బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ట్యూషన్లు

   మొత్తానికి ఏమయితేనే ‘సాక్షి’ కేలెండర్ వచ్చిందండి. అన్ని పేజిలలోనూ శ్రీ వై.ఎస్.ఆర్ ఫొటో పెట్టేశారు.ఆయనంటే అభిమానమే కానీ, మరీ ప్రతీ రోజూ ఆయన ఫొటో యే చూసేటంత అభిమానం లేదు. అందుకని దానిని కిచెన్ లో పెట్టేసి, వాటిమీద పాలవాడి దగ్గర ప్యాకెట్లు ఎప్పుడు పుచ్చుకోలేదో వ్రాసేసికుంటున్నాము!దేనికో దానికి ఉపయోగపడాలిగా !!

   నిన్న, మా కొత్తస్నేహితుడు శ్రీనివాసు, నేను బలవంతం పెట్టగా పెట్టగా, తన భార్య ని తీసికొని వచ్చాడు. పాపం ఆ అమ్మాయి నా ఖబుర్లు వినివిని బోరు అయిపోయుంటుంది.అతను అలవాటు పడిపోయాడు !!రెండు మూడు గంటలు కూర్చున్నారు.

   పూణే లో రెండు రోజులనుండి ఆటో వాళ్ళు సమ్మె చేస్తున్నారు. కారణం మరేమీ సీరియస్సు కాదు–వాళ్ళకి యూనిఫారం, బ్యాడ్జీ కంపలసరీ చేశారుట.దానికి వీళ్ళు సమ్మె చేస్తున్నారు.ఏదో వంక పెట్టడం సమ్మె అనడం.దీనివలన ఎక్కువ నష్ట పోయేది వాళ్ళే అని ఎప్పుడు గ్రహిస్తారో? వీళ్లందరూ పొట్టకోసమే కదా ఆటోలు నడిపేదీ.వాళ్ళ యూనియన్ లీడర్లకు ఏమీ పనిలేనప్పుడు, ఇదిగో ఇలాటి సమ్మె పిలుపులు ఇస్తూంటారు. వీళ్ళేమో, ఆ లీడర్లు ఏదో ఉధ్ధరించేస్తారని, సమ్మెలో పాల్గోడం.దీనివలన అందరికీ అసౌకర్యమే కదా!వీడికి రోజూ సంపాదించేది రాదు.మనమేమో బస్సుల్లో వెళ్ళడం.

    ఆ సందర్భం లోనే ఈ వేళ ఓ వ్యక్తి తో పరిచయం అయింది. బస్సు వచ్చేలోపల అతనితో కబుర్లు మొదలెట్టాను. అతను కావలిసిన వారి ఇంటికి వెళ్ళి ట్యూషన్లు చెప్తాడుట.ఇది బాగుంది.మా చిన్నప్పుడు చూశేవాళ్ళం, ఒక్క సంగీతం మేస్టారే ఇంటికి వచ్చి సంగీతం నేర్పేవారు. మిగిలిన క్లాసు పాఠాలన్నిటికీ ఎవరో ఒక మాస్టారింటికి వెళ్ళవలసి వచ్చేది.ఈ రోజుల్లో అయితే ఎక్కడ చూస్తే అక్కడ ‘కోచింగ్ క్లాసులు’ పుట్టగొడుగుల్లా వచ్చేశాయి.అమ్మాయిలూ, అబ్బాయిలూ సైకిళ్ళమీద రావడం,ఆ సైకిళ్ళన్నిటినీ రోడ్డు పక్కనే పెట్టుకుని, క్లాసులు అటెండ్ అయింతరువాత ఎప్పుడో రాత్రి పది గంటలకి కొంప చేరడం. తండ్రి అనుకుంటాడూ, అబ్బాయికి ట్యూషన్ పెట్టించేయడంతో తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. అసలు టెన్షన్ అంతా తల్లికే.ఈ పిల్లలు సవ్యంగా ఇంటికి వచ్చేవరకూ కళ్ళు కాయలయ్యేలా పాపం ఎదురు చూస్తూ ఉంటుంది.ఈ దృశ్యాలు ఏ ఊళ్ళో అయినా చూడొచ్చు. అమ్మ టెన్షన్ అనేది ‘యూనివర్సల్’ కదా!

    ఈ గోడవలన్నీ భరించే కన్నా హాయిగా ఇంటికి వచ్చి ట్యూషన్లు చెప్పేవారుంటే ఎంత ఉపయోగమో. అందులోనూ నగరాల్లో అయితే ఇంకా అవసరం. రోడ్లమీద వచ్చే గాడీలు తప్పించుకుంటూ
పిల్లాడు/పిల్ల ఇంటికి తిరిగి వచ్చేదాకా అమ్మకి టెన్షనే. ఆయన సెకండ్ నుండి టెన్త్ దాకా అన్ని సబ్జెక్టులకీ ఎరేంజ్ చేస్తారుట. బెంగుళూరు లో మా స్నేహితుడొకడు ఇలాగే ఇంటికి వెళ్ళి ట్యూషన్లు చెప్తూంటాడు(క్లాసు 11,12 లకు).నాకు చదువు చెప్పడాలు రాకపోయినా, చదువు వచ్చే మార్గాలగురించి అందరికీ తెలియచేయడం లో ఆనందం ఎక్కువ.అందుకనే పూణే లో పరిచయం ఆయన ఫోన్ నెంబర్లు తెలిసికున్నాను. నాకు పరిచయం ఉన్న నలుగురికీ చెప్తే, ఆ విషయం వాళ్ళకి ఉపయోగ పడితే అదో సంతృప్తి !!

%d bloggers like this: