బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమైపోయాననుకుంటున్నారా గత ఆరు రోజులనుంచీ? ఏమీ అవలేదు, నా కంప్యూటరు కి “జ్వరం” వచ్చేసింది. ఇదిగో ఈవేళే “డాక్టరు” వచ్చి ఓ డోస్ వేసి వెళ్ళాడూ, మళ్ళీ ప్రారంభం! మనలో మనమాట, మీ అందరూ అనుకునుంటారు కదూ ” అమ్మయ్యా, ఈయన గొడవోటి వదిలిందీ.అబ్బ ఎంత refreshing గా ఉందో ఈ ఆర్రోజులూ” అని! అమ్మ! అంత సుళువుగా వదులుతానా నా బంధువుల్నీ?

   చెప్పాలంటే, నా కంప్యూటరుకి ఏమీ పేద్ద రోగం రాలేదు. ఓ దుర్ముహూర్తాన్నా, డెస్క్ టాప్ లో ఉన్నవన్నీ మాయం అయిపోయాయి. మేము ఎప్పుడూ ఉపయోగించే గూగుల్ క్రోం కూడా వెళ్ళిపోయింది. నేనేమైనా మీ అందరిలాగా expert నా ఏమిటీ, వాటన్నిటినీ సరిదిద్దుకోడానికి? IE ఒక్కటే కనిపించడం మొదలెట్టింది. దాంట్లో, నా యంత్రం.కాం తీసికుని పోనీ, రాద్దామంటే, దానిల్లుబంగారం గానూ, సరీగ్గా ఓచోటుండదే! ఏమిటో అంతా గందరగోళం అయిపోయింది. దానికి సాయం, గతవారం అంతా, మా కోడలు, ముంబై వెళ్ళడంతో
మాకు “ఇన్వర్టర్ డ్యూటీ” ( ఇది మా ఇంటావిడ పెట్టినపేరు!). కరెంటు పోవడంతో ఆటోమేటిక్ గా ఎలా లైట్లు వెలుగుతాయో, అలాగ, మా అబ్బాయో,కోడలో బయటకి వెళ్ళినప్పుడు, ఆటోమేటిక్ గా, మేమిద్దరమూ “సీన్” లోకొచ్చేస్తాము. పోనీ ఇదివరకులాగ, మేముండే ఇంటికి వచ్చి, నా తిప్పలేవో పడి, ఓ టపా రాద్దామనుకున్నా, మా కంప్యూటరు పడకేసేసింది.పోనీ, మా వాళ్ళ లాప్ టాప్పుల్లో ఏదో ప్రయత్నిద్దామా అంటే, నాకు కుదరదూ, పోనీ సాయంత్రం వేళల్లో, మా అబ్బాయి ఆఫీసు( లైబ్రరీ) కి వెళ్దామా, అక్కడ ఓ డెస్క్ టాప్ ఉందిలెండి, అనుకుంటే, రాత్రిళ్ళు కుక్కల్ని వదిలేస్తారూ, నాకా చచ్చే భయం! మరి ఇంకెక్కడినుండి వ్రాయనూ?ఇదండి వ్యవహారం!

   అయినా క్రిందటి వారమంతా బిజీ బిజీ. SBI కి వెళ్ళాము( వివరాలు ఇంకో టపాలో), నేను ఓ మిస్టరీ షాపింగోటి ( ESPRIT) చేశాను. గత 20 ఏళ్లుగా కలవని ఓ స్నేహితుడింటికి వెళ్ళాము ( జోక్ ఏమిటంటే, వాళ్ళు మా ఇంటికి వెనుక సొసైటీ లో ఉంటున్నారు!).నిన్న మా ఇంటావిడ పోలాల అమావాస్య పూజ చేసికుంది. ప్రసాదాలు, కొడుక్కీ, కూతురికీ ఇవ్వాలిగా, బయట హోరున వర్షం, అయినా వెళ్ళి ఆ పనేదో కానిచ్చాను! ఇంటావిడ దగ్గర సెహబాషీ సంపాదించాను. పైవారం లో ఇంకో మిస్టరీ షాపింగ్ చేయాలి. ఎల్లుండి వినాయకచవితీ, మనవడితో చేసికోవద్దూ?

   రేపటినుండీ మళ్ళీ ప్రారంభం, నాగోల !

%d bloggers like this: