బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పోస్టు మార్టాలూ ప్రీమార్టాలూ….

    పోస్టుమార్టాలని విన్నాము కానీ, ఆ రెండోది అదే ప్రీ మార్టం అనేది ఉపయోగిస్తారో లేదో తెలియదు. పోన్లెండి ఏదో ఒకటీ, ప్రీ అంటే ముందరా, పోస్ట్ అంటే తర్వాతా అని తెలుసునుగా, అది చాలు ! ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడైనా ఓ యాక్సిడెంటులాటిది జరిగిందనుకోండి, ప్రతీవాడూ చెప్పేవాడే- అలా చేయకుండా ఉండవలసిందండీ, కొద్దిగా జాగ్రత్త తీసికుంటే బావుండేదిగా, ఏమిటో ఈ రోజుల్లో ఇంకోళ్ళ మాటవినే శ్రధ్ధా, ఓపికా ఎవరికుంటుందీ, ఎవరికి వాళ్ళు వాళ్ళంత తెలివైనవాళ్ళు ప్రపంచంలో ఇంకెవరూ లేరనుకుంటారు. అసలు రోజులే మారిపోయాయి, మారోజుల్లోఅయితేనా….. blah..blaah..blaaah..” అంటూ ఇంకోళ్ళెవరో వాళ్ళని ఆపేదాకా జ్ఞానబోధ చేస్తూనే ఉంటారు. మనకి వినడానికి ఓపికుండాలి.

“జ్ఞానబోధ” చేయడమంత సుళువైన ఉచిత వ్యాపంగం ఇంకోటి లేదు . అదేం ఖర్మమో ఇలాటివాళ్ళ దృష్టికి ఎప్పుడూ అవతలివాళ్ళ తప్పులే కనబడతాయి.అక్కడకి వాళ్ళెప్పుడూ జీవితంలో తప్పులుచేయనట్లే. వాళ్ళు చేసేదే రైటయిన పధ్ధతీ, అంతవరకూ బాగానే ఉంటుంది, కానీ అవతలివాళ్ళందరూ వెర్రివెధవలయినట్లు మాట్లాడతారే అప్పుడూ చిర్రెత్తుకొచ్చేది! ఈ జ్ఞానబోధానందులకి ఈ సంగతి ఎప్పుడూ తట్టనైనా తట్టదు. అది మన ప్రారబ్దం. అనుభవించాలి ఏం చేస్తాం? ఓపికుంటే వినడం, లేకపోతే, మళ్ళీ వాళ్ళ మొహం చూడకుండా ఓ దండం పెట్టి ఊరుకోవడం.

ఏదో బస్సులో వెళ్తున్నామనుకోండి, బస్సునిండా జనం, చేతిలో ఓ సంచీ, మరీ స్పీడుగా వెళ్ళే బస్సులో, చేతులొదిలేసి నుంచోలేముగా, వయస్సులో చిన్నవాళ్ళైతే ఓ చేత్తో పైనున్న బారు ని పట్టుకుంటారు. నాలాటివాడైతే, చేతిలో ఉన్న సంచీని, భుజానికి తగిల్చేసి, రెండు చేతులతోనూ వేళ్ళాడతాడు. ఇంతలో జేబులు కొట్టడమే హాబీ గా పెట్టుకున్నవాడు కాస్తా మన ప్యాంటు జేబులో ఉన్నదేదో లాగించేస్తాడు.అదో ట్రైనైనా అంతే. బస్సు దిగి నెత్తిన గుడ్డేసికుని కొంపకు చేరతాము. ఎక్కడనుండొస్తాడో మన జ్ఞానబోధానందుడు, ” అదేమిటి మాస్టారూ, మరీ అంత అజాగ్రత్తేమిటీ, వెనక జేబులో ఎవడో చెయ్యిపెడితే అసలు మీకు తెలియనేలేదంటే నమ్మేలా ఉందా” అనీ, ఆ విక్టిం కొద్దైగా వయస్సులో చిన్నవాడూ, అదీ తన కొడుకో ఎవడో అయ్యేడా, ఇంక వాడి పనైపోయిందే “ వెధవ్వేషాలు కాపోతే, అంత స్పర్శజ్ఞానం కూడా లేకుండాపోయేవన్నమాట. బస్సుల్లో ఓ ఆడపిల్ల కనిపించేసరికి ఒళ్ళు తెలియదు.
డబ్బు విలువ మీకేం తెలుస్తుంది, బయటకు వెళ్ళి ఓ రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో.( standard dialogues
)… వగైరా..” ఆ పిల్లాడు ఏ సమాధానమూ చెప్పకుండా ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతాడు, ఇంతలా అరుస్తూంటే ముంగిలా కూర్చుంటావేమిటీ, ఆ బస్సులో అంత రష్ అయితే, ఇంకో బస్సులో తగలడొచ్చుగా. టైముకి కొంపకు రాకపోతే ఢాం ఢూం అనేదీ ఈయనే ! అదివేరే విషయం!

ఆతావేతా చెప్పేదేమిటంటే, ప్రతీ రోజూ అదో exercise లాగ ఎవరినో ఒకరిని తిట్టడం. లేకపోతే ఆయనకు తిన్నదరగదు.అదీ విషయం.ఏ రోడ్డు దాటుతోనో, ఏ బస్సుకిందో,స్కూటరు కిందో పడి, ప్రాణం పోతే గొడవే లేదు, కానీ ఏ దెబ్బలో తగిలి బ్రతికి బయటపడ్డామా అంతే సంగతులు. గవర్నమెంటోళ్ళు చూడండి, ఎక్కడ ఏది జరిగినా, ఓ కమెటీ వేసేస్తారు. వాళ్ళకి ఓ ఏడాదో రెండేళ్ళో టైమిచ్చి ఓ రిపోర్టిమ్మంటారు. ఈ రిపోర్టిచ్చేలోపల అలాటివి జరిగితే మన ఖర్మ! ఏదో ఇమ్మన్నారుకదా అని ఆ కమెటీ వాళ్ళుకూడా ( ఇంకేమీ పనుండదుగా!) ఓ రిపోర్టిస్తారు. దానికీ ఓ పెద్ద కార్యక్రమమూ, పబ్లిసిటీ, ఫొటోలూ గట్రా ఉంటాయి. అలాటి రిపోర్టులు కొన్ని లక్షల్లో బూజు పట్టి ఉంటాయి ఏ విభాగంలొనైనా సరే.

అప్పుడెప్పుడో, మొరార్జీ దేశాయి గారి ఆధ్వర్యంలో ఓ Administrative Reforms Committee అని వేశారు. ఆ తరువాతకూడా అలాటి కమెటీలు వచ్చాయి. ఆ రిపోర్టులంటూ అమలు పరిస్తే అసలు ఈ అన్నా హజారేలూ, యాంటీ అవినీతీ గొడవే ఉండేది కాదూ అని ఇప్పుడంటున్నారు. మొరార్జీ గారినుండి ఇప్పటిదాకా ఓ డజను పార్టీల ప్రభుత్వాలొచ్చాయి, వీళ్ళందరికీ తెలియదా ఈ విషయం? అదండి ఈ పోస్ట్మార్టాల విషయం.

ఇంక ప్రీ మార్టాల విషయానికొస్తే, కొందరుంటారు మా ఇంటావిడ లాటివాళ్ళు, ప్రతీ సందర్భంలోనూ ఏదో సలహా చెప్తూనే ఉంటుంది పాపం. చెప్పిన ప్రతీసారీ, నేనే, “ఊరుకుందూ, ఎవేవో ఊహించేసికుని నీ బుర్ర పగలకొట్టుకుని, నా బుర్ర తినేస్తూంటావు” అని కొట్టిపారేస్తూంటాను. పాపం తను చెప్పేవి, మన క్షేమంగురించే అని ఓసారి అనుకుంటే నాదేం పోయిందీ.అబ్బే అలా చేస్తే మన గొప్పేమిటీ?

ప్రతీ విషయంలోనూ ఈ పోస్ట్మార్టాలూ, ప్రీమార్టాలూ ఉంటూనే ఉంటాయి. Life goes on.

%d bloggers like this: