బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–చాలామందికి నచ్చకపోవచ్చు…

   నిన్న సాయంత్రం మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాము.అవి ఇవీ కబుర్లు మొదలెట్టగానే ఆయన అడిగారూ- అన్నా హజారే దీక్ష మీద మీ అభిప్రాయం ఏమిటీ అని.నాకేమీ అంత ఆసక్తి లేదండీ అనగానే ఆయన కొద్దిగా ఆశ్ఛర్యపోయి, అదేమిటండీ, దేశమంతా అలా అట్టుడికిపోతూంటే, మీరలాగ అంటారేమిటీ,అన్నారు.నాకు ఆ విషయం మీద ఏదైనా ఆసక్తి ఉన్నా లేకపోయినా ,జరిగేది జరక్క మానదు కదా.అయినా ఎవరి అభిప్రాయాలు వారివీ, హాయిగా ఏవో కబుర్లు చెప్పుకోకుండా, ఈ గొడవంతా ఎందుకూ అన్నాను.ఆయన కొద్దిగా డిజప్పాయింట్ అయినట్లు కనిపించారు. ఏ పేపరు చూసినా, ఏ చానెల్ చూసినా ఇదే గొడవ.

   నాకు ఓ విషయం అర్ధం కాదు. దేశంలో చట్టాలకేం తక్కువా? ప్రతీ దానికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో పేజీలకి పేజీలు నింపారు. అవి కానట్లు, ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం ఇంకో చట్టం తెద్దామని ఓ ముసాయిదా తయారుచేశారుట, దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఒక్కరికీ దానిమీద శ్రధ్ధ లేదుట. దాన్ని ఎలాగైనా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఎలాగోలాగ దానికి చట్టరూపం తేవాలనేదే ప్రస్తుత సమస్య. అన్నా కీ, ప్రభుత్వానికీ ఇక్కడ వచ్చింది సింపుల్ ఇగో ప్రోబ్లం. ఆయన చెప్పింది ప్రభుత్వం ఒప్పుకోడం లేదూ, వీళ్ళు చెప్పింది ఆయన ఒప్పుకోడం లేదూ. ఏదో ఒకటీ, నలభై ఏళ్ళ తరువాత, ప్రభుత్వం మొత్తానికి దిగొచ్చింది కదా, ఏదో ఒకటి ప్రవేశపెట్టనీయొచ్చుకదా , ఆ బిల్లేదో పాస్ అయిన తరువాత, కావలిసినన్ని ఎమెండ్ మెంటులు చేసుకోవచ్చుగా. మన రాజ్యాంగానికే కావలిసినన్ని ఎమెండ్ మెంట్లున్నాయి, దీనికో లెఖ్ఖా? అసలు దీనికే ఒప్పుకోనంటున్నాడీయన. ఏదో ప్రజాస్వామ్యం, పార్లమెంటూ అని ఉన్నాయికదా, వాటి పని వాటిని చేసికోనీయొచ్చుగా.అబ్బే అలా కాదు, నేను చెప్పిందే వేదం అంటే ఎలా కుదురుతుందీ?

   గత అరవైఏళ్ళనుంచీ జరగనివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? కల్మాడీలూ, రాజాలూ, ఈవేళో రేపో మారన్నూ ఈ కరప్షన్ ఛార్జిలమీద జైలుకెళ్ళారా లేదా, కొద్దిగా సహనం ఉండాలని నా ఉద్దేశ్యం.యాక్టివ్ జ్యుడీషరీ ధర్మమా అని, నల్లధనం వ్యవహారం కూడా సుప్రీం కోర్టు చేతిలో ఉంది. ఎప్పుడో ఓ రోజున మన అతిరథమహారథులందరూ, జైల్లో కూర్చోవలిసిందే. మన సిస్టం మీద నాకు ఈమధ్యన చాలా నమ్మకం వచ్చేసింది. ప్రతీ సిస్టమ్ లోనూ కలుపుమొక్కలనేవి ఉంటాయి. అందరూ ” భారతీయుడు” లో కమల్ హాసన్ లాగుంటే, మజా ఏముంటుంది? మన న్యూస్ పేపర్లూ, టి.వీ. చానెళ్ళూ, వాటిల్లో తమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పే రాజకీయనాయకులూ ఏ గంగలో దూకుతారు?

   ఈవేళ ప్రొద్దుటినుంచి చూడండి, ఏ చానెల్ చూసినా జగన్ మీద రైడ్లగురించే. ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా, తను మాత్రం అక్కడెక్కడో ఓదార్పు యాత్ర చేసికుంటున్నాడు, తనకేమీ పట్టనట్లు. అయినా ఏణ్ణర్ధం నుంచీ రూఫ్ టాప్స్ మీదనుంచి అరుస్తున్నారు, ఎప్పటికోఅప్పటికి తనమీదా రైడ్లు జరుగుతాయని తెలుసు కదా, తనేమైనా తెలివితక్కువవాడా, ఇలా సి.బి.ఐ, వాళ్ళు వచ్చీరాగానే, “రండి రండి మీరాకయే మా అదృష్టమూ, ఇదిగో ఇవీ నేనూ, మా కుటుంబమూ సంవత్సరాలనుండీ జమా చేసిన అక్రమ ఆస్థులూ..” అని చూపించడానికీ? ఏదో చానెళ్ళ టి.అర్.పీలు పెరగాలీ, ఎంత హడావిడీ, ఇదే కదా ఆంఆద్మీ ఎంటర్టైన్మెంటు!

   వచ్చిన గొడవల్లా ఎక్కడంటే, అప్పుడెప్పుడో రాందేవ్ అదేదో దీక్ష చేశారుట, దేశం దేశం అంతా కాషాయ బట్టలు కట్టేశారు. ఓ వారంరోజులు జరిగిందా హడావిడంతా. ఇప్పుడు ఆయన ప్రసక్తే ఎక్కడా లేదు. ప్రస్తుతపు హవా అన్నా హజారే గారు. పోనీ ఆయనన్నదే రైటూ అనుకుని, ఆయనన్నట్లుగానే ఆయన అడిగినవన్నీ ఆ ముసాయిదాలో చేర్చి, పార్లమెంటులో ప్రవేశబెట్టారూ అనుకుందాము, అక్కడ ఆ బిల్లు పాసవుతుందని ఏదైనా గ్యారెంటీ ఉందా? మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిదాకా పాస్ అవనేలేదు. మన రాజకీయనాయకులు చాలా మంది జగజ్జంత్రీలండి బాబూ. వాళ్ళా ఈలాటి బిల్లులు పాస్ చేసేదీ? ఏదో వాళ్ళరోజులు బాగోక పట్టుబడాలికానీ, ఈ చట్టాలూ చట్టుబండలూ వాళ్ళనేం చేస్తాయి?

   రాత్రికిరాత్రి ఈ కరప్షన్ ని కూకటివేళ్ళతో లేపేయాలనుకోడం ఓ భ్రమ. ఇదేమైనా కంప్యూటరా ఏమిటీ Esc, delete అనగానే మాయమైపోవడానికీ?బహుశా నా ఈ టపా చదివిన తరువాత, నేను చాలా Sacrilegious గా కనిపించొచ్చు, ప్రస్తుత దేశ వాతావరణ దృష్ట్యా. కానీ ఉన్నదేదో చెప్పుకోవాలిగా. మరి నా ఈ అభిప్రాయాలన్నీ, నిన్న ఆయనతో చెప్తే, సిగపట్లదాకా వెళ్ళొచ్చు. ఇక్కడ రాసుకుంటే, చదివేవారు చదువుతారు లేకపోతే మానేస్తారు. పైగా ఇలాటివి అందరితోనూ చర్చించడం కష్టం. ఊరికే బ్లడ్ ప్రెషర్ పెంచుకోడం తప్ప.

%d bloggers like this: