బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–feel good….

    ఈమధ్యన SBI కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది, అదీ మా ఇంటావిడని తీసికునీ. ఏం లేదూ, ఎప్పుడో “స్వర్ణయుగం” రోజుల్లో, తనకీ, ఓ ఎకౌంటు తెరిచి, దాంట్లో డబ్బులేసేవాడిని లెండి. దాని ATM CARD నాదగ్గరే ఉండేది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఎప్పుడూ బ్యాంకులకీ వాటికీ వెళ్ళే సద్గుణాలు మా ఇంటావిడకి లేవు, పాపం వెర్రి ఇల్లాలు! అన్ని రోజులూ మనవే కావుగా, రోజూ ఆ టీవీ లో సీరియళ్ళూ అవీ చూస్తూంటుందిగా, ఎందుకైనా మంచిదీ అని. ఓ రోజు నిలేసింది.” అప్పుడెప్పుడో, పబ్లిసిటీకోసం నాపేరుమీద ఓ ఎకౌంటోపెన్ చేసినట్లు గుర్తూ, అసలు అందులో ఏమైనా ఉందా...” అంటూ. ఎప్పుడడిగినా దాటేస్తూంటాను, “నీకెందుకూ ఆ గొడవలన్నీ, కావలిసినవేవో తెస్తూనే ఉన్నానుగా, అనవసర టెన్షనూ అదీ నీకెందుకూ..” అని. తను మాత్రం ఎన్ని రోజులాగుతుందీ? ఇదిగో అదిగో అంటూ నాకు వచ్చే జీతం కూడా తెలియనీయకుండా, 40 ఏళ్ళు లాగించేశాను. మధ్యలో ఓసారి చెక్ చేస్తే, తన ఎకౌంటు లాక్ అయిపోయింది.ఎంతుందో తెలియదూ, మరి ఇలాటి “సున్నితమైన” విషయాలు ఆవిడతో చెప్పి క్షోభ పెట్టడం ఎందుకూ అని,అసలు చెప్పేలేదు.

   మనం దాస్తే దాగుతాయా రహస్యాలూ? నేను 2005 లో రిటైరయినప్పుడు, పెన్షన్ ఎకౌంటు, పెన్షనరు పేరుమీదే ఓపెన్ చేయించేవారు. మన “ఇన్నింగ్స్” పూర్తయి, ఫ్యామిలీ పెన్షన్ వచ్చేదాకా, వీళ్ళు పిక్చర్ లోకి వచ్చేవారుకారు. 2006 నుంచీ, పెన్షన్ ఎకౌంట్లు కూడా ” జాయింటు” పేర్లమీద ఇస్తున్నారుట.నాకేం తెలుసూ? ప్రయత్నిస్తే తెలిసేదేమో, ప్రయత్నిస్తేగా? మన సంగతెలాఉన్నా ఊళ్ళోవాళ్ళకి అన్నీ కావాలి! మాకున్న ఫ్రెండ్సందరూ రిటైరయినవాళ్ళేగా, ఆ మధ్యనెప్పుడో ఒకళ్ళింటికి వెళ్ళినప్పుడు, ఊరుకోవచ్చా ఏదో కబుర్లు చెప్పుకుని, అబ్బే, అలా ఉంటే వాళ్ళు చేసిన “ఘనకార్యాలు” అందరికీ తెలియొద్దూ? ” ఫణిబాబు గారూ, మీరూ చేసేశారా జాయింటూ పెన్షన్ ఎకౌంటూ…” అంటూ పుల్లెట్టేశారు!మా ఇంటావిడ అలాటి విషయాలు టపక్కున పట్టేస్తుంది! అప్పటికీ వ్యర్ధప్రయత్నం చేశాను టాపిక్కు మారుద్దామని, అబ్బే వాళ్ళా మార్చేది? అయిపోయింది నేనూ నా “దాపరికాలూనూ”.
ఆమాత్రం సూదిమొనంత జాగా ఇస్తే వదులుతుందా మా ఇంటావిడ? ప్రొద్దుటే లేవగానే సుప్రభాతం “ఏమండీ ఆ జాయింటు వ్యవహారమేదో చూడకూడదూ, ఎటొచ్చి ఎటొస్తుందో ఏమిటోనూ, అన్ని బావున్నప్పుడే చూసేస్తే బావుంటుంది కదా etc..etc...”

   ఇంక తప్పెదేముందీ, అప్పటికీ ప్రయత్నించాను, బ్యాంకులో రష్ గా ఉంటుందీ, చాలా టైము పడుతుందీ, ఎప్పుడో సావకాశంగా చూద్దాం లే అంటూ!ఆవిడా వదిలేదీ, ఎప్పుడో బ్లాగులోకూడా పెట్టేస్తుంది, అప్రతిష్ట కూడానూ!ఓ ముహూర్తం చూసుకుని బయలుదేరాము. ప్రొద్దుటినుంచీ, ఓ నాలుగ్గంటలపాటు క్యూలో నిలబెడితే, ఈవిడకి తెలుస్తుందీ, మళ్ళీ ఇంకెప్పుడూ అడగదూ అనుకున్నాను.నాకంత అదృష్టం కూడానా? అంతకుముందు ఓసారి SBI కి వెళ్ళినప్పుడు, నేను వరంగాం లో పనిచేస్తున్నప్పుడు అక్కడి SBI లో పనిచేసిన,ఒకతను పలకరించాడు, సరే అతన్నే బోరుకొడదామూ, పైగా “భాభీ ( మా ఇంటావిడలెండి!) ఎలా ఉందీ వగైరా వగైరాలన్నీ అడిగి పుణ్యం కట్టుకున్నాడాయే. మీకూ తెలుసునుగా, ఈ SBI ల్లో, ఎవరో ఒకరు తెలిసినవాళ్ళు లేపోతే, ఎన్ని తిప్పలు పడాలో!

   ఇక్కడి మా SBI బ్రాంచ్ లో ఆఫీసర్ గా ఉన్నాడూ, తిన్నగా లోపలకి వెళ్ళిపోయాము.సెక్యూరిటీ వాడేమైనా గొడవపెట్టి పరువు తీస్తాడేమో అని భయమైనా లేకుండా!వెళ్ళగానే, చాయ్ కూడా ఇచ్చి, మా పనులన్నీ అంటే KYC, మా ఇంటావిడ ఎకౌంటు యాక్టివేట్ చేయడం, నా పెన్షన్ ఎకౌంటు జాయింటు చేయడం, ఎప్పుడో వేసిన ఫిక్సెడ్ డిపాజిట్ రెన్యూ చేసి,పైగా దాన్ని కూడా జాయింటు చేయించి మరీ. ఏమిటో రోజులు బాగోపోతే ఇలాగే జరుగుతూ ఉంటాయి! పైగా ఆ పెన్షన్ ఎకౌంటు జాయింటు చేయడానికి, అవేవో నాలుగైదు ఫారాలూ అతనే నింపాడు! నాకు నింపడానికి కష్టం అవుతుందని!నాకు దొరికేవాళ్ళూ ఇలాటోళ్ళే! అన్ని పనులూ చకచకా మని పూర్తిచేసి మళ్ళీ ఇంకోసారి చాయ్ తెప్పించి, పంపేశాడు!

   మరీ అన్ని పనులూ మానుకుని, మాకోసం అంత టైము వేస్టు చేశాడూ అని థాంక్స్ చెప్తే, తనంటాడూ ” బాస్ మేము వరంగాం లో ఉన్నప్పుడు, మా బ్యాంకు వాళ్ళందరికీ ఎప్పుడైనా క్యూలో నుంచునే అగత్యం ఉండేదా? ఆ రోజులు ఎప్పుడైనా మర్చిపోతామా?” అన్నాడు. ఏం లేదులెండి, ఆరోజుల్లో, మాకు ఓ కన్జ్యూమర్ సొసైటీ ఉండేది, దానికి నేను ఆనరరీ క్యాషియర్ గా పనిచేశాను. గ్యాస్సూ, రేషనూ అక్కడే ఇచ్చేవారు.ఎప్పుడు చూసినా ప్రతీదానికీ క్యూలే.నేను ప్రతీ రోజూ క్యాష్ జమా చేయడానికి బ్యాంకుకి వెళ్ళేవాడిని, అక్కడేమో ప్రతీవాడికీ, రేషన్ లో పంచదారో, సిలెండరో అవసరమైనప్పుడల్లా నాతో చెప్పేవారు. నా జేబులోంచేమైనా ఇవ్వాలా ఏమిటీ. మర్నాడు వాళ్ళు సొసైటీకి రానఖ్ఖర్లేకుండా, గుమ్మంలోకి వచ్చేసేవి! జస్ట్ నా పవర్ లో ఉన్నదేదో చేయడం. అదేం పేద్ద గొప్ప ఆబ్లిగేషననుకోలేదు నేను ఆ రోజుల్లో. మన చేతిలో ఉన్నదేదో, అవతలివాడికి ఉపకారం చేస్తే మనకి పోయేదేమీ లేదని నేనకునేవాడిని. బ్యాంకు వాళ్ళే కాదు, ఎవరికి ఎలాటి ఎమర్జెన్సీ వచ్చినా, ఓ ఫోను చేస్తే, నా చేతుల్లో ఉన్నంత చేసేవాడిని.అలాగని అప్పుడు అలా చేశానూ, ఇలా చేశానూ అని గొప్పలు చెప్పుకోలేదు. కానీ, ఎంత చిన్నదైనా ఎప్పుడో చేసిన ఇలాటి చిన్న చిన్న హెల్పులు, గుర్తెట్టుకోడం అవతలివాళ్ళ గొప్పతనం!

   చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడో ఒకప్పుడు మనం చేసిన ఇలాటివి, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకీ మంచిచేస్తాయి. ఏదో ఈవేళ SBI లో మా పని తొందరగా అయిందికదా, ఏదో గొప్ప పని చేసేశానూ అని కాదు చెప్పడం, అప్పుడప్పుడు ఇలాటి feel good occasions కూడా ఉంటూంటాయి.చిన్ని చిన్ని సంతోషాలు జస్ట్..

%d bloggers like this: