బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–పుత్రోత్సాహం-8

    ఈ కాలపు పిల్లలు చెసే మంచి పనుల గురించి చెప్పానుగా గత రెండు బ్లాగ్గుల్లోనూ, మళ్ళీ ఈ పెద్దాళ్ళు పడే ‘తిప్పలు’ గురించి చూద్దాం! 30 ఏళ్ళుగా నోళ్ళు కట్టుకొని, ఉన్నదేదో పిల్లలే తింటారూ అనుకుంటారు.అక్కడికేదో వాళ్ళకి ఇష్టం లేదని కాదు.అదేదో పిల్లలే తింటే చూసి ఆనందించడం.ఎప్పుడైనా ఏ హొటల్ కైనా వెళ్ళినా,అక్కడ ఓ కాఫీ తాగేసి ఊరుకుంటారు పెద్దాళ్ళు.పిల్లలు ఏదడిగినా కాదనరు.మరి వీళ్ళ కోరికలు తీరేది ఎప్పుడంటా? ‘ ఆరోగ్యం పాడైపోతుందీ,చిరు తిళ్ళుతింటే’ అనే ఓ కుంటిసాకుతో వీళ్ళకి భోజనం తప్ప ఇంకేదీ తినడానికి వీలుండదు.ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందరూ బ్రెడ్డులూ, జామ్ములూ, నూడిళ్ళూ తింటారే కానీ, ఇంకేమీ కాదు.ఇవేమో పెద్దవాళ్ళకెందుకు పెట్టడమూ, వాళ్ళేమైనా తింటారా అని! పోనీ చిన్నప్పుడెప్పుడూ తినలేదూ, ఓ సారి టేస్ట్ చూపిద్దామనైనా తోచదు వీళ్ళకి.

   ఏదో చేసేద్దామని తపనే కానీ, పేద్దపెద్ద హొటళ్ళకి ఈ పెద్దాళ్ళని తీసికెళ్ళడం ఎందుకు? అక్కడేమైనా పప్పూ భోజనం, వంకాయ కూరా దొరుకుతాయా? అవి లేకుండా ఈ పెద్దాయనకి ముద్ద దిగదూ, ఆయనకి కావలిసినవి అక్కడ ఉండవూ,హాయిగా తల్లితండ్రులికి వాళ్ళకి కావలిసినవేవో ఇంట్లోనే తినేయమనొచ్చుగా.అబ్బే అలా కాదు, తమ స్నేహితులందరికీ తెలియాలి,తాము తల్లితండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో, ఎక్కడికి వెళ్ళినా తమతోనే ఎలా తీసికెళ్తామో.
ఇంకో దురభిప్రాయం ఏమిటంటే ఓ వయస్సు వచ్చిన తరువాత తల్లితండ్రులు ‘తీర్థ యాత్రలకి మాత్రమే ఎలిజిబుల్ అని ! జీవితం అంతా పిల్లల్ని పెద్ద చేయడంలోనే పుణ్యకాలం కాస్తా అయిపోయింది.పోనీ ఎక్కడికైనా టురిస్ట్ ప్లేసెస్ కి పంపొచ్చుగా.కొంతమంది పిల్లలకి ఇలాటి ఆలోచనలు వస్తూంటాయి. ఆ తల్లితండ్రులు ఏదో పెట్టిపుట్టారు.కానీ అలాటివారిని వేళ్ళమిద లెక్కపెట్టొచ్చు.

    ఇదివరకోసారి చెప్పాను, తల్లితండ్రులకి కొంచెం ప్రైవసీ ఉంటే బాగుంటుందని.ప్రస్తుత పరిస్థితులెలాగ ఉంటున్నాయంటే ఎప్పుడైనా పెద్దాయన తన భార్యతో ఏదైనా పరాచికాలాడాలంటే చుట్టురా చూసుకుని మరీ ధైర్యం చేయాలి! పాపం ఆయన మాత్రం పెళ్ళాంతో కాక ఇంకెవరితో సరసాలాడతాడండీ?ఒకళ్ళకొకరిని దగ్గరగా చూస్తే’ ఇంత వయస్సు వచ్చేకకూడా ఈ వేషాలకి మాత్రం ఏం లోటులేదూ’అంటారు.ఏం వాళ్ళుమాత్రం మనుష్యులు కాదా,వాళ్ళూ ఉప్పూకారం తినడంలేదా?ఇలాటివన్నీ వ్రాస్తే ఒక్కొక్కప్పుడు చదివేవాళ్ళకి బాగోదు.అయినా చెప్పకపోతే ఎలా తెలుస్తుందీ?

   ఇదివరకటి రొజుల్లో అయితే ఈ టీ.వీ లూ అవీ ఉండేవి కావు. ఈ రోజుల్లో ఇంట్లో ఏదైనా దెబ్బలాట కానీ, బేధాభిప్రాయం కానీ వచ్చిందా అంటే ఇదిగో ఈ దిక్కుమాలిన టి.వీ ల వల్లే.ఇంట్లో ఉన్న పెద్దాళ్ళు ఎంతసేపని ఒకరినొకరు చూస్తూ,ఒకళ్ళమీదొకళ్ళు అరుస్తూ గడుపుతారూ? వాళ్లకి కూడా ఓ ఛేంజ్ ఆఫ్ సీన్ ఉండాలిగా.ఈ పెద్దాయన ఉద్యోగంలో ఉన్నంతకాలం, మిస్ అయిన కార్యక్రమాలన్నీ, రిటైర్ అయిన తరువాత ఎంజాయ్ చెయొచ్చనుకుంటాడు.అక్కడే దెబ్బ తినేస్తాడు. ఈయన రిటైర్ అయేనాటికి టీ.వీ ల మీద సార్వభౌమాధికారం ఈయనకి ఉండదు.భార్యా,కోడలూ ఒకటైపోతే ఏ సీరియల్లో చూస్తూ కాలక్షేపం చేస్తారు.వాళ్ళు ఏవంటింట్లోకో వెళ్ళినప్పుడు, రిమోట్ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల చేతుల్లోకి వెళ్ళిపోతూంటుంది.ఇంక ఈయనేం చేస్తాడూ–చదివిన పేపరే చదువుతూ కాలక్షేపం! ఆకలేసినా సరే ఆ వస్తూన్న సీరియల్ ఆరోజు ఎపిసోడ్ పూర్తయేదాకా ప్రాప్తం ఉండదు. పోనీ ఆయన దారిన ఆయన వడ్డించుకోనిస్తారా అంటే అదీ లేదూ.అదృష్టం కొద్దీ ఈయనకేమైనా ఏ సుగర్ కంప్లైంటైనా ఉంటే పాపం టైముకి పెడతారులెండి.ఏదో ఒకటి అరారగా తింటూండాలిటగా ! ( ఇంకా ఉంది)

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–‘మిలే సుర్ మేరా’

Mile sur mera

నిన్న జూం చానెల్ లో విన్నాము.అదేమిటో నాకు 22 సంవత్సరాల క్రింద మొదటి సారిగా విన్నదే బాగుందనిపించింది. మిగిలిన వారి అభిప్రాయం ఎలా ఉందో అని నెట్ బ్రౌజ్ చేయగా,

నాకు నచ్చిన ఒక బ్లాగ్గు( ఇంగ్లీషులో)

Read it here.

%d bloggers like this: