్లాడి శబ్దకాలుష్యం చేసేవారంటే ఆయనకి మా చెడ్డ ఎలర్జీ.మాటలు తక్కువ, పని ఎక్కువ అనేది ఆయన పాలసీ. ఈ సిధ్ధాంతాన్ని ఆధారం చేసికుని, ఓ “కోడ్” భాష క్రోడీకరించి, భార్యని “భా” అనీ, కొడుకుని “కొ” అని, కూతుర్ని “కూ” అనీ సింపుల్ గా అక్షరాలు కుదించి ముద్దుగా కూస్తాడు! వంట ఏం చేయమంటారని భార్య అడిగితే, వంకాయ బదులు “వం” అని, కంద బదులు “కం” అనీ, బచ్చలి బదులుగా “బచ్” అనీ, తోటకూర బదులు ” తోన్” అంటూ, అక్షరాలు మింగి మాటల పొదుపు చేస్తూంటాడు.
“యస్ నో” అనే బుడ్డి మాటలు కూడా రానీకుండా, పాత అట్టముక్కలకి, ఎరుపు, ఆకుపచ్చ కాగితాలు అంటించి సిగ్నల్స్ కొడుతూంటాడు. ఎవరన్నా వాళ్ళింటికి భోజనానికి వస్తానంటే ఎర్రట్ట.ఆయనెవరింటికన్నా పార్టీకెళ్ళాలంటే, పచ్చట్ట ఊపుతాడు!ఆఫీసులో ప్యూన్ని పిలవాలంటే, కాలింగ్ బెల్ ” ట్రిన్..”అంటూ ఒకసారీ,అదే పి.ఏ. ని పిలవాలంటే ” ట్రిన్-ట్రిన్..” అంటూ రెండుసార్లు నొక్కుతూ పిచ్చిగా బండగుర్తులు పెట్టాడు.అంతా యాక్షనే. పీకని తింటానికే తప్ప ఉపయోగించడు.” అని దేవయ్యగారు సుదీర్ఘంగా వివరించేసరికి, అయ్యగారి నాడి నాకర్ధమైపోయింది.అందుకోసం ఇంటర్వ్యూ లో అడిగిన నానారకాల ప్రశ్నలు: పేరు, తండ్రి పేరు,అడ్రసు, అర్హతలు,అనుభవాలూ అన్నిటికీ, నోరు విప్పకుండా,కళ్ళు తిప్పుతూ,వేళ్ళు చూపిస్తూ, చేతులెత్తుతూ, టి.వి.లో బధిర వార్తలు చూసిన అనుభవంతో, అత్యద్భుతంగా, సైగల్తో, కనుసైగల్తో ప్రదర్శిస్తూ సమాధానాలిచ్చాను. దాంతో ఆఫీసరుగారదిరిపడి, తృప్తిగా ఆకుపచ్చట్ట చూపించారు.

ఇంకో కథ ” పాదరక్షల పాపారావు” లోంచి ఓ పేరా…

   ” ఏం చేయాలో తోచక గది బయట అటూ ఇటూ పచార్లు చేస్తూ, అమాంతం డాక్టరమ్మ రూములోకి చొరబడి,” నొప్పులు తప్పనిసరిగా ఆవిడే పడాలని తెలిసినా, బెటర్ హాఫ్ అవడంతో,నా మనసు తట్టుకోలేకుండా ఉంది.కనీసం టెంపరరీ రిలీఫ్ కి ఓ ఇంజక్షనేనా చేయమ్మా” అని ఏదో తప్పుచేసినవాడిలా తల వంచి బ్రతిమాలాడు.కుక్కు ( అంటే కుక్కుటేశ్వర్రావు), బిక్క మొహంలోని ఆదుర్దాని అర్ధం చేసికున్న డాక్టరమ్మ, మెడలో స్టెతస్కోపుకానీ, కాళ్ళకి స్లిప్పర్స్ కానీ లేకుండా, లేబర్ రూం వైపు బయలుదేరింది.జూనియర్ డాక్టర్లూ, సిస్టర్లూ, నర్సులూ వెంటరాగా, వేచియున్న పేషెంట్లూ, విజిటర్లూ, రిప్రెజెంటేటివ్ లూ ఎటెన్షన్ పోజులో నిలబడ్డారు. దారిలో ఎవరో తినిపారేసిన అరటిపండు తొక్కమీద కాలు పడి, జర్రున జారి పడిపోయి, హాలు దద్దరిల్లేటట్టు కేక పెట్టింది. ఆ గావుకేకకి అదిరిపడి ఎవరి ప్రమేయం లేకుండానే, లక్కుమాంబ మగపిల్లాడిని ప్రసవించింది.అదీ లక్కూ,కుక్కుల ఒక్కగానొక్క కొడుకు జన్మరహస్యం…”

%d bloggers like this: