బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అల్లుళ్ళ గురించి శ్రీ పుచ్చా వారి ఉవాచ….

నాకు ఈమధ్యన దొరికిన పుస్తకాల్లో, నిన్న శ్రీ పుచ్చా భార్గవ రామోజీ గారు వ్రాసిన కొన్ని ఆణిముత్యాలు వ్రాశాను. మరి పెద్దాయన్ని మర్చిపోతే ఎలాగ? శ్రీ పూర్ణానందం గారు
అల్లుళ్ళగురించి వ్రాసింది తెలిసికోవద్దూ?

    నవగ్రహాలూ కాక, సన్ ఇన్లాదశమ గ్రహం సుమా.ఆ నవగ్రహాలూ ఆకాశంలో సంచరిస్తూంటే, ఈ దశమగ్రహం ఉందే, ఇది సదా అత్తారింటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ గ్రహం తొలుత కన్యారాశిలోనూ,తదుపరి మిథునరాశిలోనూ,నిరంతరం కుంభరాశిలోనూ దృష్టి కలిగిఉంటుందయ్యా. దీనికి శాంతగుణం శూన్యం.ఇదొక వక్రగ్రహము, క్రూర గ్రహము, దీనిమూలంగా మామలకు యావజ్జీవితం వర్రీ,టెన్షనూ, ఇళ్ళూ భూములూ స్వాహా చేస్తుంది. పాపర్లను చేసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టిస్తుంది. హిరణ్యదానం దీనికి మహాప్రీతి.ఇంత డబ్బుదాహం ఈ గ్రహానికే. క్యాషే కాదు, వస్త్ర రూపం లో, వస్తురూపంలోనూ లైఫులాంగూ దోచుకుంటూనే ఉంటుంది. అల్లుడి కంటె శని, ఏల్నాటి శని బైఫార్ బెటర్. వాటికి ఏడో,పదునాల్గో సంవత్సరాల లిమిటేషన్ ఉంది, తరువాత కాలదోషం పడుతుంది. అల్లుడి పీడ పగవాడిక్కూడా వద్దు…” అని ఆ మామ ఆవేదనతో అన్నాడు.
ఇంక అల్లుళ్ళు ఎలా ఉండాలీ అనే విషయం మీద….

కొత్త అల్లుడంటే ఫెళఫెళలు,చెప్పుల కిర్రు,టెంపర్ కిర్రు.ఏమి జోరు? కొత్తలోనే ఆహ్వానాలు,కానుకలు,ఆషాఢ పట్టి, ఏడాదిలోపల తీసికెళ్ళడం, పెళ్ళికాగానే మూడు నిద్రలు, నవరాత్రిళ్ళు,సంక్రాంతి,సంవత్సరాది,అత్తారింట్లో ఏ అక్కర జరిగినా, ఎప్పుడు తోరణం కట్టినా, జామాతకు స్పెషల్ ఇన్విటేషన్.అతని రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.పాతపడినకొద్దీ, ఆట్టే పిలుపులూ ఉండవు, అధవా వెళ్ళినా గిట్టుబాటూ ఉండదు కనుక దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి.ఆట్టే బెట్టుపోయి తెగేదాకా లాగకూడదు. టాక్టు అవసరం. తొలిరోజులే గోల్డెన్ పిరియడ్.కాస్తో కూస్తో జమ అవుతుంది. ఛాన్స్ మిస్ కాకూడదు. ఎక్కువ చనువివ్వకూడదు. అధరము కదిలియు, కదలకుండా సంభాషించాలి!

” అల్లుని మంచితనంబును, బొల్లునుదంచిన బియ్యమును, తెల్లనికాకులును లేవు…” అని శాశ్వతమైన నింద. కనుక వచ్చిన చెడ్డ పెరు రానే వచ్చింది, వీలుగా ఉన్నంతవరకూ రాబట్టుకోడమే. తగుమోతాదులో మిడిసిపాటు పని చేస్తుంది.” జరుగుబాటు తక్కువ అదిరిపాటు ఎక్కువ” అని చాటున గొణుక్కుంటే, మీచెవిన పడవుకదా. అయినదానికీ,కానిదానికీ కస్సుబుస్సుమనాలి. చిర్రూ బుర్రూ వర్కు చేస్తాయి. కొండి ఆడిస్తూ ఉండాలి, కుట్టకూడదు, బెదురులో ఉంచాలి.” తాకుట్టకయున్న వృశ్చికము కుమ్మరి పుర్వని అందురే కదా”. భోజన సమయంలో ప్రతీదీ హితవుగా తినకూడదు గర్బాత్రంగాడనుకుంటారు. కావాలని కొన్ని అయిటమ్స్ విస్తళ్ళో నెట్టేయాలి. నాజూకు వెళ్ళబోయాలి.ఇంట్లో అందరికీ బక్క నీళ్ళైనా, నీకు మాత్రం పూటా తోడు పెరుగు కావాలని, కళ్ళను కాస్త నెత్తిమీదకు తోయాలి. నాలుగేళ్ళు జరిగితే వాటంతట అవే భూమిమీదకు దిగుతాయి. ఫోజులు వేయడం అల్లుళ్ళకు రివాజు. మగధీరులు వణికెది అల్లుళ్ళకూ, చలికేగా. ఆ అదుర్ని సద్వినియోగం చేసుకోవాలి.

అడిగినదానికి వెంటనే సమాధానం చెప్పకూడదు. దిక్కులు చూడాలి. ఇంటివద్ద మీ మాతృదేవత,తోబుట్టువులూ నేర్పిన పాఠం ఇక్కడ పోర్షన్ కరెక్టుగా ఆయా సీన్సులో అంటూ ఉండాలి. కరుణకు తావు ఇవ్వకూడదు…….” సంక్రాంతి, మామలకు పంటడబ్బు చేతికొచ్చే రోజులు.అల్లుళ్ళు యధాశక్తి దోచుకోవచ్చు. అలకపాన్పులో నీవు అధిష్టించి ఉండగా, ఫాదర్ ఇన్లా చెసిన ప్రామిస్ నెరవేర్చక జాప్యం చేసిఉంటే, సంక్రాంతికి అది ఫుల్ఫిల్ చేస్తేనే భార్యను పంపుతానని షరతు విధించు. నీవు నోరుతెరిచి అడగ్గూడదు, తేలికైపోతావు. నీకు ఆరువేలు మాత్రమే కట్నమిచ్చి, నీ మరదలు మ్యారేజికి నీ తోడల్లుడికి పదహారువేలు డౌరీ ఇచ్చాడని డిస్ప్యూట్ లేవదీయకూడదు. అప్పటికీ ఇప్పటికీ రూపాయి మారకం విలువ పడిపోలా?….”

ఇలా రాసుకుంటూ పోతే ఎన్నని రాయగలనూ? ఒక్కో కథా, ఒక్కో పేజీ అఛ్ఛోణీలండి బాబూ!మా ఇంటావిడ ఇప్పటికే, చివాట్లేస్తోంది, “ఆ పుస్తకాలు ఎన్నిసార్లు చదువుతారూ, మార్కెట్ కి వెళ్ళి కూరలు తెస్తేనే ఈవేళ వంట. లేకపోతే ఆవకాయో, నిమ్మకాయే గతి.” అని. ఇన్ని రాసేనుకానీ, మా అల్లుడు మాత్రం బంగారుకొండ.

%d bloggers like this: