బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు- N.R.A s

   ఎన్.ఆర్ ఏ అంటే తెలుసుగా, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్! ఎన్.ఆర్.ఐ అయే అదృష్టం ఎలాగూ లేదు, పోనీ ఇలాగైనా ఓ కొత్త టైటిల్ పెట్టుకుని సంతోషిద్దామని ఉద్దేశ్యం!పుట్టింది ‘కోనసీమ’ అయినా, గత 47 సంవత్సరాలనుండీ, ఆంధ్ర ప్రదేస్ కి బయటే ఉంటున్నాము. ఉద్యోగ రీత్యా ఇక్కడే ఉండడం వలన, మన ప్రాంతంలో కట్టుకున్న ఇల్లూ,నాన్నగారి ద్వారా వచ్చిన ఇల్లూ అమ్మేసి, పూణే లోనే స్థిర పడ్డాము. నేను ఇక్కడే ఉన్నాను కదా అని మా అమ్మాయీ, అబ్బాయీ కూడా ఇక్కడే స్తిర పడ్డారు. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, మాకు ‘ఎన్.ఆర్.ఏ’ టైటిల్
పూర్తిగా అన్వయించుకోవచ్చు.

47 సంవత్సరాలనుండీ ఇక్కడే ఉన్నా తెలుగు భాష మీద అభిమానం ఏ మాత్రం తగ్గలేదని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఇంటర్ నెట్ ధర్మమా అని తెలుగు గురించి ఉన్న చాలా సైట్లు రోజూ చూస్తూంటాము. ఇప్పటికీ పూణే లో ఏ తెలుగు మాట వినిపించినా పరిచయం చేసికుంటాను. 42 ఏళ్ళ సర్వీసు లోనూ తెలుగువాడినని సగర్వంగా చాటుకుంటూ,మిగిలిన భాషల వాళ్ళకు ఏమాత్రం తక్కువ కానని కాలరు ఎత్తుకుని మరీ తిరిగాను. ఇదేదో నేను ఏమేమో గొప్ప పనులు చేసేశానని కాదు.నేను చెప్పేదేమిటంటే మన ‘తెలుగు అస్థిత్వాన్ని’ అడుగడుగునా,అందరికీ చూపించకలిగాను.ఇప్పటికీ కొత్తగా వచ్చిన తెలుగు వారితో పరిచయం అయినప్పుడు, వాళ్ళు ‘నేను రమారమి 50 ఏళ్ళనుండీ ఇక్కడే ( మహారాష్ట్ర) లో ఉంటూ కూడా తెలుగు చక్కగా మాట్లాడ కలుగుతున్నానని! అంటే నేనంటానూ ‘ మాట్లాడలేక పోవడానికి ఏం రోగం? భోజనం ప్రతీ రోజూ ఎలా చేస్తున్నామో, ఊపిరి ప్రతీ క్షణం ఎలా పీలుస్తున్నామో, తెలుగు మాట్లాడడం, చదవడం కూడా అలాగే. అమ్మని ఎవరైనా మరచిపోతారా?‘అంటూంటాను.

రిజర్వు బ్యాంకు డెప్యూటీ గవర్నర్ గా పనిచేసిన శ్రీ బుర్రా వెంకటప్పయ్య గారి నుండి, ప్రస్తుత గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావు గారి దాకా, ఎంతమందికి మన కరెన్సీ నోట్లమీద సంతకం చేసే అదృష్టం వచ్చింది? వారు ‘మన తెలుగు వారు’ అని గర్వంగా చెప్పుకున్నాము. జాతీయ పతాక సృష్టి కర్త శ్రీ పింగళి వెంకయ్య గారి పేరు వినగానే ఒళ్ళు పులకరిస్తుంది.ఎన్నెన్నో రంగాల్లో
దేశ విదేశాల్లో మన తెలుగు వారు ఎంత పేరు తెచ్చుకున్నారో! ఏ రంగం తీసికొన్నా అందులో తెలుగు వారి ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది!

బయటి రాష్ట్రాల్లో ఉంటూ మన ఉనికిని సగర్వంగా చెప్పుకున్నాము. ఆఖరికి మహారాష్ట్రలో ‘శివసేన’ ఉద్భవించినప్పుడు కూడా, తెలుగు వారి మీద ఎవరూ వేలెట్టి చూపలేదు.ఇక్కడికి వచ్చిన కొత్తలో అంటే 1963 లో అందరినీ కలిపేసి ‘మద్రాసీ ‘ అనేవారు. వాళ్ళకి మేము ‘మద్రాసీలు’ కాదురాబాబూ,అని ఒప్పించడానికి తల ప్రాణం తోకకి వచ్చేది. కానీ, రోజులు గడిచేకొద్దీ, వివిధ రంగాల్లో మన తెలుగు వారు చేసిన ఉత్కృష్ట కార్యాల వల్ల ఇంకా పరువు ప్రతిష్ఠలు పెరిగాయి.

శ్రీ ఎన్.టీ.ఆర్ గారి ధర్మమా అని జాతీయ స్థాయిలో కూడా మన పేరు మ్రోగిపోయింది.’తెలుగు’ అన్నా ‘తెలుగు వాడు’ అన్నా అందరికీ తెలిసింది. దేశం లో హిందీ తరువాత తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ. సాప్ట్ వేర్ లో కూడా మనవాళ్ళే ఎక్కువ.

ఇదంతా 2008 చివరి దాకా ఉన్న పరిస్థితి. రామలింగరాజు అనే దౌర్భాగ్యుడు వీటన్నింటికీ ‘చరమ గీతం’ పాడేశాడు.2008 డిశంబర్ తరువాత మన తెలుగు రాష్ట్రానికి ఏదో ముసలం పట్టింది.ఒక్క రోజూ ప్రశాంతంగా ఉండడం లేదు. దీనికి సాయం, మొన్నటిదాకా తెలుగు వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి, మాట్లాడదానికీ ధైర్యం లేని ప్రతీ వాడూ, మనమీద జోక్కులు వేస్తున్నాడు. ఎక్కడైనా ఏదైనా ‘ప్రాడ్’ జరిగితే దాని వెనకాల ‘తెలుగు వాడి’ చెయ్యి ఉందంటున్నారు.పైగా ఏదైనా జరిగితే, ‘ఓహో వీడు గత నాలుగేళ్ళగా ఆంధ్రా లో ఉండి వచ్చాడుగా, ఏదో నేర్చుకునే ఉంటాడులే’ అనే దాకా వచ్చిందంటే మనం,మన రాష్ట్రం దాని పేరు ప్రతిష్టలూ ఎంత దిగజారిపోయాయో ఊహించుకోండి.

తెలుగు భాష మీదా, తెలుగు వాతావరణం మీదా అభిమానంతో రిటైర్ అయిన తరువాత రాజమండ్రీ లో అపార్ట్మెంట్ అద్దెకు తీసికుని మరీ ఉండొచ్చాను. ఆ ఏణ్ణర్ధం నా జీవితం లో అమూల్యమైన మధురమైన క్షణాలు.ఇప్పుడేమనిపిస్తోందంటే,మంచిదయింది, సరైన సమయంలో పిల్లల దగ్గరకు వచ్చేశామూ అని.నాకు అలాటి భావన వస్తుందని కలలో కూడా అనుకో లేదు.
ఇప్పుడు ఆంధ్ర దేశం లో ఉండకపోవడం మా అదృష్టం అనుకుంటున్నాము.ఇక్కడే పుట్టి పెరగడం వల్లైతే కానీండి, వాళ్ళకి ఆసక్తి ఉండడం లేకపోవడం వల్ల కానీండి, మా అశ్రధ్ధ వల్లైతే కానీండి,
వాళ్ళు తెలుగులో మాట్లాడతారు కానీ, చదవ లేరు.పోన్లే మనకింతే ప్రాప్తం అనుకుని, పోనీ తెలుగు గురించీ,తెలుగు వారు చేసిన ఉత్కృష్ట కార్యాల గురించీ ఛాన్స్ దొరికినప్పుడల్లా లెక్చర్ ఇచ్చేవాడిని. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూసి,వాళ్ళకి కూడా లోకువయ్యాము.

ఎప్పటికైనా మన పరువూ, ప్రతిష్ఠా తిరిగొస్తాయా? మేము తెలుగు వారము,అని సగర్వంగా చెప్పుకునే రోజు త్వరలో రావాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ

%d bloggers like this: