బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   రేపు బయలుదేరి, ఓ మూడు రోజుల కార్యక్రమం పెట్టారు అబ్బాయీ కోడలూనూ. ఇక్కడకి రెండు వందల కిలోమీటర్ల దూరం లో ఉందట. ప్రొద్దుటే బయలుదేరాలని షెడ్యూల్.

   ఈ కారణం వల్లనే, మా ఇంటావిడా, కోడలూ క్రిందటి శుక్రవారమే వరలక్ష్మి పూజ చేసేసికున్నారు.అమ్మాయి మాత్రం ఈవేళే చేసికుంది. ప్రొద్దుటే, ఎనిమిదింటికల్లా, పిల్లలు స్కూలుకీ, మా అల్లుడు ఆఫీసుకీ వెళ్ళే లోపలే, వాళ్ళ అమ్మలాగ తెల్లవారుఝామునే లేచి, తొమ్మిది పిండివంటలూ చేసి, పూజ చేసికొని, వాళ్ళని పంపించేసింది. తనేమో Wfh. అదేమిటో మా చిన్నప్పుడు ఈ రాఖీలూ, అవీ ఉండేవి కావు. ఒక్క ఆర్.ఎస్.ఎస్. వాళ్ళచేతినే చూసేవారం ! వాళ్ళే కట్టుకుంఅబ్బాయి
టారనుకునే వాళ్ళం! ఇప్పుడో, అబ్బాయి అమ్మాయికీ, ఓ మనవరాలు తన తమ్ముడికీ, ఇంకో మనవరాలు తన తమ్ముడికీ కట్టుకుంటారు. రేపు ఇక్కడ ఉండముకదా అని మాఅబ్బాయి కూడా, వాళ్ళక్కచే రాఖీ ఓ రోజుముందరే కట్టించేసికున్నాడు.God bless them all! ప్రొద్దుటే, అక్కడకి వెళ్ళి,తను చేసిన ప్రసాదాలు తొమ్మిదీ తినేసి, ఇదిగో భుక్తాయాసం తో టపా వ్రాద్దామని, మేముండే ఇంటికి వచ్చేశాను, మా ఇంటావిణ్ణి తన కూతురు దగ్గర వదిలేసి!

   మళ్ళీ ఈ నాలుగు రోజులూ టపా వ్రాయకపోతే ఏమిటో తోచదు. అందుకోసమే ఈ టపా. ఏమిటో ఓ వ్యసనమైపోయింది, ఈ బ్లాగు పోస్టింగ్! ఎప్పుడు బయటపడతానో తెలియదు.అసలు నేనెందుకు రాజమండ్రీ కాపరం పెట్టాలీ, పెట్టాము ఫో, నాకు విడిగా ఓ కంప్యూటరివ్వాలీ, పోనీ ఇచ్చాడు ఫో, నేను ఈ బ్లాగులు రాయడం ఎందుకు మొదలెట్టాలీ, మొదలెట్టాను ఫో, నా శ్రేయోభిలాషులు ఎంతో మంది, నన్ను ఉత్సాహపరచాలీ, ఏమిటో నాకు ఈ వయస్సులో ఈ తాపత్రయం ఏమిటో?

   అసలు ఈ తాపత్రయాలనే వాటినుంచి ఎవ్వరూ బయట పడలేరనుకుంటాను. ఎవరి తాపత్రయం వాళ్ళది. మా అగస్థ్య ని చూస్తే, వాడిగొడవ వాడిదీ.ఇంట్లో రిమోట్ చూస్తే చాలు, పట్టుకుని పారిపోతాడు. నా దగ్గర కెమేరా చూస్తే చాలు, ఇచ్చేదాకా పేచీ. రేపటి ప్రయాణం గురించి, ఏమేం తీసికెళ్ళాలో, అందరికీ ఏమేమి ఎప్పుడెప్పుడు అవసరం అవుతాయో ఏమిటో అని మా కోడలు రెండు రోజులనుండి సద్దుతోంది. తన తాపత్రయం తనదీ. మా నవ్యకైతే, అక్కడ స్విమ్మింగు చేయడానికి ఎన్ని సూట్లేసికోవాలో అని తాపత్రయం. ఇంక మా ఇంటావిడైతే, మేము వెళ్ళే చోటుగురించి, నెట్ లో చూసేసి, ఆ ప్రదేశాలు అన్నీ చూడగలనా లేదా అని తాపత్రయం.

   తిరిగి వచ్చిన తరువాత విశేషాలతో రాస్తాను. బైదవే, నవంబరు లో, మా అబ్బాయి భార్య,అమ్మగారి చెల్లెలి కూతురు ( సింప్లీ పుట్, మా కోడలి కజిన్), పెళ్ళిట, నవంబరులో.అన్నీ బాగుంటే నవంబరు లో ప్రోగ్రాం వేసికుంటున్నాము పిల్లలతో భాగ్యనగరానికి. మేము అక్కడనుంచి, ఓ సారి రాజమండ్రీ దాకా వెళ్ళి, ఓ పదీ పదిహేను రోజులు గడుపుదామని అనుకుంటున్నాము. చూద్దాం.మా ఇంటావిడ ఈ మధ్యనే రైల్వేవాళ్ళ లెఖ్ఖల్లో సీనియర్ సిటిజెన్ కన్సెషన్ కి కొత్తగా చేర్చిన వాళ్ళల్లో చేరుతోందిగా, ఆ ముచ్చటా తీర్చుకుందామని!
ఏమిటో నా తాపత్రయం నాదీ…..

   పాఠకులందరికీ రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు….