బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– BSNL వాళ్ళతో వచ్చిన తిప్పలు…

           మన ప్రభుత్వ అండర్ టేకింగ్స్ వాళ్ళకి, వాళ్ళమీద ఓ పేద్ద అభిప్రాయం ఉంది. ఈ కోవలోకే వస్తుంది మన BSNL . పూణె తిరిగి వచ్చినప్పుడు, ప్రతీసారీ సెల్ ఎందుకూ, ఏదో గొంతెత్తి అరుస్తున్నారు BSNL వాళ్ళూ అని, ఓ లాండ్ లైన్ కి ఎప్లై చేశాను. అదేం ఖర్మమో, నేను ఫ్లాట్ తీసికున్న ఇలాకాలో కొత్తగా లైన్లు లేవన్నారు. కావలిసిస్తే ప్రెవేట్ సర్వీసువాడి దగ్గరకు వెళ్ళమని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. నాకు ఈ మాత్రం చాలు, పేట్రేగి పోవడానికి, BSNL జనరల్ మెనేజర్ దగ్గరకు వెళ్ళి ఛడా మడా కోప్పడేశాను. ఆయన మొత్తానికి నన్నూరుకోబెట్టడానికి ఓ WLL నాకు ఎలాట్ చేశాడు. పోనీ అదేనా సరీగ్గా పనిచేస్తుందా, అబ్బే, మామూలుగా వైర్లతో ఉండేదే పని చేయనప్పుడు, ఈ WLL ఏదో ఉధ్ధరించేస్తుందనుకోవడం బుధ్ధితక్కువ!

     మేముండేది, ఈ ఏరియా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ పక్కన. దెయ్యంలా ఆ టెలిఫోను టవర్ పక్కనే తగలడింది. అయినా సరే సిగ్నల్ రాదు. మా instrument ని అటు తిప్పీ,ఇటుతిప్పీ,
పద్మాసనాలూ, శీర్షాసనాలూ, భరత నాట్యాలూ ఏం చేయండి, ఏమీ ఉపయోగం లేదు. పైగా సిగ్నల్ పట్టుకుంటుందని, కిటికీ తలుపులు తీసి ఉంచితే, దోమలూ. ఏ నెంబరైనా డయల్ చేస్తే, పాపం నెంబరు దొరుకుతుంది. మధ్యలో సడెన్ గా సిగ్నల్ పోతుంది. మన ఫోను కట్టూ. అవతలివాడికి మనం ఉన్నామో ఊడేమో తెలియదు! ఆ instrument మా అగస్థ్యకు ఆడుకోడానికి తప్ప ఇంకేమీ ఉపయోగం లేకుండా పోయింది.

     ఎలాగోలాగ మార్చేసి, వైర్లున్న లాండ్ లైను తీసికుంటే బావుంటుందేమో అంది మా ఇంటావిడ. సరే అని ముందర దానికి బిల్లు కట్టడం మానేశాను! ఎప్పుడో విసుగొచ్చి వాళ్ళే తీసేస్తారులే అని. వాళ్ళా ఊరుకునేది, ఆ మధ్యన ఓ రోజు నా సెల్ లో ఫోనొచ్చింది. మీ ఎరియర్స్ కట్టండీ అని. సరే ఇంటికి రా అన్నాను. మనమేమైనా రాజాలు, కన్మొయీలా ఏమిటీ,ఎగ్గొట్టడానికి? వాడెవడో వచ్చి, మొత్తానికి ఓ వెయ్యిరూపాయలు తీసికుని, ఓ రసీదు చేతిలో పెట్టి పోయాడు. నా ఫోను ఎప్పుడు వినిపిస్తుందిరా అంటే, ఇదిగో ఈవేళ సాయంత్రానికీ అన్నాడు. ఇప్పటికి ఏడు సాయంత్రాలు అయ్యాయి, ఎప్పుడు ట్రై చేసినా ( నా సెల్లులోంచి) out of service అనే వస్తోంది.

     ఇలా కాదని నిన్న మా ఇంటిపక్కనే ఉన్న ఎక్స్ఛేంజ్ కి వెళ్ళాను.అక్కడ కంప్యూటర్ లో అది నొక్కీ, ఇదినొక్కీ “నీ పేరు రణదివే యా” అంది. మా తల్లే, నన్ను ఫణిబాబూ అంటారూ, అన్నాను. కాదు నీపేరు ఇలా ఉందీ అనగానే, మహరాజశ్రీ టెలిఫోనువాళ్ళు నాకు పంపిన బిల్లు అందులో నాపేరూ చూపించాను. ఏదొ ఒబ్లైజు చేసినట్లు మొహం పెట్టి, గొడవేమిటీ అంది. ఇది తల్లీ విషయం, మీ కలెక్టింగ్ ఏజన్సీ వాడు డబ్బులు తీసికుని, పైగా చెక్కైతే రియలైజేషనూ పాడూ అంటారని, స్వచ్చమైన కొత్త రూపాయనోట్లు కూడా ఇచ్చానూ, ఓ రసీదిచ్చాడూ, అని చూపిస్తే, మళ్ళీ అదీ ఇదీ నొక్కి, అసలు నీపేరన ఆ డబ్బు క్రెడిట్టే అవలేదూ అంది. పైగా ఓ ఉచితసలహా కూడా ఇచ్చింది– పెద్ద ఎక్స్ఛేంజ్ కి వెళ్తే అన్నీ తెలుస్తాయీ, అని. చూడమ్మా, నేను ఎక్కడకీ వెళ్ళేది లేదు. నా దగ్గర డబ్బులు పుచ్చుకున్నవాడు మీ ఏజంటు. నాఫోను BSNL, నేనొచ్చింది మీ ఎక్స్ఛేంజికి, ఏం చేస్తావో నాకు తెలియదు, నా ఫోను పనిచేయించడం నీ డ్యూటీ. లేదంటావూ, ఈ విషయంలో ఎంతదూరానికైనా వెళ్ళడానికి నేను తయారు. అసలే తిక్కశంకరయ్యని. రేపటి న్యూస్ పెపర్లతో మొదలెడతాను, నాక్కావలిసినంత ఖాళీ సమయం ఉంది. నీ ఇష్టం అన్నాను. ఏమనుకుందో ఏమో, అక్కడా ఇక్కడా ఎవరెవరికో ఫోను చేసి, సాయంత్రానికల్లా వచ్చేస్తుందీ, లేకపోతే నాకు ఫోనుచెయ్యీ అంది.

     సాయంత్రం దాకా ఫోను రాలేకపోవడం వలన, ఈవిడకు ఫోను చేస్తే తేలిందేమిటంటే, నా ఖాతాలో ఇంకా రెండు వందలు కట్టాలని తేల్చేరు. రేపెళ్ళి కట్టేయండి, ఫోనొచ్చేస్తుందీ అంది. సరే అని ఈవేళ ప్రొద్దుటే వెళ్ళి ఆ బాలెన్స్ ఎమౌంటు కట్టి, ఎప్పుడు యాక్టివేట్ చెస్తారూ అంటే, మాకు తెలియదూ, అని ఓ ఫోన్నెంబరిచ్చి వాళ్ళని అడగమన్నారు. మళ్ళీ ఇదో వట్టమా, మీ ఫోనునుండే చేస్తానూ అని ఫోనుచేస్తే, మళ్ళీ అదే గోల! ప్రస్తుతానికి ఇంకా ఫోను లేదు. నేను వదల్ననుకోండి వీళ్ళని.

     అసలో విషయం అర్ధం అవదు- ఈ ఏజంట్లకి ఔట్ సోర్సింగ్ చేస్తారే, వీళ్ళమీద కంట్రోల్ ఉండదా? మన డబ్బులతో వాళ్ళు జల్సా చేస్తూంటే అడిగే వాడే లేడా? మరి స్కామ్ములు జరుగుతున్నాయీ అని ఏడిస్తే లాభం ఏమిటీ?

    నా టపా ఎలాగా చదువుతారు, పనిలో పనిగా, పైన బాక్స్ లో పెట్టేనే దాన్ని కూడా ఓసారి చదివేయండి. దానిమీద రెండుసార్లు నొక్కితే ఇంకో విండోలో ఓపెన్ అవుతుంది. శ్రీ పుచ్చా భార్గవ రామోజీ గారు టెలిఫోన్ల గురించి వ్రాసినది. మరీ ఆయనన్నట్లుగా, మామాశ్రీ ద్వారా వచ్చింది కాదూ, పైగా మా విషయంలో మా ఇంటావిడ ధర్మమే, దానికి సిగ్నల్ రావడానికి. నాలుగు దెబ్బలేసి, డైనింగ్ టేబిల్ మీద కుదేసింది!

%d bloggers like this: