బాతాఖానీ—లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం–4

    పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పని చేస్తున్న పిల్లల ఇంట్లో ఒకలాగ ఉంటుంది. ఏ గవర్నమెంటు ఉద్యోగమో చేస్తున్నాడనుకోండి, ఆ ఇంట్లో పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఎంత పే కమీషన్లొచ్చి జీతాలు పెరిగినా, ఇంకా వాళ్ళకి ‘ క్రెచ్ కల్చర్’ వంట బట్టలేదు. అందరికీ వేలల్లోనూ, లక్షల్లోనూ జీతాలు రావుగా.అందువలన నగరాల్లో కాకుండా, ఇంకా పట్టణాలలోనే ఉండే పిల్లల ప్రవర్తన వేరేగా ఉంటుంది.

అక్కడ ఏమిటంటే రిటైరు అయిన తండ్రి గారు, మనవడికో, మనవరాలికో ఇన్ ఛార్జ్ గా ఉంటూంటాడు. ఈ చిన్న పిల్లాడు స్కూలినుండి వచ్చినప్పటినుండీ, వీడి ఆలనా పాలనా తాతయ్యా,నానమ్మా చూసుకోవాలి. భార్యా భర్తా ( ఈ చిన్న పిల్లాడి తల్లితండ్రులు)సినిమాలకీ, వగైరాలకి ఠింగురంగా అంటూ ఊరంతా తిరుగుతూంటారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, ఈ పిల్లాడికి తిండి పెట్టడం దగ్గరనుండీ, నిద్రపుచ్చేదాకా వీళ్ళదే బాధ్యత. ఊళ్ళోవాళ్ళు ఎవరైనా అడిగితే, ‘ మా పిల్లాడికి వాళ్ళదగ్గరే అలవాటండీ’ అనడం.దీంతో ఆ పెద్దవాళ్ళ ముందరి కాళ్ళకి బంధం పడిపోతుంది. ‘ ఇమేజ్’ కాపాడుకోవాలిగా !

అప్పుడు వయస్సులోనూ చిన్నవాళ్ళే కావడం తో వాళ్ళ పిల్లలు పెరిగేటప్పుడు ఒళ్ళు వంచ కలిగేవారు. కానీ ఇప్పుడంత పరుగులు పెట్టలేరుగా. ‘సిరి అబ్బకపోయినా చీడ అబ్బినట్లు’ పట్టణాల్లో కూడా, ఈ కేబుల్ టి.వీ ల ధర్మమా అని ‘ కార్టూన్ నెట్వర్క్ లూ’ ‘ పోగో’ లూ వగైరా వగైరాలు మాత్రం అలవాటు అయిపోయాయి. ఈ చిన్న పిల్లలకి అన్నం పెట్టాలన్నా, బోనస్ గా టి.వీ ఉండాల్సిందే. ఈ పెద్దాళ్ళకి విశ్రాంతి దొరికేది ఎప్పుడయ్యా అంటే చిన్న పిల్లలు స్కూలికి వెళ్ళిన ఆ రెండు మూడు గంటలు మాత్రమే. వియ్యాల వారు అదే ఊళ్ళో ఉన్నా సరే,పిల్లల బాధ్యత ససేమిరా తీసికోరు. వాళ్ళ అమ్మా నాన్నా పిల్లలతో వేగలేరని కోడలి ఉద్దేశ్యం. అలాగని అక్కడికి వెళ్ళకుండా ఉంటారా, అబ్బే పదిహేను రోజులకోసారి ఈ పిల్లల్ని ‘ షో కేస్’చెయ్యొద్దూ!

ఇంక ఆ ఇంట్లో ఉన్న తల్లితండ్రుల బాధ పగవాడికి కూడా ఉండకూడదు.ఇంట్లో టైం టేబుల్ అంతా మారిపోతుంది.అక్కడి కుటుంబాలు జనరల్ గా ఎలా ఉంటాయంటే (నేను చూసినవి),భర్త ఏ కాలేజీ లోనో, లెక్చరర్, భార్య ఏ పోస్టాఫీసులోనో, బ్యాంకులోనో పనిచేస్తూంటుంది. వీళ్ళకి ఒక ‘ ఆంఖోం కా తారా’, వాడేమో కాన్వెంటుకో, ప్లేస్కూలుకో వెళ్తూంటాడు.

కోడలు గారికి తమ కుటుంబ భవిష్యత్తు మీద ఒక్కసారిగా ప్రేమ వచ్చేస్తుంది. ఇంక ఇంట్లో ఖర్చులమీదా, బడ్జెట్ లోనూ ‘కాస్ట్ కట్టింగ్’ ఎక్సర్సైజులు ప్రారంభం.మొదటి దెబ్బ ఇంట్లో ఉన్న పెద్దాయనమీద పడుతుంది. రిక్షాలో పిల్లాడిని పంపితే’ అసలే రోడ్లన్నీ ట్రాఫిక్కు తో నిండి ఉంటాయీ’ అనే సాకుతో,ఇంట్లో ఉన్న పెద్దాయనకి డ్యూటీ వేస్తుంది.హాయిగా మీకు ఎక్సర్సైజు గానూ ఉంటుంది,పిల్లాడు సేఫ్ గానూ ఉంటాడూ’అని పిల్లాడిని స్కూలికి దిగబెట్టే డ్యూటీ ఈయనకి పడుతుంది.కాదని ఎలా చెప్పగలడూ,నోరు మూసుకొని ఒప్పుకుంటాడు.ఈ పిల్లాడు స్కూలికి కొత్త మోజులో నడుస్తాడు. ఆ తరువాత పేచీ పెట్టి ఎత్తుకోమంటాడు. ఈయనకా ఓపిక ఉండదు, అలాగని చెప్పలేడూ.ఉన్న చిరాకంతా ఇంట్లో ఉన్న తన భార్య మీద చూపిస్తాడు.

అలాగని ఇంట్లో ఆవిడేమీ సుఖపడిపోవట్లేదు. ఆవిడ దినచర్య ప్రొద్దుటే మొదలౌతుంది. టైముకి కాఫీ తాగడం ఈయనకి నలభైయేళ్ళ నుండీ అలవాటు. అది పడితేనే కానీ ఏమీ చెయ్యలేడు.
తీరా ఫ్రిజ్జి లో చూస్తే పాలుండవు. ఉన్న గ్లాసుడు పాలూ చిన్నాడికి ఇవ్వాలి. రోజూ ఉండే పాలేమయ్యాయంటే, అంతకు ముందురోజు సాయంత్రం వియ్యాలవారు వచ్చారు, వాళ్ళకి కాఫీలూ అవీ ఇచ్చేటప్పటికి పాలు అయిపోయాయి. ఈ సంగతి కోడలు పిల్లకి తెలుసు. అయినా సరే తనకేం పట్టనట్టుగా ఉండిపోతుంది. ఆ పెద్దాయన ఏమైనా మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా, జస్ట్ ఓ కప్పు కాఫీ. పాపం దానికి కూడా నోచుకోలేదు.ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఓ ప్యాకెట్టు పాలు ఎక్స్ ట్రా తీసికోవచ్చుకదా.అమ్మో ఇంకేమైనా ఉందా, ఈ పెద్దాళ్ళు నెత్తెక్కేయరూ?

ఆ స్కూలుకెళ్ళే పిల్లాడికి యూనిఫారం అవీ ‘ మమ్మీ’ గారే వెయ్యాలి.వీడుకూడా ఆ తాతయ్యనబడే ప్రాణి తనని స్కూలికి తీసికెళ్ళడం, తిరిగి ఇంటికి తీసికుని రావడం ఒకటే పని అనుకుంటాడు.కొడుక్కీ, కోడలికీ భోజనం పెట్టి, వాళ్ళని పంపించేటప్పటికి ఈవిడకి తల ప్రాణం తోకకి వస్తుంది.ఖర్మ కాలి పని మనిషి రాలేదా, అంతే సంగతులు.అదృష్టం బాగుంటే ఒక్కొక్కప్పుడు
రాత్రి వంట కోడలు చేస్తుంది. ఇంక అక్కడ చూడాలి తినేవాళ్ళు నలుగురైనా సరే బియ్యం బొటా బొటీ గానే పెడుతుంది.ఇంత వయస్సు వచ్చిన తరువాత మరీ భారీగా తింటే అరగదూ అంటూ
ఓ హితబోధా! ఇవన్నీ ఎవరితో చెప్పుకుంటారూ? ఇదో టైపు టార్చరూ
…. ఇంకా ఉంది

.

%d bloggers like this: